Movie Review - పంచతంత్రం

Friday,December 09,2022 - 03:59 by Z_CLU

నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, తదితరులు
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
సినిమాటోగ్రఫీ: రాజ్ కె. నల్లి
పాటలు: కిట్టు విస్సాప్రగడ
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు
బ్యానర్: టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్
రచన, దర్శకత్వం: హర్ష పులిపాక
నిడివి: 2 గంటల 21 నిమిషాలు
సెన్సార్: U
విడుదల: డిసెంబర్ 9, 2022

Panchathantram movie review
కథ
60 ఏళ్ల వేదవ్యాస్ (బ్రహ్మానందం), కూతురు రోషిణి (కలర్స్ స్వాతి)తో కలిసి ఉంటాడు. 60 ఏళ్ల వయసులో కొత్త కెరీర్ ఎంచుకుంటారు వేదవ్యాస్. కూతురు వద్దన్నా వినకుండా స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీలకు వెళ్తారు. తన అనుభవంతో 5 కథలు చెబుతారు. ఆ 5 కథల్లో పంచేద్రియాల్ని చూపిస్తారు. ఇంతకీ ఈ పంచతంత్రానికి వేదవ్యాస్ కు సంబంధం ఏంటి? తండ్రిలో తపనను రోషిణి అర్థం చేసుకుందా లేదా? ఆ 5 కథల్లో వేదవ్యాస్ ఏం చెప్పారు? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

నటీనటుల పనితీరు
ఆంథాలజీ కాబట్టి ఒక్కో కథలో ఒక్కో సెట్ స్టార్ కాస్ట్ వచ్చి వెళ్లిపోతుంది. అలా మొదటి కథలో నరేష్ అగస్త్య వస్తాడు. తనవరకు బాగానే చేశాడు కానీ కథలో దమ్ము లేకపోవడంతో తేలిపోయాడు. ఇక రెండో కథలో రాహుల్ విజయ్, శివాత్మిక కలిసి నటించారు. వీళ్ల క్యూట్ లవ్ స్టోరీ మెప్పిస్తుంది. ఇద్దరూ బాగా సెట్టయ్యారు. మూడో కథలో భార్యాభర్తలుగా నటించారు సముత్తరఖని, దివ్యవాణి. ఈ కథలో సముత్తరఖని యాక్టింగ్ ఔట్ స్టాండింగ్. ఇక నాలుగో కథలో నటించిన వికాస్, దివ్య శ్రీపాద గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎమోషన్స్ ను అద్భుతంగా పండించారిద్దరూ. ఐదో కథలో స్వాతి, ఉత్తేజ్ నటన ఆకట్టుకుంటుంది.

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా సినిమా బాగుంది. ప్రశాంత్ విహారి, శ్రవణ్ భరధ్వాజ్ అందించిన సంగీతం బాగుంది. రాజ్ కె.నల్లి సినిమాటోగ్రఫీ కథకు కొత్త లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, చాలా చోట్ల సన్నివేశాల్ని ట్రిమ్ చేయొచ్చు. ఆ ప్రయత్నం జరగలేదు. ఇక దర్శకుడు హర్ష విషయానికొస్తే, ఎంతో మెచ్యూర్ గా ఆలోచించి ఈ కథలు రాసుకున్నాడు. భావోద్వేగాల్ని కూడా బాగానే చూపించాడు కానీ, ఇంకాస్త ఎమోషనల్ గా చూపించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఒకదానికొకటి సంబంధం లేని కథలే అయినప్పటికీ.. 4-5 కథల్లో చూపించినంత ఎమోషన్ ను, మొదటి 2 కథల్లో చూపించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Panchathantram movie review
జీ సినిమాలు రివ్యూ
పంచేంద్రియాల గురించి మనకు తెలుసు. అదే విధంగా పంచతంత్ర కథల గురించి కూడా చాలామందికి తెలుసు. ఈ రెండింటినీ కలిపి తీసిందే ఈ పంచతంత్రం కథ. పంచేంద్రియాలకు 5 కథల్ని ముడిపెట్టి ఈ ఆంథాలజీ తీశారు. అంటే, స్వర్శ మీద ఓ కథ, రుచి మీద ఓ కథ, దృశ్యం మీద మరో కథ, ధ్వని మీద ఇంకో కథ, వాసన మీద ఓ కథ రాసుకొని తీశారు. ఈ కథలను బ్రహ్మానందం పాత్రతో చెప్పించడంతో పాటు, ఆయన పాత్రకు ముడిపెట్టిన విధానం బాగుంది. వెండితెరపై ఇదో కొత్త ప్రయత్నం.

5 కథలు.. 5 ఎమోషన్స్.. ఎన్నో కీలక పాత్రలు.. ఇలా ప్రతి 20 నిమిషాలకు ఓ కొత్త అనుభూతిని అందిస్తూ సాగింది పంచతంత్రం సినిమా. వయసుమళ్లిన వేదవ్యాస్ పాత్రతో సినిమా మొదలవుతుంది. 60 ఏళ్ల వయసులో కొత్త కెరీర్ ఎంచుకున్న వేదవ్యాస్, ఓ పోటీలో కథలు చెప్పడం మొదలుపెడతాడు. అలా మొదటి కథ మొదలవుతుంది.

నిజానికి ఇలాంటి యాంథాలజీస్ లో బాగున్న కథను ముందుగా పెట్టుకుంటారు. కానీ పంచతంత్రంలో దీనికి రివర్స్ లో జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ అంటూ ఇది మొదలవుతుంది. మొదటిసారి బీచ్ ను చూసిన యువకుడి కథ ఇది. దీంతో ఎక్కువమంది రిలేట్ కాలేరు. కనీసం అలా రిలేట్ అయ్యేలా కూడా కథనం లేదు. దీంతో పంచతంత్రం సినిమా పేలవంగా మొదలవుతుంది.

అయితే ఇది కొంతసేపు మాత్రమే. రెండో కథ నుంచి సినిమా పరుగులుపెడుతుంది. అయితే ఇక్కడ కూడా చిన్న చిన్న లోపాలున్నాయి. రెండో కథలో శివాత్మిక అద్భుతంగా నటించినప్పటికీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. కీలకమైన ఎమోషన్ ను ఏదైతే అందించాలనుకున్నారో ఆ భావోద్వేగం రెండో కథలో మిస్సయింది. కానీ చూస్తున్నంతసేపు మనసుకు హత్తుకుంటుంది.

ఇక వాసన అంటూ వచ్చిన మూడో కథ అర్థవంతంగా ఉంది. ఈ కథలో సముత్తరఖని యాక్టింగ్ చాలా బాగుంది. తన చిన్నప్పుడు జరిగిన ఘటనల వల్ల అతడు ఎంతలా ఇబ్బంది పడ్డాడనే విషయాన్ని హార్ట్ టచింగ్ గా చూపించారు. ఇక మిగిలిన 4,5వ కథల గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

శేఖర్-దేవిల కథతో మొదలైన నాలుగో కథ గుండెల్ని పిండేస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా, జీవిత భాగస్వామితో వాటిని పంచుకోవాలి తప్ప, బంధాల్ని తుంచుకోకూడదనే సందేశాన్ని ఈ కథలో చాలా బలంగా చూపించారు. వికాస్-దివ్య శ్రీపాద నటన అద్భుతంగా ఉంది. ఇక ఐదో కథ ఈ సినిమాకు సిసలైన ముగింపునిచ్చింది.స్వాతి, ఉత్తేజ్, చిన్న పాప, ఆదర్శ్ నటించిన ఈ కథ మనసుకు హత్తుకుంటుంది. కొంతమంది కళ్లు చెమ్మగిల్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత ఎమోషనల్ గా ఉంది ఈ కథ.

ఓవరాల్ గా, పంచతంత్రం సినిమా డల్ గా మొదలై హెవీ ఎమోషన్ తో ముగుస్తుంది. మొదటి కథ మినహా, ప్రతి కథ ఓ అందమైన అనుభూతినిస్తూ మనసుకు హత్తుకుంటుంది. ప్రతి కథలో ప్రతి పాత్రలో నటీనటులు చాలా బాగా చేశారు. దర్శకుడు హర్ష పులిపాక తన రైటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈమధ్య కాలంలో ఇంత సున్నితమైన భావోద్వేగాలతో సినిమా రాలేదు. ఈ వీకెండ్ ఓ మంచి ఎమోషనల్ రైడ్ కోసం పంచతంత్రం సినిమాను చూడొచ్చు. అయితే అరగంటకో కథ మారిపోయే ఈ ఆంథాలజీకి థియేటర్లలో ఏ మేరకు రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

రేటింగ్ – 2.75/5