Movie Review - మళ్లీ మొదలైంది

Friday,February 11,2022 - 10:16 by Z_CLU

నటీనటులు: సుమంత్‌, నైనా గంగూలి, వర్షిణి, సుహాసిని, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని తదితరులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టీజీ కీర్తి కుమార్‌
నిర్మాత‌: కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి
బ్యానర్: ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్
సంగీతం: అనూప్ రూబెన్స్‌
ఎడిటింగ్: ప్ర‌దీప్ ఇ రాఘ‌వ్‌
ఆర్ట్‌: అర్జున్ సురిశెట్టి
సీఈఒ: చ‌ర‌ణ్ తేజ్‌
నిడివి: 2 గంటల 5 నిమిషాలు
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 11, 2022
ఫ్లాట్ ఫామ్: ZEE5

‘మళ్లీ రావా’తో మెప్పించిన సుమంత్, ఇప్పుడు ‘మళ్లీ మొదలైంది’ అంటున్నాడు. నిజంగానే సుమంత్ కు సక్సెస్ మళ్లీ మొదలైందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

sumanth malli modhalaindi

కథ

సిటీలో ఫేమస్ ఛెప్ విక్రమ్ (సుమంత్). చిన్నప్పట్నుంచి వంటలంటే ఇష్టం. అమ్మ (సుహాసిని) పెంపకం, అమ్మమ్మ (అన్నపూర్ణమ్మ) గారాబం మధ్య పెరిగిన విక్రమ్ కు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువే. అలా చిన్నప్పట్నుంచి మహిళలతోనే ఉన్న విక్రమ్, తన భార్య నిషా (వర్షిణి)ను మాత్రం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతాడు. విక్రమ్ మెంటాలిటీ నిషాకు నచ్చదు. నిషాకు స్పేస్ ఇస్తున్నానని విక్రమ్ అనుకుంటాడు. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. చివరికి విడాకులకు దారితీస్తుంది.

తన విడాకుల కోసం ఫ్రెండ్ పవిత్ర (నైనా గంగూలీ)ను లాయర్ గా పెట్టుకుంది నిషా. విడాకులు తీసుకునే క్రమంలో పవిత్రకు ఎట్రాక్ట్ అవుతాడు విక్రమ్. కేవలం పవిత్రకు దగ్గరయ్యేందుకు ఆమె స్థాపించిన రీసెట్ అనే ప్రొగ్రామ్ లో కూడా జాయిన్ అవుతాడు. మరి నిషా నుంచి పొందలేకపోయిన ప్రేమను పవిత్ర నుంచి విక్రమ్ దక్కించుకున్నాడా? అసలు విక్రమ్ కు సెకెండ్ ఛాన్స్ దక్కిందా లేదా? రెండో పెళ్లి చేసుకుంటే ఎడ్జస్ట్ అవ్వక తప్పదా? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

నటీనటుల పనితీరు

ఈ కథకు సుమంత్ మాత్రమే సెట్ అవుతాడు. బహుశా.. ఇండస్ట్రీలో సుమంత్ తప్ప మరో హీరో ఈ కథకు సూట్ అవ్వడేమో అనిపిస్తుంది. అంతలా సినిమాలో సింక్ అయిపోయాడు సుమంత్. అతడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ పెర్ ఫెక్ట్ గా కుదిరాయి. హీరోయిన్ నైనా గంగూలీ, మరో హీరోయిన్ వర్షిణి తమ పాత్రలకు సూట్ అయ్యారు. భర్తకు విడాకులిచ్చిన పాత్రలో వర్షిణి, విడాకుల తీసుకున్న వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించే పాత్రలో నైనా గంగూలీ బాగా నటించారు. వెన్నెల కిషోర్ ఎప్పట్లానే తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. సుహాసిని, మంజుల ఘట్టమనేని, అన్నపూర్ణమ్మ, పోసాని తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు.

టెక్నీషియన్స్ పనితీరు

అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. శివ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మంచి లుక్ తీసుకొచ్చింది. కృష్ణచైతన్య, రెహ్మాన్ సాహిత్యం బాగుంది. ఇలాంటి కథకు డైలాగ్స్ చాలా కీలకం. ఆ విభాగంలో సినిమా సూపర్ సక్సెస్ అయింది. హీరో క్యారెక్టర్ తో పాటు.. పోసాని, సుహాసిని పాత్రలకు మంచి డైలాగ్స్ పడ్డాయి. దర్శకుడిగా కీర్తికుమార్, అన్ని డిపార్ట్ మెంట్స్ నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకున్నాడు. అతడి రచనా శైలి కూడా బాగుంది. ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

malli-modalaindi-review-in-telugu 1

జీ సినిమాలు రివ్యూ

సుమంత్ సినిమాలపై ప్రేక్షకులకు ఓ ఐడియా ఉంది. మరీ ముఖ్యంగా మళ్లీరావా తర్వాత సుమంత్ కు తెలియకుండానే ఓ ఇమేజ్ వచ్చేసింది. మళ్లీ రావా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సుమంత్ నుంచి ఆడియన్స్ కోరుకునే సినిమా వచ్చింది. అదే మళ్లీ మొదలైంది. సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ ఆర్బన్ రొమాంటిక్-కామెడీ చూస్తే, సుమంత్ ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తీశారేమో అనిపిస్తుంది. అంతలా ఈ హీరో ఇందులో సెట్ అయ్యాడు.

ప్రస్తుతం సొసైటీలో డివోర్స్ ఎక్కువైపోయాయి. మరి విడాకుల తర్వాత వాళ్ల లైఫ్ ఎలా ఉంటుంది? సెకెండ్ ఛాన్స్ తీసుకుంటారా, తీసుకోరా? ఈ సినిమాలో అదే పాయింట్ ను డిస్కస్ చేశారు. ఇది కేవలం కాంటెంపరరీ పాయింట్ మాత్రమే కాదు, సెన్సిటివ్ ఇష్యూ కూడా. ఇలాంటి అంశాన్ని సున్నితంగా, ఫన్ మిక్స్ చేసి చెప్పడం నిజంగా కష్టం. ఈ విషయంలో దర్శకుడు కీర్తికుమార్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఈ సీరియస్ సబ్జెక్ట్ కు ఇతడు ఫన్ యాడ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

హీరో ఓ చెఫ్. ఇండిపెండెంట్ విమెన్ మధ్య పెరుగుతాడు. అమ్మమ్మ, సింగిల్ మదర అతడ్ని పెంచుతారు. ఇతడి ఫ్రెండ్స్ కూడా అమ్మాయిలే. ఇంతమంది మహిళల మధ్య పెరిగి పెద్దవాడైన హీరో, తన పర్సనల్ లైఫ్ విషయానికొచ్చేసరికి భార్యను హ్యాండిల్ చేయలేకపోతాడు. చివరికి విడాకుల వరకు వస్తాడు. అయితే అక్కడితో లైఫ్ ముగిసిపోదు. ప్రతి వ్యక్తికి సెకెండ్ ఛాన్స్ ఉంటుందనే విషయాన్ని ఈ సినిమాలో చెప్పారు.

అయితే మొదటి భార్యతో ఎదురైన సమస్యలే, పెళ్లి చేసుకోబోయే రెండో అమ్మాయితో కూడా ఎదురైతే హీరో ఏం చేశాడనే విషయాన్ని ఇందులో ఫన్నీగా చూపించారు. పైగా ఓ అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉంటూ, మరో అమ్మాయికి ఎట్రాక్ట్ అవ్వడమనే టిపికల్ మగ బుద్ధిని కూడా ఇందులో ఫన్నీగా, అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించడంలో డైరక్టర్ సక్సెస్ అయ్యాడు.

ఇలాంటి సబ్జెక్టులకు ఎండింగ్ ఏంటనేది అంతా ఊహించుకోగలం. కాకపోతే శుభం కార్డు వరకు సినిమా ఎలా నడిచిందనేది ఇంపార్టెంట్. ఈ విషయంలో హీరో-దర్శకుడు మంచి సింక్ లో సాగారు. సెకెండాఫ్ లో కాన్ ఫ్లిక్స్ కోసం రాసుకున్న సన్నివేశాలు, హీరో స్వభావాన్ని తెలియజేసే సీన్లు బాగా పండాయి. ఇక పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి, అమ్మాయి ఎలా ఆలోచిస్తుందనే కోణాన్ని కూడా బాగా ఆవిష్కరించారు.

రీసెట్ అనే కాన్సెప్ట్ పెట్టి దాని చుట్టూ కథను అల్లుకున్న విధానం బాగుంది కానీ, క్లైమాక్స్ లో హీరో కోసం హీరోయిన్ డ్రామా ఆడడం, హీరోను తనవాడ్ని చేసుకోవడం ఎపిసోడ్స్ అన్నీ ఫాస్ట్ గా లాగించేసినట్టు అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ ఎడిటింగ్ కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ పక్కనపెడితే హీరో కోసం ‘రిజిస్టర్ మ్యారేజ్’ అనే డ్రామాను దర్శకుడు కన్విన్సింగ్ గా, ఎఫెక్టివ్ గా చూపించలేకపోయాడు. ఇక అక్కడక్కడ పెట్టిన యాక్షన్ అవసరం లేదనిపిస్తుంది.

ఇలాంటి చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ను మినహాయిస్తే.. రెండో పెళ్లి అవసరం అనే సోషల్ ఎలిమెంట్ ను దర్శకుడు చాలా సున్నితంగా, భావోద్వేగంగా చూపించాడు. మరీ ముఖ్యంగా ఈ కీలకమైన ఎపిసోడ్ లో పోసానిని వాడుకున్న విధానం మెప్పిస్తుంది. ఎవరో ఒకరు సర్దుకుపోతే జీవితం ఎంతో బాగుంటుందనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చారు. సుమంత్ యాక్టింగ్ ను మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరోసారి గోదావరి, మళ్లీ రావా సినిమాల ఫ్లేవర్ ను చూపించాడు సుమంత్. హీరోయిన్ నైనా గంగూలీ తన పాత్రకు పెర్ ఫెక్ట్ అనిపించుకుంది. సుహాసిని, మంజుల పాత్రలతో లెక్చర్లు ఇప్పించినా, ఈ కథకు అది ఓకే అనిపిస్తుంది. అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె కామెడీ, హీరోతో ఆమె కెమిస్ట్రీ భలే కుదిరింది. వెన్నెల కిషోర్ ఎంట్రీలో హిలేరియస్ గా కనిపించిన కామెడీ, సినిమా లోపలకు వెళ్లినకొద్దీ చప్పబడిపోయింది.

టెక్నికల్ గా మూవీ రిచ్ గా ఉంది. ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ కథకు ఇంతే పెట్టాలి అనే లెక్కలు వేసుకోకుండా బాగా ఖర్చు చేశారు. అనూప్ రూబెన్స్ ఈసారి పాటలతో కంటే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకోవడం విశేషం. ఇంతకుముందే చెప్పుకున్నట్టు క్లైమాక్స్ తప్ప మిగతా అంతా ప్రదీప్ ఎడిటింగ్ ఓకే.

ఓవరాల్ గా సున్నితమైన భావోద్వేగాలతో, అర్బన్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్-కామెడీగా వచ్చిన మళ్లీ మొదలైంది సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో సుమంత్ సక్సెస్ ట్రాక్ మళ్లీ మొదలైందని చెప్పుకోవచ్చు.

రేటింగ్ : 2.75/5