'ఖిలాడి' మూవీ రివ్యూ

Friday,February 11,2022 - 01:57 by Z_CLU

నటీనటులు : ర‌వితేజ‌, మీనాక్షి చౌదరి, డింపుల్ హ‌య‌తి, అర్జున్ తదితరులు

సినిమాటోగ్ర‌ఫీ : సుజిత్ వాసుదేవ్‌

మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాణం : ఏ స్టూడియోస్‌, పెన్ స్టూడియోస్‌

నిర్మాత‌ : స‌త్య‌నారాయ‌ణ కోనేరు

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ వ‌ర్మ‌

నిడివి : 154 నిమిషాలు

విడుదల తేది : 11 ఫిబ్రవరి 2022

 

రమేష్ వర్మ డైరెక్షన్ లో రవితేజ నటించిన ‘ఖిలాడి’ ఈరోజే గ్రాండ్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘క్రాక్’ తర్వాత రవితేజ నుండి వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని మాస్ మహారాజా అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథేంటి ?

మోహన్ గాంధి(రవితేజ) డబ్బు కోసం ఏదైనా చేస్తూ, ఎంతకైనా తెగించే రకం. అలాగే హోం మినిస్టర్ గురు సింగం(ముకేష్ రుషి) కి ముఖ్య మంత్రి అవ్వడమే ధ్యేయం. ఇందుకోసం పది వేల కోట్లు కూడబెట్టుకుంటాడు. ఆ డబ్బుని ఒక కంపెనీ చైర్మన్ రాజశేఖర్(రావు రమేష్) కి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. అనుకోకుండా ఆ మనీ ట్రాన్స్ఫర్ కేసులో రాజశేఖర్ ని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తుంటాడు సిబిఐ ఆఫీసర్ అర్జున్ భరద్వాజ్.

మరో వైపు మోహన్ గాంధి కూడా ఆ డబ్బు కోసం మనీ గేమ్ ఆడుతుంటాడు. ఎలాగైనా పది వేల కోట్లు కొట్టేయడానికి  కట్టుకథలు అల్లుతూ స్మార్ట్ ప్లే చేస్తుంటాడు. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ కూతురు పూజ(మీనాక్షి చౌదరి)ను అలాగే డబ్బుకోసం ఏదైనా చేసే మరో అమ్మాయి(డింపుల్) ని తెలివిగా వాడుకుంటూ వారి ద్వారా డబ్బు సొంతం చేసుకునే ప్లాన్ చేస్తుంటాడు. మరి పదివేల కోట్ల కోసం కొందరు కలిసి ఆడే మనీ గేమ్ లో ఫైనల్ గా గెలిచిందెవరు ? ఆ డబ్బుని చివరికి సొంతం చేసుకున్నదెవరు ? అనేది మిగతా కథ.

 raviteja khiladi movie stills

నటీ నటుల పనితీరు :

మాస్ మహారాజా రవితేజ మోహన్ గాంధి క్యారెక్టర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచాడు. రెండు షేడ్స్ ఉండే పాత్రలో కనిపిస్తూ మెప్పించాడు. కిక్ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి అలాంటి పాత్ర దగ్గర దక్కడంతో తన పెర్ఫార్మెన్స్ తో ఆ మేజిక్ రిపీట్ చేశాడు. మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కి సూటయ్యింది. కాకపోతే నటన పరంగా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది. కొన్ని సన్నివేశాల్లో బాగానే నటించినప్పటికీ మరికొన్ని సీన్స్ లో మాత్రం నటిగా తేలిపోయింది. డింపుల్ హయతి తన గ్లామర్ షో తో సినిమాకు ఎట్రాక్షన్ గా నిలిచింది. మురళి శర్మ , అనసూయ , వెన్నెల కిషోర్ కి కథలో కీలకమైన పాత్రలు దొరకడంతో ఆ పాత్రలకు న్యాయం చేశారు.

రామకృష్ణ పాత్రలో ఉన్ని ముకుందన్ , మినిస్టర్ గా ముకేష్ రుషి , విలన్స్ గా నికితిన్ దీర్ , ఠాకూర్ అనూప్ సింగ్ ఆకట్టుకున్నారు. కానీ పవర్ ఫుల్ విలనిజం చూపించలేకపోయారు. చిన్ని పాత్రలో బేబీ శన్విత బాగా నటించింది.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు తన మ్యూజిక్ తో ప్లస్ అయ్యాడు దేవి శ్రీ ప్రసాద్. ఆకట్టుకునే పాటలతో పాటు సన్నివేశాలను ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం అందించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే నేపథ్య సంగీతం బాగుంది. పాటలు విజువల్స్ గా కూడా ఆకట్టుకున్నాయి. సుజిత్ వాసుదేవ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. అమ‌ర్ రెడ్డి ఎడిటింగ్ పరవాలేదు. సాగర్ రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. రామ్ లక్ష్మణ్ తో పాటు అంబు అరివు కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ అలరించేలా ఉన్నాయి.

రమేష్ వర్మ రాసుకున్న కథ -కథనం రొటీన్ అనిపించాయి. శ్రీకాంత్ విస్సా -సాగర్ రచనా సహకారం సినిమాని సక్సెస్ ట్రాక్ లో పెట్టలేకపోయింది. నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి.

raviteja khiladi

జీ సినిమాలు రివ్యూ :

‘క్రాక్’ కి ముందు వరకూ కొన్ని సినిమాలతో నిరాశ పరిచిన రవితేజ ‘క్రాక్’ తో మళ్ళీ  సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. కాకపోతే ‘ఖిలాడి’ తో  ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు. రమేష్ వర్మ ఎంచుకున్న కథ -కథనం రొటీన్ గానే ఉన్నాయి. ఇందులో అతడు రాసుకున్న రెండు మూడు ట్విస్టులు బాగున్నప్పటికీ ఫైనల్ గా అవి కూడా సూపర్బ్ అనిపించవు. ఎక్కడికక్కడ బ్రేకుల్లా సినిమా కథని ఏవేవో ట్విస్టులతో నడిపించి మెస్మరైజ్ చేయాలని గట్టిగా ప్రయత్నించాడు దర్శకుడు. కమర్షియల్ సినిమాలో ఎక్కువ ట్విస్టులు పెట్టి మళ్ళీ వాటితో ఆడియన్స్ ని ఫూల్స్ చేయడం తగదు. ఈ ఫార్మెట్ స్క్రీన్ ప్లే క్రైం థ్రిల్లర్స్ కి మాత్రమే కుదురుతుంది. రవితేజ లాంటి హీరోని పెట్టుకొని ఆ ఎనర్జీని వాడుకుంటూ కథను ఎంచుకొని దానికి తగ్గట్టుగా కథనం రాసుకోవడంలో దర్శకుడు మరోసారి ఫెయిల్ అయ్యాడు.  ప్లే స్మార్ట్ అనే ట్యాగ్ లైన్ పెట్టి మనీ గేమ్ తో సినిమాను నడిపించాడు దర్శకుడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగునప్పటికీ ఇదెలా సాధ్యం అనిపించక మానదు. అక్కడ ఆడియన్ ఆ ట్విస్టుని ఎంజాయ్ చేస్తూనే లాజిక్స్ గురించి ఆలోచిస్తాడు.

ఫస్ట్ హాఫ్ అంతా మర్డర్ మిస్టరీ, హీరో హీరోయిన్ కి తన కథ చెప్పడం అందులో లవ్ , ఫ్యామిలీ గురించి చెప్పడంతో స్లోగా నడిపించేసాడు దర్శకుడు. మధ్యలో మురళి శర్మ క్యారెక్టర్ తో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ అది అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదనిపించింది. ఫస్ట్ హాఫ్ లో అనసూయ , వెన్నెల కిషోర్ తో హిలేరియస్ గా పండే  కామెడీ ట్రాక్స్ రాసుకుంటే బాగుండేది. ఇక మొదటి భాగాన్ని అలా సోసోగా నడిపించేసిన దర్శకుడు రెండో భాగాన్ని మాత్రం స్క్రీన్ ప్లేలో కాస్త స్పీడ్ చూపిస్తూ రవితేజ క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా రెండో భాగంలో రవితేజ క్యారెక్టరైజేషణ్ ‘కిక్’ సినిమాను గుర్తుకుతెస్తుంది. అలాగే క్లైమాక్స్ కి ముందు అనసూయ , వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ తో ఓ స్టోరీ చెప్పించి దర్శకుడు మళ్ళీ ‘కిక్’ సినిమానే తిప్పి తీసాడా ? అని అనుకునేలోపు అది కట్టుకథ అని తేల్చేసి మళ్ళీ కథని మరో ట్విస్టుతో ముందుకు నడిపించాడు.

నిజానికి హీరోని నెగిటివ్ గా చూపిస్తూ ఫైనల్ గా అతను ఇదంతా చేసేది ఏదో ఒక మంచి పనికే అని చెప్పడం ఒక పద్ధతి. కానీ డైరెక్టర్ రమేష్ వర్మ ‘ఖిలాడి’ కి సంబంధించి ఆ పద్ధతి ఫాలో అయినట్టే అయి చివరిలో హీరో క్యారెక్టర్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే సినిమాను ముగించేశాడు. బహుశా సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారేమో. అది చెప్పకపోవడం వల్ల హీరో ఆ డబ్బుకోసం ఎందుకు పాకులాడటం, డ్రామాలు ఆడుతూ కట్టుకథలు చెప్తూ ఎందుకు తిరగడం అని ఆడియన్స్ లో సందేహం అలాగే ఉండిపోతుంది. అలాగే కొన్ని  సందర్భంలో వచ్చే సన్నివేశాలు, ట్విస్టులు చూసి సినిమాలో మురళి శర్మ చెప్పినట్టు కన్విన్స్ అవ్వకుండా కన్ఫ్యూజ్ అవుతారు ఆడియన్స్. రమేష్ వర్మ ఈ సినిమా కోసం  రొటీన్ కథ తీసుకొని అందులో ట్విస్టుల మీద ఆధారపడి  ‘ఖిలాడి’ తీశాడనిపించింది. రవితేజ పెర్ఫార్మెన్స్ , డింపుల్ గ్లామర్ షో , దేవి మ్యూజిక్ , ఇంటర్వెల్ ట్విస్ట్ , యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్స్ కాగా ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్ , కామెడీ లేకపోవడం , కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే , రొటీన్ కథ సినిమాకు మైనస్. ఓవరాల్ గా ‘ఖిలాడి’ ని టైం పాస్ కోసం ఓ సారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5 /5

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics