Movie Review - అవతార్ 2 - ది వే ఆఫ్ వాటర్ (తెలుగు)

Friday,December 16,2022 - 03:33 by Z_CLU

తారాగణం: సామ్ వర్తింగ్టన్, జో సల్దానా సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్
బ్యానర్: లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్
సినిమాటోగ్రఫీ: రస్సెల్ కార్పెంటర్
నిర్మాతలు : జేమ్స్ కామెరాన్, జోన్ లాండౌ
రచన – దర్శకత్వం: జేమ్స్ కామెరూన్
రన్ టైమ్: 3 గంటల 12 నిమిషాలు
విడుదల తేదీ: డిసెంబర్ 16, 2022

ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూసిన అవతార్-2 : ది వే ఆఫ్ వాటర్ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజువల్ గా సంభ్రమాశ్చర్యాలు ఉంటాయని ఆశపడ్డారు. మరి ఆ అంచనాల్ని దర్శకుడు జేమ్స్ కామరూన్ అందుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

అవతార్ పార్ట్-1లో జాక్ సల్లీ (శామ్ వర్తింగ్టన్) పండోరా గ్రహంలో సెటిల్ అయిపోతాడు. తమ తెగకు నాయకుడిగా అవతరిస్తాడు. భార్య, పిల్లలతో సంతోషంగా గడిపేస్తుంటాడు. అయితే అతడితో దెబ్బతిన్న కల్నల్ మైల్స్ (స్టీఫెన్ లాంగ్) మాత్రం పండోరాపై మరోసారి దాడికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో మరోసారి ఆ గ్రహంపై దిగుతాడు. ఈసారి ఏకంగా తను కూడా పండోరా వాసిగా మారి మరీ దిగుతాడు.

కేవలం తనపై ప్రతీకారం కోసమే కల్నల్ వచ్చాడని తెలుసుకున్న జాక్ సల్లీ, తన తెగకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు, కుటుంబంతో కలిసి ఒమటికాయ ద్వీపానికి వెళ్లి తలదాచుకుంటారు. సముద్రజీవులతో సావాసం చేసే తెగకు చెందిన ద్వీపం అది. ఆ సముద్రవాసులతో సల్లీ కుటుంబం కలిసిపోతుంది, సముద్ర జీవులతో సావాసం నేర్చుకుంటుంది. అయితే సల్లీ కుటుంబం అక్కడుందని కల్నల్ తెలుసుకుంటాడు. అలా మెట్కాయినా సముద్రానికి వచ్చిన కల్నల్ ను, సముద్ర జీవులు టుల్కన్లతో కలిసి సల్లీ కుటుంబం ఎలా ఎదుర్కొందనేది అవతార్-2 స్టోరీ.

నటీనటుల పనితీరు
ఎప్పట్లానే జేక్ సల్లీ పాత్రలో సామ్ వర్తింగ్టన్ మెరిశాడు. కల్నల్ అనే విలన్ పాత్రలో స్టీఫెన్ లాంగ్ అదరగొట్టారు. వీళ్లిద్దరే సినిమాకు ప్లస్ పాయింట్స్. వీళ్ల తర్వాత నెథేయం, లోయాక్ పాత్రలు పోషించిన పిల్లలు బాగా ఎట్రాక్ట్ చేశారు. గర్భిణి గిరిజన నాయకురాలి పాత్రలో కేట్ విన్స్ లెట్ ఆకట్టుకుంది.

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జేమ్స్ కామెరూన్ ఒక చిత్రానికి దర్శకత్వం వహించినప్పుడు, స్పెషల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్‌లకు బాధ్యత వహించే సాంకేతిక నిపుణులు అత్యున్నత స్థాయిలో పని చేస్తారని అందరికీ తెలుసు. టెక్నాలజీలో పీక్ లెవెల్ ను అవతార్: ది వాటర్ వే 3D వెర్షన్‌లో చూడవచ్చు.

పండోరా సముద్రాన్ని, సముద్రం లోపల మాయా ప్రపంచాన్ని సృష్టించిన గ్రాఫిక్స్ విభాగాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. వీటితో పాటు చివరి 45 నిమిషాల్లో వచ్చిన గ్రాఫిక్స్ అన్నీ అద్భుతం. ఈ విజువల్ ఎఫెక్టుకు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత లుక్ తీసుకొచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

ఇక దర్శకుడిగా జేమ్స్ కామరూన్ విషయానికొస్తే, అతడు మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. హాలీవుడ్ దర్శకులకు భిన్నంగా ఎమోషన్ ఎలిమెంట్స్, డ్రామా పై ఎక్కువగా దృష్టిపెట్టే కామరూన్, అవతార్-2లో కూడా అదే పనిచేశాడు. అయితే ఈ క్రమంలో డ్రామా కాస్త ఎక్కువ చూపించడం చాలామందికి నచ్చకపోవచ్చు. అయినప్పటికీ టెక్నికల్ గా తన స్థాయిని అందుకోవడం మరో దర్శకుడి వల్ల కాదనే విషయాన్ని కామరూన్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

avatar 2 movie review 2

జీ సినిమాలు రివ్యూ

దశాబ్దం కిందట అవతార్ వచ్చినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. ఏం గ్రాఫిక్స్ రా బాబూ అనుకుంది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి చూసి అవాక్కయింది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు తేడా లేకుండా ప్రేక్షకజనం నీరాజనం పలికారు. ఈ 13 ఏళ్లలో టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఆర్ఆర్ఆర్ లాంటి టాలీవుడ్ సినిమాల్లో కూడా కళ్లుచెదిరే గ్రాఫిక్స్ చూశాం. మరి కామరూన్ ఈసారి ఏం చేయబోతున్నాడు?

ఈ ప్రశ్నకు సమాధానంగా వచ్చిన అవతార్-2 (Avatar:The Way Of Water) మూవీ మరోసారి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించింది. ఈ సినిమాతో దర్శకుడు జేమ్స్ కామరూన్ ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడమే కాదు, తన స్థాయిని మరో దర్శకుడు అందుకోలేడని కూడా చాటిచెప్పాడు.

అవతార్ తో పండోరా అనే ఓ సరికొత్త ఊహాజనిత అద్భుతమైన గ్రహాన్ని పరిచయం చేశాడు కామరూన్. కాబట్టి పార్ట్-2లో కూడా అదే ఉంటుంది. అలాఅని దాన్నే చూపిస్తే ప్రేక్షకుడు నిరాశపడతాడు. సరిగ్గా ఇక్కడే కామరూన్ తన టాలెంట్ చూపించాడు. పండోరా గ్రహంలో ఓ మహాసముద్రం ఉంటే.. ఆ సముద్రం అడుగున మరో మాయా లోకం ఉంటే.. కొత్త కొత్త సముద్ర జీవులు.. వాటితోనే పండోరా గ్రహవాసుల గమనం.. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలతో అవతార్-2ను నింపేశాడు.

2 గంటల 12 నిమిషాల సినిమాలో 2 గంటల 30 నిమిషాలకు పైగా పండోరా గ్రహ సముద్రంలో సినిమా సాగుతుంది. అదే ఈ సినిమాకు అతిపెద్ద ఎస్సెట్. కథాపరంగా చెప్పుకోడానికేం లేదు. మరోసారి భూగ్రహం నుంచి విలన్లు వస్తారు. మరీ ముఖ్యంగా పార్ట్-1లో ఓడిపోయిన కల్నల్, ఈసారి పండోరా గ్రహవాసిగా మారి మరీ దాడికి వస్తాడు. ఆ దాడి నుంచి తనను, తన కుటుంబాన్ని జాక్ సల్లీ ఎలా కాపాడుకున్నాడనేదే స్టోరీ. కానీ ఈ కథను ఇలా చెబితే అందులో మజా ఉండదు. ఈ స్టోరీని జేమ్స్ కామరూన్ కళ్లతో చూడాలి. కుదిరితే త్రీడీ అద్దాలు పెట్టుకొని మరీ చూడాలి. అప్పుడు మజా వస్తుంది.

అవతార్-1లో ఎగిరే పక్షుల్ని చూపించిన దర్శకుడు.. పార్ట్-2లో సముద్రంలో దూసుకుపోయే జలచరాల్ని చూపించాడు. అదొక అద్భుత ప్రపంచం. ఇక్కడ మాటల్లో రాయలేని అంశం. ఆ భారీ జలచరాల్ని, పండోరా వాసులు ఎలా ప్రేమిస్తారు, వాటితో ఎలాంటి యుద్ధాలు చేశారనేది తెరపై చూసి ఆనందించాల్సిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో జేక్ సన్నీ కొడుకు, ఓ పెద్ద టుల్కన్ (అతిపెద్ద సముద్రపు జీవి)తో ఫ్రెండ్ షిప్ చేసే సన్నివేశాలు చూడ్డానికి రెండు కళ్లు చాలవ్.

సినిమా అంతా ఒకెత్తయితే, ఆఖరి 45 నిమిషాలు మరో ఎత్తు. ఈ యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. మూవీ మొత్తానికి అసలైన విజువల్ ట్రీట్ అంటే ఇదే. టుల్కన్ లతో యాక్షన్ సన్నివేశాలు, నీటి అడుగున తీసిన ఫైట్స్ ను మాటల్లో వర్ణించలేం. ఇక అక్కడక్కడ భారతీయ సంస్కృతికి సంబంధించిన రిఫరెన్సులు వాడడం, అవసరాల శ్రీనివాస్ తెలుగు డైలాగ్స్ బోనస్.

అయితే ఇంత అద్భుతమైన చిత్రానికి కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది రన్ టైమ్. 3 గంటల 12 నిమిషాల ఈ సినిమాను ఆసాంతం ఆస్వాదించలేం. దర్శకుడైతే స్టార్టింగ్ లో బోర్ కొట్టించాడు. కథ గ్రహం నుంచి సముద్రంలోకి మారే వరకు దాదాపు బోర్ కొడుతుంది. ఇక్కడ చూసిన దృశ్యాలే మళ్లీ మళ్లీ కనిపించడం కూడా మరో పెద్ద మైనస్.

రన్ టైమ్ ఎక్కువగా ఉంటుందని మెంటల్లీ ప్రిపేర్ అయి వెళ్తే మాత్రం అవతార్-2 ఓ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. అంతేకాదు, వీలైతే ఈ సినిమాను త్రీడీలో మాత్రమే చూడండి. వంద రూపాయలు ఎక్కువైనా తప్పనిసరిగా త్రీడీలో చూడాల్సిన సినిమా ఇది. కామెరూన్ మిమ్మల్ని నీటి అడుగున ఉన్న ఓ మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. వెండితెరపై ఆ అద్భుతాన్ని చూసి ఎంజాయ్ చేయండి.

రేటింగ్ – 3/5