'మళ్ళీ రావా' రివ్యూ

Friday,December 08,2017 - 02:37 by Z_CLU

నటీనటులు : సుమంత్, ఆకాంక్ష సింగ్, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తిక్ అడుసుమల్లి, మాస్టర్ సాత్విక్, బేబీ ప్రీతి ఆస్రాని తదితరులు

సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్

నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క

కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: గౌతమ్ తిన్న సూరి.

రిలీజ్ డేట్ : 8 డిసెంబర్ 2017

 

నరుడా డోనరుడా సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని సుమంత్ చేసిన మూవీ “మళ్లీ రావా”. గోదావరి తర్వాత మళ్లీ అలాంటి ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో పాటలు క్లిక్ అయ్యాయి. ట్రయిలర్ కూడా చాలామందికి నచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అలా ఓ మోస్తరు అంచనాలతో ఈరోజు థియేటర్లలోకి వచ్చిన మళ్లీ రావామూవీ ఎలా ఉందో చూద్దాం.

 

కథ :

చిన్నతనంలో తన తల్లి ఉద్యోగరీత్యా ముంబై నుంచి రాజోలు కి షిఫ్ట్ అయి అక్కడే సెటిల్ అయిన అంజలి(ఆకాంక్ష సింగ్) ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు కార్తీక్(సుమంత్).. కొన్ని రోజులకీ కార్తీక్ మీద అంజలి కి కూడా ప్రేమ కలుగుతుంది. అలా 1999లో స్కూల్ డేస్ లో 9వ తరగతి నుండే కార్తీక్ -అంజలిలా ప్రేమ కథ మొదలవుతుంది. ఒకరిని విడిచి ఒకరుండలేనంతగా దగ్గరైన కార్తీక్ – అంజలి కొన్ని కారణాల వల్ల చిన్నతనంలోనే విడిపోతారు. తిరిగి 13 ఏళ్ళ తర్వాత 2012లో ఉద్యగరీత్యా న్యూయార్క్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయి అరుణ్ అనే వ్యక్తి తో పెళ్ళికి రెడీ అవ్తుంది అంజలి… హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ అంజలి కోసం ఎదురుచూస్తుంటాడు కార్తీక్. 2017లో కార్తీక్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ తిరిగి వచ్చి తన కంపెనీ లో ఉద్యోగిగా జాయిన్ అవుతుంది అంజలి… అసలు అంజలి, కార్తీక్ ని విడిచి ఎందుకు వెళ్లిపోయింది… తను ప్రేమించిన కార్తీక్ ని వదిలి మరొకరితో పెళ్ళికి రెడీ అయిన అంజలి మళ్ళీ కార్తీక్ ని వెతుక్కుంటూ ఎందుకు తిరిగి వచ్చింది. అసలు కార్తీక్- అంజలి మళ్ళీ ఎలా కలిశారు… చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

‘సత్యం’,’గోదావరి’,’మధుమాసం’ సినిమాలతో హీరోగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకొని అందరినీ ఆకట్టుకున్న సుమంత్.. కార్తీక్ అనే క్యారెక్టర్ తో మరోసారి అందరినీ ఆకట్టుకున్నాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తనలోని మెచ్యూరిటీ చూపించాడు. ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆకాంక్ష సింగ్  గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకుంది. అన్నపూర్ణమ్మ తప్ప మిగతా వారందరూ కొత్త వారైనప్పటికీ వారి క్యారెక్టర్స్ కి న్యాయంచేశారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులుగా సాత్విక్ – బేబీ ప్రీతీ బాగా చేశారు. అభినవ్, మిర్చి కిరణ్ , కార్తిక్ అడుసుమల్లి తమ కామెడి టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు.

 

టెక్నిషియన్స్ పనితీరు :

రొమాంటిక్ డ్రామా సినిమాలకు పాటలతో పాటు ఆ ఫీల్ కలిగించే బాగ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ఇప్పటికే ‘ప్రేమ ఇష్క్ కాదల్’,’అలియాస్ జానకి’ సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్ గా తన పనితనం ఏంటో రుజువు చేసుకున్న శ్రవణ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించి సాంగ్స్,  బ్యాగ్రౌండ్ స్కోర్ తో హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా ‘మళ్ళీ రావా’ టైటిల్ సాంగ్, ‘చినుకు’, ‘ఎన్నడూ’ పాటలు అందరినీ ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. శ్రవణ్ ట్యూన్స్ కి కృష్ణకాంత్ అందించిన సాహిత్యం బాగుంది.
సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాగుంది. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాగుంది… కానీ ఫస్ట్ హాఫ్ లో ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బెటర్ గా ఉండేది. గౌతం స్క్రీన్ ప్లే –  దర్శకత్వం బాగుంది.  కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ బాగున్నాయి. రాహుల్ యాదవ్ నక్క ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

హీరోగా కాస్త గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ఏడాదికో సినిమా ప్లాన్ చేసుకుంటున్న సుమంత్ తనకి పర్ఫెక్ట్ అనిపించే నేచురల్ రొమాంటిక్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు. కాకపోతే మరీ  నేచురల్ గా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా చేశాడు. అందుకే ముందు నుంచి ఈ సినిమాలో మంచి ఫీల్ ఉంటుందని ఎలాంటి కమర్షియల్ ఎలెమెంట్స్ ఉండవని చెప్పుకొచ్చాడు సుమంత్.

ఏదైనా లవ్ స్టోరీ తో సినిమా వస్తుందంటే అందులో కొత్త కథను ఆశించలేం.  మళ్లీ రావా కథ కూడా అలాంటిదే. దర్శకుడు గౌతమ్ కూడా అలాంటి రొటీన్ స్టోరీనే సెలెక్ట్ చేసుకున్నప్పటికీ, పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశాడు. చాలా సన్నివేశాల్లో దర్శకుడి టాలెంట్ కనిపిస్తుంది.  సినిమా స్టార్టింగ్ నుంచి ఓ ఫీల్ తీసుకొచ్చి చివరి వరకూ అదే ఫీల్ ను మైంటైన్ చేసి ఎంటర్టైన్ చేశాడు.

సుమంత్ – ఆకాంక్ష క్యారెక్టర్స్, లవ్ ట్రాక్, చైల్డ్ ఎపిసోడ్, సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, రొమాంటిక్ సీన్స్, సందర్భాన్ని బట్టి అక్కడక్కడా వచ్చే కామెడీ, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ కాగా స్లో నరేషన్, ఫస్ట్ హాఫ్ నిడివి, మూడు దశల్లో జరిగే ప్రేమకథను కన్ఫ్యూజ్ చేస్తూ చూపించడం సినిమాకు మైనస్.

 

ఫీల్ గుడ్ లవ్  సినిమాల్ని ఇష్టపడేవాళ్లకు ‘మళ్ళీ రావా’ మూవీ బాగా నచ్చుతుంది.

 

రేటింగ్ 3 /5