ఎంసీఏ మూవీ రివ్యూ

Thursday,December 21,2017 - 04:05 by Z_CLU

నటీ నటులు : నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌ వర్మ, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు

డైలాగ్స్ : మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా

మ్యూజిక్ : దేవిశ్రీ ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ : స‌మీర్‌రెడ్డి
నిర్మాణం : శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
నిర్మాతలు : రాజు -లక్ష్మణ్- శిరీష్
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం : శ్రీరామ్ వేణు

రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2017

వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న దిల్ రాజు- నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ‘నేను లోకల్’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘MCA’ సినిమా ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది. వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న ఈ ఇద్దరూ ఈ సినిమాతో మరో హిట్ అందుకున్నారా.. దర్శకుడిగా చాలా గ్యాప్ తీసుకున్న శ్రీరామ్ వేణు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడా.. తెలుసుకుందాం.


కథ :

చిన్నతనంలో అమ్మ, నాన్నని కోల్పోయి, అన్నయ్యనే(రాజీవ్ కనకాల) సర్వస్వంగా భావిస్తూ అమితంగా ప్రేమిస్తాడు నాని(నాని).. అయితే పెళ్ళయ్యాక అన్నయ్య తనకి దూరం అయ్యాడని దానికి కారణం తన వదిన జ్యోతి(భూమిక) నే అని భావించి తనపై చిరాకు పెంచుకుంటాడు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో జ్యోతి వరంగల్ కి బదిలీ అవుతుంది. తను వెళ్లలేని పరిస్థితిల్లో వదినకి తోడుగా ఉండమని నానిని వరంగల్ కి పంపిస్తాడు అన్నయ్య రాజీవ్ కనకాల. వరంగల్ లో అనుకోకుండా పల్లవి(సాయి పల్లవి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు నాని. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగిగా రాష్ట్ర రోడ్డు రవాణాశాఖలో పనిచేసే జ్యోతి అక్రమంగా నడుపుతున్న శివశక్తి ట్రావెల్ యజమాని శివ(విజయ్)కి ఎదురెళ్తుంది. తన వ్యాపారానికి అడ్డుపడుతున్న జ్యోతిని ఎలాగైనా చంపాలని చూస్తుంటాడు శివ. వరంగల్ ని గడగడలాడించే శివ నుంచి తన వదిన జ్యోతి ని నాని ఎలా కాపాడుకున్నాడు..చివరికీ వదిన పై తనకున్న ప్రేమ ను ఎలా చాటుకున్నాడు అనేది సినిమా కథాంశం.

 

నటీ నటుల పని తీరు :

ఎప్పటి లాగే తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొని సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు నాని.. కొన్ని సందర్భాలలో తన కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు. ఫిదా సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మలయాళ బ్యూటీ మరో సారి పల్లవి పాత్రలో ఆకట్టుకుంది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన భూమిక వదిన పాత్ర తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో మెయిన్ హైలైట్ గా నిలిచింది. విజయ్ వర్మ కి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ తన విలనిజంతో మెప్పించాడు. వెన్నెల కిషోర్, ప్రియ దర్శి తమ కామెడీ టైమింగ్ తో కొన్ని సందర్భాలలో ఎంటర్టైన్ చేశారు. ఇక నరేష్, ఆమని, రాజీవ్ కనకాల,శుభలేఖ సుధాకర్,పోసాని,కృష్ణ తేజ,రచ్చ రవి, సుధీర్, సుదర్శన్ తదితరులు తమ పెర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ జస్ట్ పరవాలేదనిపించే రేంజ్ లో మాత్రమే ఉన్నాయి. ‘మిడిల్ క్లాస్ అబ్బాయిలం’ అంటూ సాగే టైటిల్ సాంగ్, ‘ఏవండోయ్ నాని గారు’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిగతా పాటలన్నీ రొటీన్ ఫార్మేట్ లో ఉంటూ జస్ట్ ఓకే అనిపించాయి. కొన్ని సనివేశాలకు  బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. వేణు శ్రీ రామ్ కథ – స్క్రీన్ ప్లే రొటీన్ అనిపించాయి. అక్కడక్కడా కొన్ని సందర్భాలలో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సెకండ్ హాఫ్ లో మిడిల్ క్లాస్ వాళ్ళం  అంటూ నాని చెప్పిన కొన్ని డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

ప్రతీ సినిమాలో తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో నేచురల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్న నాని దిల్ రాజు బ్యానర్ లో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడనగానే ‘MCA’ సినిమాపై ఓమోస్తరు అంచనాలు నెలకొన్నాయి…. ఆ మధ్య ‘ ఓ మై ఫ్రెండ్’ అనే సినిమా తీసి ఆ సినిమా తర్వాత చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ ఓ రొటీన్ స్టోరీ నే సెలెక్ట్ చేసుకున్నప్పటికీ ఆ కథతో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ, లవ్ ట్రాక్ తో దర్శకుడిగా పరవాలేదనిపించుకున్న వేణు శ్రీ రామ్ సెకండ్ హాఫ్ లో కంప్లీట్ రొటీన్ ఫార్మేట్ తో బోర్ కొట్టించాడు. సెకండ్ హాఫ్ లో కొన్ని సందర్భంలో వచ్చే సీన్స్ గతంలో చూసేసిన సినిమాలను గుర్తుకుతెస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో నాని క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో ఆ ఎంటర్టైన్ మెంట్ కంటిన్యు చేయలేకపోయాడు. ముఖ్యంగా వదిన – మరిది క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోవడం విఫలం అయ్యాడు. ఇక దిల్ రాజు – నాని కాంబినేషన్ లో ఈ ఇయర్ వచ్చిన నేను లోకల్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందనుకున్న ప్రేక్షకులను ఈ సినిమా పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయకపోవచ్చు.

నాని క్యారెక్టర్ , సాయి పల్లవి పెర్ఫార్మెన్స్, ‘మిడిల్ క్లాస్ అబ్బాయిలం’, ‘ఏవండోయ్ నాని గారు’ సాంగ్స్, కామెడీ, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే, నాని- సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా సెకండ్ హాఫ్ లో రొటీన్ అనిపించే సీన్స్ , క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ సరిగ్గా పండకపోవడం సినిమాకు మైనస్ గా నిలిచాయి. ఫైనల్ గా ఈ ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఓ మోస్తారు గా ఎంటర్టైన్ చేస్తాడు.

రేటింగ్ : 2.75