'మహానుభావుడు' రివ్యూ

Friday,September 29,2017 - 02:25 by Z_CLU

నటీన‌టులు : శ‌ర్వానంద్‌, మెహ్రీన్ , వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భద్రం తదిత‌రులు..

సంగీతం : ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌

సినిమాటోగ్రాఫ‌ర్‌ : నిజార్ ష‌ఫి

నిర్మాణం : యు.వి.క్రియేషన్స్

నిర్మాతలు :వంశీ, ప్రమోద్

రచన – ద‌ర్శ‌క‌త్వం : మారుతి

ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో శర్వానంద్ , భలే భలే మగాడివోయ్ సినిమాతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న మారుతి కాంబినేషన్ లో మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘మహానుభావుడు’… టీజర్, ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. మరి శర్వా – మారుతి కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం.

 

కథ :

OCD అనే వ్యాధితో అతి శుభ్రమైన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా జీవితాన్నే గడిపే ఆనంద్(శర్వా).. తనలాంటి అతి శుభ్రత కలిగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో తన కంపెనీలో ట్రైనీగా జాయిన్ అయిన మేఘన(మేహ్రీన్) ను చూసి అతి శుభ్రం గల అమ్మాయని భావించి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే తన బలహీనత కారణంగా మేఘనకు దూరమైన ఆనంద్.. చివరికి ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేశాడు.. చిన్నతనం నుంచి అతి శుభ్రంతో ఎన్నో సంతోషాలు, ఆప్యాయతలను కోల్పోయిన ఆనంద్ చివరికి తన జీవన శైలి ఎలా మార్చుకున్నాడనేది కథాంశం.

నటీనటుల పనితీరు :

ఇప్పటివరకు తను చేసిన ప్రతీ రోల్ తో ఆకట్టుకున్న శర్వానంద్ మరోసారి OCD బలహీనత ఉన్న పాత్రలో నటించి సూపర్ అనిపించుకున్నాడు. కొంచెం కష్టమే అయినప్పటికీ ఈ పాత్రకు శర్వా పూర్తి న్యాయం చేశాడు. మెహ్రీన్ మరోసారి తన అందం, నటనతో సినిమాకు ప్లస్ అయింది. వెన్నెల కిశోర్,వేణు, భద్రం తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. నాజర్, రఘుబాబు, వెన్నెల రామారావు, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, రాము, భాను, హిమ‌జ‌, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రమాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె తదిత‌రులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

టెక్నీషియన్స్ అందరు మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. తన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు థమన్. ‘మాహానుభావుడివేరా’, ‘రెండు కళ్ళు’ , ‘ఎపుడైనా నీ రూపం’ పాటలు ఆకట్టుకుంటాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి , కృష్ణకాంత్, భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యం బాగుంది. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా, పోలాచ్చి లొకేషన్లను అందంగా చూపించాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. కొన్ని సందర్భాలలో వచ్చే డైలాగ్స్ ఎంటర్టైన్ చేశాయి. కథ రొటీన్ గానే ఉన్నా దానికి అతి శుభ్రత అనే కొత్త పాయింట్ ను జత చేసి తన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ తో అందరినీ ఆకట్టుకున్నాడు మారుతి. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

‘భలే భలే మగాడివోయ్’, ‘బాబు బంగారం’ సినిమాలతో దర్శకుడిగా తనలోని ఓ సరికొత్త కోణాన్ని బయట పెట్టిన మారుతి ఈ సినిమాను కూడా అదే పంథాలో నడిపించాడు. హీరోలో వీక్ నెస్ చూపించి వినోదాన్ని పంచడంలో ఇప్పటికే అనుభవం ఉన్న మారుతి.. మరోసారి అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ తో 2 గంటల పాటు అలరించాడు.
శర్వానంద్ క్యారెక్టర్, మెహ్రీన్ గ్లామరస్ పెర్ఫార్మెన్స్,థమన్ మ్యూజిక్, సాంగ్స్ పిక్చరైజేషన్, కామెడీ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఎంచుకున్న కథ, అందరూ ఊహించేలా సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఫైనల్ గా ‘మహానుభావుడు’ నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు.

రేటింగ్ : 3 /5