'ఫలక్ నుమా దాస్' మూవీ రివ్యూ

Friday,May 31,2019 - 12:28 by Z_CLU

నటీ నటులు : విశ్వక్‌ సేన్‌, తరుణ్‌ భాస్కర్, సలోని మిశ్రా, హర్షిత గౌర్‌, ప్రశాంతి, ఉత్తేజ్‌ తదితరులు

సంగీతం : వివేక్‌ సాగర్‌

ఛాయాగ్రహణం : విద్యాసాగర్‌

నిర్మాత : కరాటే రాజు

మాటలు-కథనం- దర్శకత్వం: విశ్వక్‌ సేన్‌

విడుదల తేది : 31 మే 2019

నిడివి : 150 నిమిషాలు

మూడో సినిమా ‘ఫలక్ నుమా దాస్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్ సేన్. టీజర్, ట్రైలర్ తో యువతని ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే గ్రాండ్ గా రిలీజయింది. మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ యాక్టర్ , డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

కథ :

ఫలక్ నుమా ఏరియాలో పుట్టిన దాస్(విశ్వక్ సేన్) చిన్నతనం నుండే గొడవలు, గ్యాంగ్ లకు ఎట్రాక్ట్ అవుతాడు. శంకర్ అనే రౌడీని ఆదర్శంగా తీసుకొని స్కూల్ డేస్ నుండే అతనితో తిరుగుతూ ఓ గ్యాంగ్ మైంటైన్ చేస్తుంటాడు. పెరిగి పెద్దయ్యాక కాలేజీలో ప్రేమ , గొడవలతో సరదాగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అదే సమయంలో రవి, రాజు అనే ఇద్దరు శంకర్ ని హత్య చేస్తారు. శంకర్ మర్డర్ తర్వాత దాస్ జీవితంలో మార్పోస్తుంది. అతని మరణం తర్వాత దాస్ గ్యాంగ్ కి బలం తగ్గుతుంది.

ఇక జీవితంలో గొడవలకు దూరంగా ఉండాలనుకుని పాండు (ఉత్తేజ్) సహాయంతో తన గ్యాంగ్ తో కలిసి ఫలక్ నుమాలో మటన్ వ్యాపారం మొదలుపెడతాడు దాస్. ఆ వ్యాపారంలో శంకర్ ని చంపిన రవి,రాజు లకు శత్రువుగా మారతాడు దాస్. అదే సమయంలో తన శత్రువు బావమరిదితో దాస్ కి చిన్న గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా అనుకోకుండా దాస్ చేతిలో ఆపోజిట్ గ్యాంగ్ లోని ఓ వ్యక్తి మరణిస్తాడు. దాస్ పై మర్డర్ కేసు నమోదవుతుంది. ఆ కేసు నుండి దాస్ చివరికి ఎలా బయటపడ్డాడు.. తన శత్రువులను మిత్రులుగా మార్చుకోగాలిగాడా..? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

ఎగ్రేస్సీవ్ దాస్ క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. కాకపోతే ఎమోషనల్ సన్నివేశాల్లో తేలిపోయాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో విశ్వక్ సేన్ నటనతో మెప్పించలేకపోయాడు. హీరోయిన్ సలోని మిశ్రా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. దాస్ ప్రేమాయణం నడిపిన మిగతా ఇద్దరు అమ్మాయిలు మాత్రం జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ అన్నట్టుగా ఉన్నారు. ఉత్తేజ్ కి చాలా గ్యాప్ తర్వాత మంచి క్యారెక్టర్ దొరకడంతో రాఫ్ఫాడించాడు. తన అనుభవంతో పాండు క్యారెక్టర్ ని అవలీలగా చేసేసాడు. సైదులు అనే పొలీస్ పాత్రలో తరుణ్ భాస్కర్ పర్ఫెక్ట్ అనిపించాడు. జాన్ కోట్లే తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించాడు. కొత్త అయినప్పటికీ మిగతా వాళ్ళందరూ తమ క్యారెక్టర్స్ తో మెప్పించాడు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలైట్ గా నిలిచింది. కొన్ని యాక్షన్ సన్నివేశాలకు వివేక్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పాటలు బాగున్నప్పటికీ ప్రేక్షకుడు మళ్ళీ మళ్ళీ పాడుకునేలా లేవు. అదే మైనస్. సినిమాటోగ్రఫీ బాగుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న లోకేషన్స్ ని తన కెమెరా వర్క్ తో బాగా చూపించారు. సౌండ్ డిజైనింగ్ బాగుంది. కథకి తగిన వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఆర్ట్ డైరెక్టర్ పనితనం కనిపించింది. ఎడిటింగ్ పరవాలేదు. సాగదీసినట్టుగా అనిపించే కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేసుంటే బాగుండేది. రామకృష్ణ కంపోజ్ చేసిన రియలిస్టిక్ ఫైట్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే నేచురల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఆర్టిస్టుల నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టడంలో, కొన్ని సన్నివేశాలను డీల్ చేయడంలో విశ్వక్ సేన్ దర్శకత్వ ప్రతిభ కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గుట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

టీజర్ తో హల్చల్ చేసి యూత్ ని ఎట్రాక్ట్ చేసిన ‘ఫలక్ నుమా దాస్’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మళయాళ సినిమా ‘అంగమలై డైరీస్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో పెద్దగా మార్పులేవి చేయకుండానే తీసాడు విశ్వక్ సేన్. బహుశా మార్పులు చేసి కథని తప్పుదోవ పట్టించినట్టవుతుందనుకున్నాడేమో గానీ ఉన్న సన్నివేశాలనే వాడుకున్నాడు. కాకపోతే ఒరిజినల్ డైరెక్టర్ ‘అంగమలై’ అనే ఊరిలో కథను నడిపిస్తే విశ్వక్ సేన్ హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో కథను నడిపించాడు. ఓల్డ్ సిటీలోని అన్ని లోకేషన్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు విశ్వక్. అందువల్లే ఇంత వరకూ ఏ సినిమాలో కనిపించని లోకేషన్స్ ఈ సినిమాలో చూడొచ్చు.

నిజానికి ఈ కథ కొత్తదేం కాదు. అప్పుడెప్పుడో జగడం అంటూ సుకుమార్ చూపించిన కథే ఇది. సినిమా ప్రారంభమైన పదినిమిశాలకే ప్రేక్షకుడికి ‘జగడం’ గుర్తొస్తుంది. కాకపోతే కథను చెప్పే విధానంలో కాస్త కొత్తదనం కనిపిస్తుంది అంతే. ఇక సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకూ ఓల్డ్ సిటీలో మనం చూసే క్యారెక్టర్స్ కళ్ళముందు కనిపిస్తుంటాయి. ఓల్డ్ సిటీలో ఉండే వారికి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని సన్నివేశాల్లో తెరపై కనిపించే క్యారెక్టర్స్ లో వారిని చూసుకుంటారు.

సినిమాకు సంబంధించి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కంటే రియలిస్టిక్ గానే చూపించే ప్రయత్నం చేసాడు విశ్వక్ సేన్. లోకేషన్స్ ,క్యారెక్టర్స్, డైలాగ్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. కాస్టింగ్ బాగుంది. క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే ఆర్టిస్టులను తీసుకోవడమే కాకుండా వారి నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టంలో విశ్వక్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. అలాగే తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా రీమేక్ ని తీర్చిదిద్దడంలో కూడా విశ్వక్ మంచి మార్కులే అందుకున్నాడు. కాకపోతే రెండో భాగంలో సన్నివేశాలపై అలాగే క్లైమాక్స్ పై  శ్రద్ధ పెడితే అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది. కొన్ని సందర్భాల్లో విశ్వక్ ఎమోషన్ కంటే బోల్డ్ డైలాగ్స్ పైనే ఆసక్తి కనబరిచాడనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మొదటి భాగంలో కాస్త నెమ్మదిగా సాగే సన్నివేశాలు ఎడిట్ చేసి ఉండాల్సింది. ఇవే సినిమాకు మైనస్ అనిపిస్తాయి. ఎంత సేపు గొడవలు పడటం, బూతులు తిట్టుకోవడం, తాగడం, తిరగడం ఇవే కనబడుతూ ఉంటాయి. వీటి వల్ల సినిమా యూత్ కి బాగా నచ్చుతుంది.

విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , ఇంటర్వెల్ ఎపిసోడ్ , ప్రీ క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలైట్ కాగా , అక్కడక్కడా నెమ్మదిగా సాగే సన్నివేశాలు, పాటలు, క్లైమాక్స్ సినిమాకు మైనస్ అనిపిస్తాయి.

బాటమ్ లైన్ : యూత్ కి నచ్చే ‘దాస్’

రేటింగ్ : 2.5/5