"ఎన్ జీ కే" మూవీ రివ్యూ

Friday,May 31,2019 - 03:44 by Z_CLU

నటీనటులు: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నిళల్‌గల్‌ రవి, ఉమా పద్మనాభన్‌
సంగీతం: యువన్‌ శంకర్‌రాజా
సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌
పాటలు: చంద్రబోస్‌, రాజేష్‌ ఎ.మూర్తి
నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
రచన, దర్శకత్వం: శ్రీరాఘవ
నిడివి : 148 నిమిషాలు
సెన్సార్ : U/A
రిలీజ్ డేట్ : మే 31, 2019

ఎన్.జీ.కే.. ఈ సినిమా చుట్టూ ఓ రకమైన బజ్ క్రియేట్ అవ్వడానికి రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి ఇది సూర్య నటించిన సినిమా కాగా, రెండోది సూర్య-శ్రీరాఘవ కాంబోలో మొట్టమొదటి సినిమా కావడం. మరి ఈ అంచనాల్ని సినిమా అందుకుందా? నందగోపాలకృష్ణగా సూర్య మెప్పించాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

ఎం.టెక్ చదివిన నందగోపాల కృష్ణ.. ఆఫీస్ లో కూర్చొని పనిచేయడానికి ఇష్టపడదు. తన సొంతూరు వచ్చి సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) చేస్తుంటాడు. తన గ్రామంలో ప్రజల్ని కూడా ఈ వ్యవసాయంపై వచ్చేలా చేస్తాడు. అలా గ్రామ, మండల స్థాయిలో మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. వాళ్ల చిన్న చిన్న సమస్యలు తీరుస్తుంటాడు.

కానీ ప్రజలకు మరింత మంచి జరగాలంటే రాజకీయాల్లోకి రావాలని భావించి, తప్పనిసరి పరిస్థితుల్లో ఓ ఎమ్మెల్యే వద్ద కార్యకర్తగా చేరుతాడు. అక్కడ్నుంచి రాజకీయాల్లో ఉన్న కుళ్లును ప్రత్యక్షంగా చూసిన గోపాలం ఎలా మారాడు? ప్రతిపక్షాల రాజకీయాల్ని ఎలా ఎదుర్కొన్నాడు? అంతిమంగా తను అనుకున్నది సాధించాడా లేదా అనేది ఎన్జీకే కథ.

మరోవైపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబపరంగా కూడా సూర్య ఇబ్బందులు ఎదుర్కొంటాడు. భార్య గీత (సాయిపల్లవి) గోపాలంను చీటికిమాటికి అనుమానిస్తుంది. దీనికి కారణం రాజకీయ సలహాదారుగా ఉన్న వనిత (రకుల్)కు గోపాలం దగ్గరవ్వడమే. రాజకీయ సమస్యలతో పాటు తన కుటుంబ సమస్యల్ని కూడా గోపాలం ఎలా పరిష్కరించాడనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు

సూర్య యాక్టింగ్ ఈసారి తేలిపోయింది. క్యారెక్టర్ లో క్లారిటీ లేకపోవడం, స్క్రీన్ ప్లే లోపాలు, సన్నివేశాల్లో బలం లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. అయినప్పటికీ ఉన్నంతలో సూర్య ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు. ఎమ్మెల్యేకు దగ్గరవ్వడం కోసం చేసే పనులు, క్లైమాక్స్ లో సందేశం ఇవ్వడం లాంటి ఎపిసోడ్స్ లో సూర్యలో నటుడు కనిపిస్తాడు.

అందమైన గృహిణిగా సాయిపల్లవి, మీడియా మేనేజ్ మెంట్ టైకూన్ గా రకుల్ ప్రీత్ బాగా నటించారు. అందంగా కూడా కనిపించారు. కానీ సాయిపల్లవి మాత్రం కొన్ని చోట్ల కాస్త ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకో భర్తను అనుమానించే పాత్ర ఆమెకు సూట్ కాలేదు. రకుల్ మాత్రం బాగా చేసింది. సూర్య తల్లిదండ్రులుగా నిళల్ గల్ రవి, ఉమా పద్మనాభన్ బాగా కుదిరారు. ఇతర నటీనటులంతా తమ పాత్రల మేరకు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు

శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ బ్లాక్స్ లో అతడి వర్క్ కనిపిస్తుంది. ఇక సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. శ్రీరాఘవ సినిమాలకు ఎప్పుడూ ప్లస్ అయ్యే ఇతడి మ్యూజిక్, ఈసారి మైనస్ అయింది. అటు ఎడిటర్ పరిస్థితి మరీ ఘోరం. ఎక్కడా అతడికి ఫ్రీడమ్ ఇచ్చినట్టు కనిపించలేదు. కొన్ని సన్నివేశాలైతే అసలు ఎడిటింగ్ కూడా చేయకుండా అలా వదిలేశారేమో అనిపిస్తుంది.

రచయితగా శ్రీరాఘవ ఈసారి ఫెయిల్ అయ్యాడు. తన స్థాయికి తగ్గ అవుట్-పుట్ ఇవ్వలేకపోయాడు. దర్శకుడిగా అక్కడక్కడ మెరిసినా, సన్నివేశాలు బలంగా లేకపోవడంతో తనకుతానే చట్రంలో ఇరుక్కుపోయాడు. మంచి సన్నివేశాలు రాసుకుంటే, రొటీన్ కథ అయినప్పటికీ సూర్య ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లేవాడు. ఆ ప్రయత్నం జరగలేదు.

జీ సినిమాలు రివ్యూ

సెల్వ రాఘవన్ (శ్రీరాఘవ) అంటేనే ఎమోషన్స్ కు పెట్టింది పేరు. అతడి బలం అది. అతడు తీసిన బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలు హిట్ అవ్వడానికి కారణం కూడా ఆ బలమైన భావోద్వేగాలే. తమిళ్ లో అయితే శ్రీరాఘవ తీసిన అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఎందుకో ఎన్జీకే విషయంలో ఆ ఎలిమెంట్ ను మిస్ అయ్యాడు దర్శకుడు. ఎంతలా అంటే సూర్య లాంటి నటుడు కూడా చేతులెత్తేసేంతలా.

అవును.. ఎన్జీకే సినిమాలో ఆకట్టుకునే అంశం ఒక్కటి కూడా కనిపించదు. కొత్త కథ లేదు, మంచి పాటలు లేవు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ లేవు, అంతెందుకు.. సెకెండాఫ్ లో సినిమాను పైకి లేపే సన్నివేశాలు కనీసం 2 కూడా లేవంటే ఎన్టీకే ఎలా తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫస్టాఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇంటర్వెల్ ఇచ్చేసరికే 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది.

సూర్య-శ్రీరాఘవ కాంబినేషన్ అంటే టాలీవుడ్ జనాలు లైట్ తీసుకోవచ్చు. కానీ కోలీవుడ్ లో ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాలని దేవుళ్లను ప్రార్థించిన సినీభక్తులు కూడా ఉన్నారక్కడ. అలాంటి వీళ్లిద్దరూ కలిసి ఎన్జీకే లాంటి రొటీన్ పొలిటికల్ డ్రామాను ప్రేక్షకులపైకి వదిలారు. నిజానికి ఈ సినిమా ఆకట్టుకోకపోవడాని ప్రధాన కారణం దర్శకుడే.

ఎన్నో విభిన్నమైన కథలు రాసుకున్న శ్రీరాఘవ, ఎన్జీకే విషయంలో మాత్రం గాడితప్పాడు. ఒక దశలో సూర్య స్టార్ డమ్ నే నమ్ముకున్నట్టు అనిపించింది. శ్రీరాఘవ రాసిన సన్నివేశాల్లో బలం లేకపోవడంతో చాలా చోట్ల సూర్య కూడా ఆదుకోలేకపోయాడు. చివరికి క్లైమాక్స్ లో కూడా సూర్య ఏడుస్తుంటే.. ఇక చాల్లే అనిపిస్తుంది ప్రేక్షకుడికి.

ఓవరాల్ గా ఎన్జీకే సినిమా సూర్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందేమో కానీ, సగటు ప్రేక్షకుడ్ని మాత్రం మెప్పించదు. మరీ ముఖ్యంగా సూర్య సినిమాల నుంచి ఆశించే మాస్ మసాలా ఎలిమెంట్స్, సాంగ్స్ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్.

బాటమ్ లైన్ – నంద గోపాల కష్టం

రేటింగ్ – 2/5