'ఛల్ మోహన్ రంగ' మూవీ రివ్యూ

Thursday,April 05,2018 - 03:10 by Z_CLU

నటీనటులు: నితిన్, మేఘ ఆకాష్, నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావురమేష్, సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రా శ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి

సంగీతం: థమన్.ఎస్.ఎస్

కెమెరా : ఎం. నటరాజన్ సుబ్రమణియన్ (నట్టి)

సమర్పణ : శ్రీమతి నిఖిత రెడ్డి

నిర్మాణం : శ్రేష్ట్ మూవీస్ , పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్

నిర్మాత : ఎం.సుధాకర్ రెడ్డి

కథ : త్రివిక్రమ్ శ్రీనివాస్

స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కృష్ణ చైతన్య

రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2018

 

నితిన్ 25 వ సినిమా..పైగా త్రివిక్రమ్ కథ , పవన్ కళ్యాణ్ నిర్మాణం ఇవన్నీ కలిపి ఛల్ మోహన్ రంగ సినిమాను వెరీ వెరీ స్పెషల్ గా మార్చేశాయి. మరి ఇంత స్పెషల్ గా తెరకెక్కిన ఛల్ మోహన్ రంగ థియేటర్లలో స్పెషల్ అనిపించుకుందా.. జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ :

చిన్నతనం నుండి పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఎప్పటి కైనా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వలనుకుంటాడు మోహన్ రంగ(నితిన్). ఎన్నిసార్లు ట్రై చేసినా వీసా రాకపోవడంతో ఓ ప్లాన్ వేసి యు.ఎస్ వెళ్తాడు. అలా వెళ్ళిన మోహన్ రంగ విలాస్(మధు నందన్) సహయంతో అక్కడ ఓ ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా పరిచయమైన మేఘా సుబ్రహ్మణ్యం(మేఘ ఆకాశ్) తో ప్రేమలో పడతాడు. మోహన్ రంగ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడంతో మేఘ కూడా ప్రేమలో పడిపోతుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకుంటారు. అలా ఒకరినొకరు ఇష్టపడుతూ చెప్పుకునేలోపే ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. అలా అనుకోకుండా దూరమయిన వీళ్ళిద్దరూ ఏడాది తర్వాత మళ్ళీ ఊటీలో కలుసుకుంటారు. ఇంతకీ మోహన్ రంగ-మేఘ వీరి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి ..? చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు… అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

మోహన్ రంగ క్యారెక్టర్ లో నితిన్ ఒదిగిపోయాడు. తనకెంతో ఇష్టమైన, అలవాటైన లవర్ బాయ్ గా ఈజ్ తో చేశాడు. టోటల్ సినిమా మొత్తానికి మోహన్ రంగ క్యారెక్టరైజేషనే హైలెట్. మేఘా సుబ్రహ్మణ్యంగా మేఘా ఆకాశ్ తన పెర్ఫార్మెన్స్, గ్లామర్ తో ఆకట్టుకొని సినిమాకు ప్లస్ అయింది. పెర్ఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ లేని క్యారెక్టర్ కావడంతో లిజి జస్ట్ పరవాలేదనిపించుకుంది. రావు రమేష్ ఎప్పటిలాగే తన పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. నర్రా శ్రీనివాస్, మధు నందన్, పమ్మి సాయి, సత్య తమ కామెడి తో ఎంటర్ టైన్ చేశారు. మేఘ సిస్టర్ గా హాసిని తన టైమింగ్ తో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంది. ఇక నరేష్, సంజయ్ స్వరూప్, ప్రగతి, ప్రభాస్ శ్రీను, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కృష్ణ చైతన్య మిగతా నటీనటులు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు సంబంధించి టెక్నికల్ గా అందరు బెస్ట్ అనిపించుకున్నారు. నటరాజన్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ హైలైట్. ముఖ్యంగా కొన్ని ఫ్రేమ్స్, సాంగ్స్ పిక్చరైజేషన్స్ లో ఆయన కెమెరా పనితనం కనిపిస్తుంది. తమన్ సినిమాకు మరో హైలెట్. పాటలన్నీ ఈజీగా కనెక్ట్ అవుతాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఫీల్ పెంచింది.  ‘పెద్దపులి’, ‘ఘ ఘ మేఘా’, ‘వారం కాని వారం’, మియామీ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సాహితీ, కృష్ణ కాంత్, బాలాజీ, కేదారనాథ్, రఘురాం,  అందించిన సాహిత్యం బాగుంది. ఎడిటింగ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్  ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాసతో కూడిన పంచ్ డైలాగ్స్ అలరించాయి. త్రివిక్రమ్ అందించిన కథ రెగ్యులర్ అనిపించినా కృష్ణ చైతన్య స్క్రీన్ ప్లే- డైరెక్షన్ ఆకట్టుకుంది. డైలాగ్స్ కూడా కృష్ణచైతన్యే రాసినప్పటికీ ఎందుకో ప్రతి మాటలో త్రివిక్రమ్ కనిపిస్తాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు రివ్యూ

ఛల్ మోహన్ రంగ.. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అనేది రిలీజ్ కు ముందే అందరికీ తెలుసు. కామెడీ పుష్కలంగా ఉండబోతోందనే విషయం ట్రయిలర్స్ తోనే స్పష్టమైంది. ఇలా సినిమాపై ఆడియన్స్ ను ముందే ప్రిపేర్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అయింది. అదే మైండ్ సెట్ తో వచ్చిన ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. థియేటర్లలో ఒకటే నవ్వులు. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ పంచ్ లు పేలుతూనే ఉన్నాయి. అలా పుష్కలంగా నవ్వులు పూయించింది ఛల్ మోహన్ రంగ.

త్రివిక్రమ్ ఈ ప్రేమ కథను, ఎంతో ప్రేమతో కృష్ణచైతన్యకు ఇచ్చాడు. త్రివిక్రమ్ పై ప్రేమతో ఈ కథపై చాలా ప్రేమ కురిపించాడు దర్శకుడు కృష్ణచైతన్య. ఆ ప్రేమ మొత్తం సినిమాలో ప్రాసల రూపంలో కనిపించింది. అవును.. ఛల్ మోహన్ రంగ సినిమాలో ప్రాసలు, పంచ్ లు, కామెడీనే ఎక్కువ కనిపిస్తుంది. సినిమా నిండా డైలాగులే. నటీనటులకు ఎమోషన్ పండించే అవకాశం అక్కడక్కడ మాత్రమే దక్కింది.

ఓ ప్రేమకథకు కావాల్సిన సెటప్, బ్యాక్ డ్రాప్ మొత్తం ఛల్ మోహన్ రంగకు కుదిరింది. మంచి నటీనటులు కుదిరారు. లై సినిమాతో ఆకట్టుకున్న నితిన్, మేఘా ఆకాష్ జంట.. ఈ సినిమాలో అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించింది. అయితే ఆ కెమిస్ట్రీని ఇంకాస్త ఎఫెక్టివ్ గా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. వీళ్లిద్దరి మధ్య డైలాగ్స్ తగ్గించి, ఇంకాస్త ఎమోషన్ చూపించి ఉంటే చాలా బాగుండేది.

సినిమా స్టార్టింగ్ నుంచి శుభం కార్డు వరకు కామెడీ ఫుల్ గా ఉంటుంది. మధ్యలో ప్రేమ కనిపిస్తుంది. ఈ సినిమా స్టోరీ అందరూ ఊహించేదే అయినప్పటికీ.. ఈ కామెడీ ఎపిసోడ్స్ కారణంగా ఛల్ మోహన్ రంగ ఫుల్ మార్కులతో పాస్ అయిపోతుంది. నెరేషన్ లో హై పాయింట్స్ లేకపోవడం చిన్న లోటుగా అనిపించినప్పటికీ, కామెడీ దాన్ని కప్పిపుచ్చేస్తుంది. ఓవరాల్ గా ఈ సమ్మర్ లో కూల్ కామెడీ రొమాంటిక్ మూవీగా ఛల్ మోహన్ రంగ నిలుస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్ – 3/5