'కృష్ణార్జున యుద్ధం' మూవీ రివ్యూ

Thursday,April 12,2018 - 02:35 by Z_CLU

నటీనటులు : నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ తదితరులు

సినిమాటోగ్ర‌ఫీ : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని

సంగీతం : హిప్ హాప్ తమీజా

స‌మ‌ర్ప‌ణ‌ : వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి

నిర్మాత‌లు : సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది

కథ-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం : మేర్ల‌పాక గాంధీ

రిలీజ్ డేట్ : 12-4-2018

వరుసగా 8 హిట్స్ కొట్టాడు. ఇంకొక్క హిట్ కొడితే ట్రిపుల్ హ్యాట్రిక్ అవుతుంది. టాలీవుడ్ లోనే వెరీ వెరీ రేర్ ఫీట్ ఇది. అలాంటి అరుదైన రికార్డు కృష్ణార్జున యుద్ధంపై ఆధారపడింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, నానికి ఆ స్పెషల్ రికార్డును అందించిందా.. జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

 

కథ :

చిత్తూరు జిల్లాలోని ఆకుర్తి అనే పల్లెటూరిలో ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేస్తూ అప్పులు తీర్చడం కోసం పొలాల్లో డప్పు వాయించే కుర్రాడు కృష్ణ(నాని). యూరోప్ లో పెద్ద పాప్ సింగర్ అర్జున్ జయప్రకాశ్(నాని). కృష్ణ ఊరి సర్పంచ్(నాగినీడు) మనవరాలు ప్రియా(రుక్సర్ మీర్)మీద మనసు పారేసుకుంటే అక్కడ అర్జున్ మ్యాగ్జీన్ ఫోటోగ్రాఫర్ సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కట్ చేస్తే, చిత్తూరు నుండి ప్రియా, యూరోప్ నుండి సుబ్బలక్ష్మి హైదరాబాద్ వచ్చి కిడ్నాప్ అవుతారు. వాళ్ళను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన కృష్ణ, అర్జున్ తమ గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఉమెన్ ట్రాఫికింగ్ కి గురయ్యారని తెలుసుకుంటారు. ఆ ముఠా నుండి వాళ్ళిద్దరినీ విడిపించడానికి కృష్ణార్జునులు ఒకటవుతారు. హైదరాబాద్ లో విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్న గ్యాంగ్ ఎవరు..? చివరికి ఆ గ్యాంగ్ నుండి కృష్ణ-అర్జున్ వారిద్దరితో పాటు మిగతా వారిని ఎలా కాపాడగలిగారు..అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు:

ఇప్పటికే రెండు సినిమాల్లో డ్యూయెల్ రోల్స్ చేసి నటుడిగా మంచి మార్కులు అందుకున్న నేచురల్ స్టార్ నాని మరో సారి ద్విపాత్రాభినయంతో మెస్మరైజ్ చేసాడు. ముఖ్యంగా కృష్ణ అనే మాస్ క్యారెక్టర్ లో జీవించాడు. చిత్తూరు జిల్లా యాసతో కృష్ణగా సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. రాక్ స్టార్ అర్జున్ క్యారెక్టర్ ఇప్పటికే కొంత మంది హీరోలు చేశారు గనుక కొత్తగా అనిపించదు. అనుపమ పరమేశ్వరన్ తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యింది. రుక్సార్ తన రోల్ కి బెస్ట్ అనిపించుకుంది. బ్రహ్మాజీ, మహేష్, ప్రభాస్ శ్రీను తమ కామెడీ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేశారు. ముఖ్యంగా చిత్తూరు యాసతో మహేష్ బాగా అలరించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. నాగినీడు, సుదర్శన్, హరితేజ మిగతా నటీనటులందరూ తమ క్యారెక్టర్స్ తో ఓకే అనిపించారు.

 

టెక్నీషియన్స్ పనితీరు:

‘ధృవ’ తో మ్యూజిక్ డైరక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచాడు. ‘దారి చూడు’, ‘ఐ వన్నా ఫ్లై’ సాంగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ , కొన్ని సీన్స్ లో కార్తీక్ తన కెమెరా పనితనం చూపించాడు. చిత్తూరు యాసతో కూడిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పరవాలేదు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చు. మేర్లపాక గాంధీ కథ -స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయాయి. ఫస్ట్ మూవీ అయినప్పటికీ నిర్మాతలు బాగా ఖర్చుపెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 


జీ సినిమాలు సమీక్ష:

వరుసపెట్టి హిట్స్ కొడుతున్న నాని స్టోరీ సెలక్షన్ లో కింగ్ అనిపించుకున్నాడు. సో.. నేచురల్ స్టార్ నుంచి ప్రామిసింగ్ మూవీ వస్తుందనేది పక్కా అయిపోయింది. ఇలాంటి హీరోకు, మేజికల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు యాడ్ అయ్యాడు. పైగా నాని డ్యూయల్ రోల్. కృష్ణార్జున యుద్ధం అనే క్యాచీ టైటిల్. ఇలా అన్నీ యాడ్ అవ్వడంతో ఈ సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. కానీ ఆ బజ్ ను యాజ్ ఇటీజ్ గా సినిమాలో మాత్రం క్యారీ చేయలేకపోయారనిపించింది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల్లో ఓ మేజిక్ కనిపిస్తుంది. క్యారెక్టర్స్ నెరేషన్ తో పాటు స్క్రీన్ ప్లేలో జిమ్మిక్కులే ఆ సినిమాల్ని హిట్ చేశాయి. సరిగ్గా ఇవే ఎలిమెంట్స్ కృష్ణార్జున యుద్ధంలో మిస్ అయ్యాయి. కృష్ణ పాత్రపై పెట్టిన శ్రద్ధ, సెకెండాఫ్ నెరేషన్ మీద పెట్టి ఉంటే సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉండేది. దర్శకుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి (రేణిగుంట) కావడంతో ఆ యాసతో అక్కడి క్యారెక్టర్స్ తో కొంత వరకూ ఎంటర్ టైన్ చేశాడు. కానీ పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో రెండు క్యారెక్టర్ ల మధ్య నడిచే కథను ఎంటర్ టైనింగ్ గా చూపించి పరవాలేదనిపించిన గాంధీ, సెకండ్ హాఫ్ లో రొటీన్ అనిపించే ఉమెన్ ట్రాఫికింగ్ ఎలిమెంట్ , స్క్రీన్ ప్లే తో బోర్ కొట్టించాడు.

ఇక నాని విషయానికొస్తే, ఎలాంటి పాత్రనైనా తన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో పీక్స్ కు తీసుకెళ్లగలడు. సినిమాలో కృష్ణ క్యారెక్టర్ అంతలా క్లిక్ అయిందంటే దానికి కారణం నాని ప్రజెన్స్. కృష్ణ పాత్రతో సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడు నాని. కానీ కేవలం ఈ క్యారెక్టర్ తో, కాసింత ఎంటర్టైన్ మెంట్ తో నాని ఈ సినిమాను హిట్ రేంజ్ కి తీసుకెళ్లగలడా అనేది డౌట్. ఒకవేళ అదే కనుక జరిగితే నాని కచ్చితంగా క్రౌడ్ పుల్లరే. ఎందుకంటే ఇందులో స్టోరీ లేదు. కేవలం నాని మేజిక్ తో నడవాల్సిన సినిమా ఇది.

కృష్ణగా నాని పెర్ఫార్మెన్స్, రుక్సర్ గ్లామర్, రెండు పాటలు, అక్కడక్కడ చిత్తూరు యాసతో వచ్చే కామెడి డైలాగులు, బ్రహ్మాజీ కామెడి, బాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ అనిపిస్తాయి. రొటీన్ స్టోరీ-స్క్రీన్ ప్లే, స్లో నేరేషన్, కథను మరీ సాగదీసినట్టు అనిపించడం, సరైన విలన్ లేకపోవడం సినిమాకు మైనస్.

ఫైనల్ గా కృష్ణ క్యారెక్టర్, కామెడి కోసం ఈ యుద్ధాన్ని ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ :  2.75/5