'రంగస్థలం' మూవీ రివ్యూ

Friday,March 30,2018 - 05:28 by Z_CLU

నటీ నటులు : రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, నరేష్, ఆది పినిశెట్టి,అనసూయ తదితరులు

సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు

మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్స్ : రామకృష్ణ సబ్బాని, మౌనిక నిగేత్రే సబ్బాని

రచన : శ్రీనివాస్, కాశి, బుచ్చి బాబు

నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్

నిర్మాతలు : నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి

కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సుకుమార్

ఫస్ట్ టైం చెవిటివాడిగా నటించాడు. ఫస్ట్ టైం సుకుమార్ డైరక్షన్ లో చేశాడు. సమంతతో వర్క్ చేయడం కూడా ఫస్ట్ టైం. అసలు ఇలాంటి కథ వినడం, చేయడం కూడా ఫస్ట్ టైం. ఇలా అంతా కొత్తగా ఉండడంతో ఓకే చెప్పాడు రామ్ చరణ్. అలా భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకొచ్చిన రంగస్థలం నిజంగా అంత కొత్తగా ఉందా..? ఫస్ట్ టైం చూసిన వాళ్ల రియాక్షన్ ఏంటి..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ : 

1980 లో ‘రంగస్థలం’ అనే ఊరు.. ఆ ఊళ్ళో పొలాలకు నీళ్లు పెట్టాలంటే ఒకే ఒక్క మోటారు ఉంటుంది. అది చిట్టిబాబు వద్దే ఉంటుంది. వినికిడి లోపం వల్ల చిట్టిబాబు ను అందరూ సౌండ్ ఇంజినీర్ అంటుంటారు. ఓ సందర్భంలో ఊళ్ళో ఉండే రామలక్ష్మి(సమంత)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇక 30 ఏళ్లుగా ఊరికి ప్రెసిడెంట్(జగపతి బాబు) హోదాలో ఉంటూ సొసైటీ బ్యాంకు పేరుతో అక్రమంగా జనాల నుంచి పొలాలు లాక్కుంటూ ఊరికి పెద్దగా వ్యవహరిస్తుంటాడు భూపతి ఫణింద్ర(జగపతి బాబు). సెలవుల్లో దుబాయ్ నుండి సొంత ఊరు వచ్చిన చిట్టిబాబు అన్నయ్య కుమార్ బాబు(ఆది పినిశెట్టి) ప్రెసిడెంట్ చేసే అక్రమాలకు ఎదురెళతాడు. ఊరు బాగుపడాలంటే ప్రెసిడెంట్ కి పోటీగా నిలబడాలని భావించి ఎలక్షన్ లో నామినేషన్ వేస్తాడు. అలా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసే కుమార్ బాబు కి తన పార్టీ తరపున సపోర్ట్ అందిస్తాడు ఎమ్మెల్యే దక్షిణామూర్తి(ప్రకాష్ రాజ్). అలా రంగస్థలంలో రాజకీయాలు మొదలవుతాయి. ఈ క్రమంలో అనుకోకుండా కుమార్ బాబు చనిపోతాడు. కుమార్ బాబు మరణం తర్వాత  యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్తాడు దక్షిణ మూర్తి. ఇంతకీ కుమార్ బాబుని చంపిందెవరు..? దక్షిణామూర్తి కోమా నుండి వచ్చాక తెలిసిన నిజం ఏమిటి…? చివరికి తన అన్నయ్య ని చంపిన వారిపై చిట్టి బాబు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు.. అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చెర్రీ కెరీర్ ను ఈ సినిమాకు ముందు, తర్వాత అని చెప్పుకోవాలి. అలాంటి అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వినికిడి లోపం కలిగిన వ్యక్తిగా చరణ్ నటించిన తీరు చూస్తే ముచ్చటేస్తుంది. సినిమాకు ఎంత సెటప్ ఉన్నా, చెర్రీ యాక్టింగ్ బాగాలేకపోతే మూవీ మొత్తం తేలిపోయేది. చిట్టిబాబు పాత్ర కోసం ప్రాణం పెట్టాడు చరణ్. 80లనాటి యాంబియన్స్ ను క్యారీ చేయడం తో పాటు యాక్షన్, డిక్షన్, స్టెప్స్ ఇలా అన్నింటిలో హండ్రెడ్ పర్సెంట్ ఔట్ పుట్ ఇచ్చాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చరణ్ నటవిశ్వరూపం చూడొచ్చు. సినిమా నుండి బయటికొచ్చాక చిట్టి బాబు క్యారెక్టర్ అందరి మైండ్ లో అలాగే ఉండిపోతుంది.

ఇక చరణ్ తర్వాత చెప్పుకోవాల్సింది ఆది గురించే. కుమార్ బాబుగా ఆది చాలా బాగా నటించాడు. సినిమా అసలు కథ మొదలయ్యేది ఈ క్యారెక్టర్ ఎంట్రీతోనే. అంతటి కీలకమైన పాత్రను ఆది చక్కగా పెర్ఫార్మ్ చేశాడు. ఇక రామలక్ష్మిగా సమంత బాగా చేసింది. కాకపోతే ఈ క్యారెక్టర్ ఫస్టాఫ్ వరకే. సెకెండాఫ్ లో పెద్దగా కనిపించదు. చరణ్, ఆది, సమంత పాత్రల తర్వాత కచ్చితంగా చెప్పుకోవాల్సిన పాత్ర రంగమ్మత్తది. అనసూయ సినీకెరీర్ కు రంగమ్మత్త పాత్ర పునాదిగా నిలుస్తుంది. ప్రెసిడెంట్ గా జగపతి బాబు , ఎం.ఎల్.ఎ దక్షిణా మూర్తిగా ప్రకాష్ రాజ్, కోటేశ్వరరావు గా నరేష్, రామ్ చరణ్ కు వినబడేట్టు అన్నీ గట్టిగా చెప్పే పాత్రలో మహేష్ ఆచంట బాగా నటించారు.

టెక్నిషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవలిసింది ఆర్ట్ డైరెక్టర్స్ గురించే… తమ ఆర్ట్ వర్క్ తో 1980 నాటి పల్లెటూరి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆర్ట్ డైరెక్టర్స్ గా బెస్ట్ అనిపించుకున్నారు రామకృష్ణ సబ్బాని, మౌనిక నిగేత్రే. సినిమాకు మరో హైలైట్ రత్నవేలు సినిమాటోగ్రఫీ. తన కెమెరా వర్క్ తో గోదారి అందాలను అద్భుతంగా చూపించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు రత్నవేలు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు, సాంగ్స్ పిక్చరైజేషన్ లో తన కేపబిలిటీస్ ఏంటో చూపించాడు.

ఇక తన మ్యూజిక్ తో రిలీజ్ కి ముందే పాజిటీవ్ టాక్ తీసుకొచ్చిన దేవి అదిరిపోయే సాంగ్స్ తో పాటు సినిమాకు తగినట్టుగా బాగ్రౌండ్ స్కోర్ అందించి సినిమాలో ఫీల్ తీసుకొచ్చాడు.  ప్రతీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

చంద్ర బోస్ ఈ సినిమాకు సాహిత్యం అందించాడు అనేకంటే ప్రాణం పెట్టాడు అని చెప్పొచ్చు. తన అద్భుతమైన సాహిత్యంతో అలరించిన చంద్ర బోస్ సినిమాలో ఓ ముఖ్య సందర్భంలో వచ్చే ఎమోషనల్ సాంగ్ పాడి చక్కని ఫీల్ కలిగించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. బుచ్చి బాబు, కాశి, శ్రీనివాస్ అందించిన మాటలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. నటీ నటులు మాట్లాడే పల్లె యాస అందరినీ ఆకట్టుకుంటుంది.

తన సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నసుకుమార్ మరోసారి దర్శకుడిగా తన కేపబిలిటీస్ ఏంటో అందరికీ చూపించాడు. సరైన కథ ఉంటే ఎంత డెప్త్ లోకి వెల్లగలడో నిరూపించాడు. ముఖ్యంగా సుకుమార్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచింది.  మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష:

రిలీజ్ కు ముందే చిట్టిబాబు అందరికీ కనెక్ట్ అయిపోయాడు. అతడు సౌండ్ ఇంజినీర్ అనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇక సినిమా కాన్సెప్ట్ కూడా 80ల నాటిదని తెలుసు. ఇలా రిలీజ్ కు ముందే ఆడియన్స్ ను ఫుల్ గా ప్రిపేర్ చేసింది యూనిట్. సగం సక్సెస్ ఇక్కడే కొట్టారు. ప్రేక్షకులు ప్రిపేర్ అయి వెళ్లడంతో ఫస్ట్ ఫ్రేమ్ నుంచే లీనమయ్యారు. కథతో పాటు ట్రావెల్ చేశారు. సినిమా 3 గంటలు ఉందన్న ఫీలింగ్ కూడా కలగలేదంటే దానికి కారణం ఇదే.

కమర్షియల్ సినిమాల్లో ఎన్నో రకాలుంటాయి. రంగస్థలం కూడా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమానే. ఇందులో ఐటెంసాంగ్ ఉంది, కామెడీ ఉంది, పక్కా యాక్షన్ ఉంది, మంచి పాటలున్నాయి. మిగతా సినిమాలతో దీన్ని సెపరేట్ చేసి చూపించిన అంశం చిట్టిబాబు క్యారెక్టర్, 80ల నాటి నేపథ్యం. ఈ రెండు విషయాల్లో రంగస్థలం పైసా వసూల్ అనిపించుకుంటుంది. ఆర్ట్ డైరక్టర్ రామకృష్ణ వేసి సెట్ లు అద్భుతం. ఇది సెట్ అనే ఫీలింగ్ రాకుండా చేశాడంటే అద్భుతమే కదా.

సుకుమార్ టైపు స్క్రీన్ ప్లే ఇందులో కనిపించదు. చరణ్ లాగే సుక్కూకు కూడా అతడి కెరీర్ లో ఇదొక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. కథ మొత్తం స్ట్రయిట్ నెరేషన్ తోనే సాగుతుంది.  ఇవన్నీ ఒకెత్తయితే, ఒక్కో పాత్రకు సుకుమార్  పెర్ ఫెక్ట్ గా నటీనటుల్ని ఎంచుకున్నాడు. చివరికి అనసూయ చేసిన రంగమ్మత్త పాత్రకు కూడా అనసూయే కరెక్ట్ అనిపించేలా చేశాడు. ప్రతి క్యారెక్టర్ లో మేజిక్ కనిపిస్తుంది. అదే రంగస్థలంలో గొప్పదనం.

ఇవన్నీ ఒకెత్తయితే సెట్, దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. సుకుమార్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఎప్పుడూ డిసప్పాయింట్ చేయడు. రంగస్థలం సినిమాలో అటు మ్యూజిక్, ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో డోబుల్ శాటిస్ ఫాక్షన్ ఇచ్చాడు. రామకృష్ణ వేసిన సెట్స్ సినిమాకు ప్రాణం పోశాయి. సెల్ ఫోన్లు, ఫేస్ బుక్  లేని 80ల నాటి ఫ్లేవర్ ను మరోసారి రంగస్థలం సినిమాలో చక్కగా చూపించారు.

చిట్టిబాబు క్యారెక్టరైజేషన్, కుమార్ బాబు, రంగమ్మత్త క్యారెక్టర్స్,  సాంగ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలెట్స్. సెకెండాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ మరీ సాగదీసినట్టు అనిపించడం మైనస్ పాయింట్. నిజానికి సెకండాఫ్ కాస్త ట్రిమ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ట్రిమ్ చేయొచ్చు కూడా.

ఫైనల్ గా చెప్పాలంటే చిట్టిబాబు విశ్వరూపం, దేవిశ్రీప్రసాద్ మేజిక్, 80ల నాటి ఫీల్  కోసం రంగస్థలం సినిమాను తప్పకుండా చూడాలి.

రేటింగ్ : 3 :25 /5