'అనగనగా ఓ అతిథి' మూవీ రివ్యూ

Friday,November 20,2020 - 10:02 by Z_CLU

నటీనటులు: పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్ తదితరులు

ఛాయగ్రహణం : రాకేశ్ బి

సంగీతం : ఆరోల్ కోరెల్లి

రచన : కాశీ నదీంపల్లి

నిర్మాతలు : రాజా రామమూర్తి, చిందబర్ నటీశన్

దర్శకత్వం : దాయల్ పద్మనాభన్

విడుదల తేది : 20 నవంబర్ 2020

RX100 తో కుర్రకారుని ఎట్రాక్ట్ చేసి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటున్న పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘Anaganaga O Athidhi’ సినిమా OTT ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండేళ్ళ క్రితం కన్నడలో విడుదలై సూపర్ హిట్ సాధించిన Aa Karaala Rathri సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా మన ఆడియన్స్ ను ఆకట్టుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

Anaganaga o Athidhi review in telugu 2
కథ :

ఊరి చివర ఉండే నిరుపేద కుటుంబమైన మల్లిక (పాయల్) ఇంటికి అనుకోని ఓ అతిథి వస్తాడు. అతడి పేరు శ్రీనివాస్ (చైతన్య కృష్ణ). అలా ఇంటికి వచ్చిన శ్రీనివాస్ కి కావాల్సిందల్లా వండి పెడుతూ అతనికి అతిథి మర్యాదలు చేస్తుంటారు. కానీ అతని దగ్గర ఉన్న డబ్బు బంగారం కోసం ఆశ పడి అమ్మ(వీణ సుందర్) నాన్న(ఆనంద్ చక్రపాణి) తో కలిసి అతన్ని హతమార్చాలని చూస్తుంటుంది మల్లి. ఇంతకీ మల్లి కుటుంబంలోకి అతిథిగా వచ్చిన శ్రీనివాస్ ఎవరు? మరి అనుకున్నట్లే అతడిని మల్లిక హత్య చేసిందా? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

సినిమాలో నటించిన అందరి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది వీణ సుందర్ నటన గురించి. తన పాత్రలో జీవించింది వీణ. ఒరిజినల్ సినిమాలో చేసిన పాత్రే ఇందులోనూ చేసి మరోసారి ఆ పాత్రకు ప్రాణం పోసింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలో వీణ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఆనంద్ చక్రపాణి నటన కూడా ఆకట్టుకుంది. కానీ అతనికి డబ్బింగ్ కుదరలేదు.

డీ గ్లామర్ గా కనిపిస్తూ మల్లి పాత్రలో పాయల్ పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో మంచి మార్కులు అందుకుంది. ఇక చైతన్యకృష్ణ కూడా ఉన్నంతలో ఆ పాత్రకు న్యాయం చేశాడు. అంధుడి పాత్రలో వేణు నటన బాగుంది. అప్పాజీ మిగతా నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

కొన్ని సినిమాలకు టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం. టెక్నీషియన్స్ నుండి సపోర్ట్ లేకపోతే కొన్ని కథలు ప్రేక్షకులకు ఆనవు. ఈ సినిమాకు టెక్నికల్ గా మంచి సపోర్ట్ దొరికింది. ముఖ్యంగా రాకేశ్ బి సినిమాటోగ్రఫీ తో పాటు ఆరోల్ కోరెల్లి నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఒకప్పటి వాతావరణాన్ని రీ క్రియేట్ చేయడంలో కళాదర్శకుడు సక్సెస్ అయ్యాడు. నేచురల్ మేకప్ తో పాటు కాస్ట్యూమ్స్ కూడా పాత్రలకు చక్కగా కుదిరాయి. ఎడిటింగ్ బాగుంది.

కథ, స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. కాకపోతే తెలుగుకి వచ్చేసరికి ఒరిజినల్ సినిమా కంటే తక్కువ అవుట్ పుట్ అందించాడు దర్శకుడు. ముఖ్యంగా పాత్రలకు డబ్బింగ్ లు సరిగ్గా కుదరలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

Anaganaga o Athidhi review in telugu 3

జీ సినిమాలు సమీక్ష :

కొన్ని సినిమాలు రీమేక్ చేయడం, మళ్ళీ ఆ మేజిక్ రీ-క్రియేట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమైన పని. కన్నడలో రెండేళ్ళ క్రితం విడుదలై సూపర్ హిట్టైన సినిమాను ‘అనగనగా ఓ అతిథి’గా OTT కోసం తెలుగులో రీమేక్ చేసాడు దర్శకుడు దాయల్ పద్మనాభన్. అయితే ఒరిజినల్ తో పోలిస్తే ఈ రీమేక్ విషయంలో బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వలేకపోయాడు. ఇక సినిమాలో పాటలు, ఫైట్స్, రొమాన్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. అత్యాశకి పోయి జీవితాల్ని కోల్పోయిన ఓ కుటుంబాన్ని తెరపై ఆవిష్కరింపజేసే నీతి కథ ఇది. అందుకే కమర్షియల్ హంగుల జోలికి వెళ్ళకుండా తను చెప్పాలనుకున్న కథను చాలా ఎమోషనల్ గా చెప్పాడు దర్శకుడు. ఆ విషయంలో దాయల్ పద్మనాభన్ ని మెచ్చుకోవాలి.

చాలా సెన్సిబుల్ కథను అంతే సెన్సిబుల్ గా తెరకెక్కించి చివరికి మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు అందరినీ ఆకట్టుకుంటుంది. నిజానికి సినిమాకు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టే ప్రధాన బలం. ఆ ఎమోషన్ ని మళ్ళీ రీ క్రియేట్ చేయడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే కమర్షియల్ హంగులు కోరుకునే వారికి సినిమా బోర్ కొడుతుంది. అలాగే మెల్లగా సాగే కథనం కూడా సినిమాకు మైనస్. క్లైమాక్స్ మాత్రం గుండెల్ని బరువెక్కిస్తుంది. ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక ఈ రీమేక్ లో ఒరిజినల్ తల్లి పాత్ర చేసిన నటి వీణ సుందర్ తోనే మళ్ళీ ఇందులో ఆ పాత్ర చేయించడం కలిసొచ్చింది. ఆమె నటన మన ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇక పాయల్ , కృష్ణ చైతన్య లు ఉన్నంతలో ఆ పాత్రలకు న్యాయం చేయగలిగారు.

ఫైనల్ గా రియాలిటీ కోరుకునే ఆడియన్స్ ను మాత్రం సినిమా ఆకట్టుకుంటుంది. ఇక కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి మాత్రం సినిమా ఓ మోస్తరుగా ఆర్ట్ ఫిలింను తలపిస్తుంది. మరి OTT ఆడియన్స్ ను ఈ సినిమా ఎంత వరకూ మెప్పిస్తుందో అనేది చూడాలి.

బాటమ్ లైన్ – అనగనగా ఓ ఆర్ట్ ఫిలిం
రేటింగ్2.5/5