మిడిల్ క్లాస్ మెలొడీస్ రివ్యూ

Friday,November 20,2020 - 08:41 by Z_CLU

న‌టీన‌టులు: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ‌, చైత‌న్య గ‌రిక‌పాటి, దివ్య శ్రీపాద‌, గోప‌రాజు ర‌మ‌ణ‌ తదితరులు
కెమెరా: స‌న్నీ కూర‌పాటి
క‌థ‌, సంభాష‌ణ‌లు: జ‌నార్ద‌న్ ప‌సుమ‌ర్తి
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌
సంగీతం: స్వీక‌ర్ అగ‌స్తి
బ్యానర్ : భవ్య క్రియేషన్స్
నిర్మాత‌: ఆనంద‌ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: వినోద్ అనంతోజు
రన్ టైమ్ : 2 గంటల 15 నిమిషాలు
రిలీజ్ డేట్: నవంబర్ 20, 2020

హీరో ఆనంద్ దేవరకొండ రెండో సినిమా. దర్శకుడు వినోద్ అనంతోజు మొదటి సినిమా. హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా. ఇందులో నటించిన ఎంతోమంది కొత్త నటీనటులు ఆశగా ఎదురుచూస్తున్న సినిమా. అదే మిడిల్ క్లాస్ మెలొడీస్. ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Middle Class Melodies Review in telugu

కథ

గుంటూరు దగ్గర్లో ఓ చిన్న పల్లెటూరిలో కాకా హోటల్ నడుపుతుంటారు హీరో రాఘవ (ఆనంద్ దేవరకొండ), అతడి తండ్రి కొండల్రావు (గోపరాజు రమణ). రాఘవ బొంబాయి చట్నీ (శనగపిండితో చేసే ఓ రకమైన వంటకం) బాగా చేస్తాడు. కానీ తన టాలెంట్ ను ఎవ్వరూ గుర్తించడం లేదని
బాధపడుతుంటాడు. ఎలాగైనా గుంటూరు వెళ్లి హోటల్ పెట్టి ఫేమస్ అవ్వాలనేది అతడి కోరిక.

రాఘవకు మరదలు సంధ్య (వర్ష బొల్లమ్మ) అంటే ఇష్టం. కాలేజ్ డేస్ నుంచే ఇద్దరి మధ్య లవ్. కానీ సంధ్యకు అతడి తండ్రి నాగేశ్వరరావు వేరే సంబంధాలు చూస్తుంటాడు. దీనికి రెండు కారణాలు. ఒకటి వీళ్ల లవ్ గురించి తండ్రికి తెలియడం, రెండోది హీరోహీరోయిన్ కుటుంబాలకు పెద్దగా పడకపోవడం.

తన మామకు చెందిన షాపులోనే హోటల్ పెట్టిన రాఘవ.. క్లిష్ట పరిస్థితుల మధ్య హోటల్ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడా లేదా.. తన మరదల్ని పెళ్లి చేసుకున్నాడా లేదా.. రెండు కుటుంబాల్ని ఎలా కలిపాడు అనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు

ఈ సినిమాకు బ్యాక్ బోన్ హీరో తండ్రి కొండల్రావు పాత్రథారి గోపరాజు రమణ. ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన రమణ, ఈ సినిమాలో తన ప్రతాపం చూపించాడు. అతడి పాత్ర చాన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. ఇక హీరోగా ఆనంద్ దేవరకొండ తన రెండో సినిమాకే మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా, ఎదగాలనే స్ట్రగుల్ తో ఉన్న కుర్రాడిగా బాగా చేశాడు. ఓవైపు హోటల్ క్లిక్ అవుతుందా అవ్వదా అనే టెన్షన్, మరోవైపు ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి అయిపోతుందేమో అనే భయం.. ఈ రెండు షేడ్స్ ఆనంద్ దేవరకొండ అద్భుతంగా పండించాడు.

హీరోయిన్ వర్ష బొల్లమ్మ తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. చాలా సీన్లలో ఆమె తన కళ్లతోనే యాక్టింగ్ చేయడం బాగుంది. హీరో ఫ్రెండ్ గోపాల్ పాత్రలో చైతన్య గరికపాటి, అతడి లవర్ పాత్రలో దివ్య శ్రీపాద చాలా బాగా చేశారు. చివరికి క్లైమాక్స్ లో గెస్ట్ రోల్ లో వచ్చిన తరుణ్ భాస్కర్ కూడా నవ్వులు పూయించాడు.

 

టెక్నీషియన్స్ పనితీరు

దర్శకుడు వినోద్ అనంతోజు, తన సినిమాలో పాత్రల్ని చాలా డెప్త్ గా రాసుకున్నాడు. ఏ క్యారెక్టర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన ఫీలింగ్ కలిగించదు. చివరికి మొబైల్ రీచార్జ్ చేసే షాపు ఓనర్ కు కూడా చిన్నపాటి మేనరిజమ్స్ ఇచ్చి తన పట్టు నిరూపించుకున్నాడు. చాలా క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా, అన్ని పాత్రలకు న్యాయం చేస్తూ, మరోవైపు ఫన్ అందిస్తూ… సినిమాను చక్కగా క్లైమాక్స్ కు తీసుకెళ్లాడు వినోద్.

ఇక దర్శకుడి తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి జనార్థన్ పసుమర్తి. ఈ సినిమాకు అతడు రాసిన సంభాషణలు సింప్లీ సూపర్బ్. గుంటూరులోని ఓ చిన్న పల్లెటూరిలో ఎలా మాట్లాడుకుంటారో అలానే ఉంటాయి డైలాగ్స్. పైగా మిడిల్ క్లాస్ కథ కాబట్టి ఎక్కడా ఓవర్ ది బోర్డ్ డైలాగ్స్ ఉండవు. కేవలం డైలాగ్స్ కే పరిమితం కాకుండా.. దర్శకుడితో కలిసి ఇతడు స్క్రీన్ ప్లే కూడా రాశాడు.

స్వీకర్ అగస్తి సంగీతం, విక్రమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.. కథకు, సన్నివేశాలకు తగ్గట్టు ఈ రెండూ బాగా కుదిరాయి. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, రవితేజ ఎడిటింగ్ బాగున్నాయి.

Middle Class Melodies Review in telugu

జీ సినిమాలు రివ్యూ

ఓ సినిమా హిట్టవ్వాలంటే కథలో పెద్ద పెద్ద ట్విస్టులు ఉండాలా? అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ-క్లైమాక్స్ లో ఛేజ్, క్లైమాక్స్ లో భయంకరమైన ఫైట్ ఉండాల్సిందేనా? అక్కర్లేదు. కథలో ఉన్న ఎమోషన్స్ ను కాన్వాస్ పై అందంగా చూపిస్తే చాలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ మెలొడీస్.
హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో అశ్లీలానికి, హింసకు చాలా దూరంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంటుంది.

మధ్యతరగతి జీవితాల్లో ఉండే కష్టాలు, సాధారణ యువకుడు ఎదగడం కోసం పడే తపన, మిడిల్ క్లాస్ లో ఉండే ప్రేమ, వాళ్లు తినే అహారం, మధ్యతరగతి ఆర్థిక కష్టాలు. ఇలా పూర్తిగా కామన్ మేన్ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్, అతడి పక్కనే ఉండేలా అనిపించే పాత్రలు ఈ మిడిల్ క్లాస్ మెలొడీస్ బలం. ప్రతి మధ్యతరగతి ఇంట్లో కనిపించే కష్టమే ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. కాకపోతే దాన్ని సరదాగా, మనసుకు హత్తుకునేలా చెప్పాడు దర్శకుడు వినోద్ అనంతోజు.

హీరో రాఘవ పాత్ర నుంచి అతడి తండ్రి కొండల్రావు, హీరోయిన్ సంధ్య పాత్ర వరకు అన్నీ అత్యంత సహజంగా అనిపిస్తాయి. మన కళ్లముందే జరుగుతున్న సంఘటనల్ని తలపిస్తాయి. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ప్రతి సినిమా హిట్టవుతుంది. ఈ సినిమాకు కూడా అవే లక్షణాలున్నాయి.

దర్శకుడు సన్నివేశాల కంటే పాత్రలు, వాటి స్వభావాల్ని గట్టిగా నమ్ముకున్నాడు. ప్రతి పాత్రలో డీటెయిలింగ్ కనిపిస్తుంది. అది హీరో స్నేహితుడి పాత్ర అయినా, హోటల్ లో పనిచేసే బాయ్ క్యారెక్టర్ అయినా అందులో మనకు డీటెయిలింగ్ కనిపిస్తుంది. అదే ఈ సినిమాకు బలం. ఇక
పంచ్ లకు దూరంగా, సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు రెండో బలం.

ఇన్ని బలాల మధ్య కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. ఇక హీరోతో గుంటూరు యాస చెప్పించడానికి చేసిన ప్రయత్నం సగం మాత్రమే సక్సెస్ అయింది. దీనికి తోడు ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగడంతో పాటు.. క్లైమాక్స్ ”ఇంకా ఉంటే బాగుణ్ను” అనిపించేలా ఉండడం చిన్న వెలితి. తమిళ సినిమాలకు ఇలాంటి క్లైమాక్స్ లు బాగా నడుస్తాయి. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఓ పెద్ద సుఖాంతాన్ని, ఓ రకమైన బ్యాంగ్ క్లైమాక్స్ ను కోరుకుంటారు. ఇక కామన్ తెలుగు ఆడియన్స్ కు తెలిసిన ముఖాలు ఇందులో కనిపించకపోవడం కూడా ఈ సినిమాకు చిన్న మైనస్.

ఇలాంటి చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ రాఘవ-కొండల్రావు వాటిని మరిపిస్తారు. సంధ్య తన కళ్లతో ఆ బలహీనతల్ని కప్పేస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే.. ఈ లాక్ డౌన్ సీజన్ లో ఓటీటీలో ఎట్టకేలకు మరో హిట్ సినిమా
పడింది.

బాటమ్ లైన్ – బొంబాయి చట్నీ అదిరింది
రేటింగ్3/5