క్లాసిక్ ప్రేమకథకు పదేళ్లు

Wednesday,February 26,2020 - 02:04 by Z_CLU

రెండు మనసుల్ని కలిపింది.
ఇద్దరు వ్యక్తుల్ని ఒకటి చేసింది.
ప్రేమకథా చిత్రమే కాదు, అందులో హీరోహీరోయిన్లను ప్రేమికులుగా మార్చిన సినిమా కూడా. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. నాగచైతన్య, సమంతల కెరీర్ లోనే వెరీవెరీ స్పెషల్ మూవీ ఏమాయ చేసావె. 2010లో సరిగ్గా ఇదే రోజున విడుదలైన ఈ సినిమా పదేళ్లు పూర్తిచేసుకుంది.

 

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. కెరీర్ లో నాగచైతన్యకు అది రెండో సినిమా అయితే, సమంతకు అదే డెబ్యూ మూవీ. అలా వీళ్లిద్దరూ కలిసి చేసిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ.. 2010లో వచ్చిన బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

సున్నితమైన ప్రేమకథను, అంతే సున్నితమైన భావాలతో మనసుకు హత్తుకునేలా చూపించింది ఏమాయచేసావె సినిమా. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణం పోసింది.

రెండో సినిమానే అయినప్పటికీ నాగచైతన్య యాక్టింగ్ టాలెంట్, మొదటి సినిమాకే సమంత చూపించిన నేచురల్ ఎక్స్ ప్రెషన్స్ ఈ మూవీని బ్లాక్ బస్టర్ గా మార్చేశాయి. వీళ్లిద్దరి కెరీర్ లో ఈ సినిమా టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు, సన్నివేశాలు చూస్తుంటే అంతే ఫ్రెష్ గా ఉంటాయి.

ఇదే సినిమాతో సమంత నటిగా పదేళ్ల కెరీర్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న సుధీర్ బాబు.. ఈ సినిమాలో సమంతకు అన్నగా నటించాడు.