SAINDHAV గ్లిమ్స్ తో అదరగొట్టిన వెంకీ

Wednesday,January 25,2023 - 12:49 by Z_CLU

విక్టరీ వెంకటేష్ హీరోగా  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాణంలో శైలేష్ కొలను డైరెక్ట్ చేయబోతున్న వెంకీ ల్యాండ్‌మార్క్ 75వ సినిమాకు సైంధవ్ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా ఎలా ఉండబోతుందో ? వెంకీ ఎలా కనిపించనున్నాడో తెలియజేస్తూ టైటిల్ రివీల్ చేసి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. 

గడ్డంతో , చేతిలో గన్  పట్టుకుని పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు వెంకీ. బ్యాక్‌గ్రౌండ్‌లో కారు , పేలుడు చూస్తే శైలేష్ వెంకటేష్  తో అదిరిపోయే స్టైలిష్ యాక్షన్ మూవీ తీయబోతున్నాడాని అర్థమవుతుంది. సైంధవ్ యాక్షన్‌ ఎక్కువగా ఉండబోతుందని దర్శకుడు గ్లిమ్స్ ద్వారా హింట్  ఇచ్చారు. చంద్రప్రస్థ అనే ఫిక్షనల్  నగరంలో ఓడరేవు ప్రాంతంలోకి ప్రవేశించి, ఆపై కంటైనర్ నుండి తుపాకీని బయటకు తీస్తూ వెంకీ నడుస్తూ వచ్చే గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. చివరగా, తన చేతిలో దారుణంగా కొట్టబడిన గూండాల బృందాన్ని, “నేనిక్కడ ఉంటారా… ఎక్కడికి ఎల్లనూ… రమ్మను…” అంటూ హెచ్చరిస్తూ చెప్పడం హైలైట్ గా నిలిచింది. 

త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభిస్తామని మేకర్స్ కూడా ప్రకటించారు. వీడియోలో  సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అనిపించింది.  సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.