Superstar Krishna ఆ సినిమాతో అమ్మ కోరిక తీర్చిన సూపర్ స్టార్

Tuesday,November 15,2022 - 12:58 by Z_CLU

Super Star Krishna fulfilled his mother dream with ‘Mugguru Kodukulu’

ప్రతీ ఒక్కరికీ మనసులో ఓ కోరిక ఉంటుంది. అది తీరే వరకూ కొందరికి నిద్ర పట్టదు. సరిగ్గా కొన్నేళ్ళ క్రితం సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) తల్లి నాగరత్నమ్మ గారికి అలాంటి కోరికే నిద్ర పట్టకుండా చేసింది. ఆమెకు కృష్ణ , హనుమంత రావు,ఆదిశేషగిరి రావు ముగ్గురు కొడుకులు.  దాంతో ఆమె మనసులో ముగ్గురు కొడుకుల కథతో కృష్ణ ఓ సినిమా చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరికను కృష్ణ ఆస్థాన రైటర్ మహారథి చెవిలో వేశారు నాగ రత్నమ్మ. ముగ్గురు కొడుకుల కథ తాయారు చేయమని చెప్పారు. ఈ లోగ ఆమె టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఎన్ని నెలలు గడుస్తున్నా మహారథి  కథ చెప్పకపోవడంతో కొడుకు కృష్ణ ముందు తన మనసులో ఉన్న కాంక్షను బయట పెట్టారామె. అమ్మ అంటే కృష్ణ గారికి ఎంతో ఇష్టం. ఆమె మాట కాదనలేరు కృష్ణ. ఆమె అడిగింది ముందు పెట్టడమే ఆయనకి తెలుసు. వెంటనే పరుచూరి బ్రదర్స్ కి కబురు పెట్టారు కృష్ణ. నేను , రమేష్ , మహేష్ ముగ్గురం కలిసి అన్నదమ్ములుగా ఓ సినిమా చేయాలి, వెంటనే కథ సిద్దం చేయమని చెప్పారు. పరిచూరి బ్రదర్స్ ఆ సమయంలో చాలా బిజీగా ఉన్నారు. అయినా కృష్ణ గారి మాట కాదనలేక ఓ కథ రెడీ చేసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్ కృష్ణకు నచ్చలేదు.

అదే సమయంలో పీసీ రెడ్డి కృష్ణ కి ఓ లైన్ చెప్పారు. బాగుంది వెంటనే రెడీ చేయండి అంటూ పీసీ రెడ్డి కి రచయిత బీసెట్టి ని ఎటాచ్ చేశారు కృష్ణ. ఇద్దరు కలిసి ‘ముగ్గురు కొడుకులు’ కథ తాయారు చేశారు. మహేష్ చదువుకి ఇబ్బంది కలగకుండా ఉండేలా సెలవుల్లో షూటింగ్ చేయాలని కృష్ణ మాట మేరకు ఊటీ బ్యాక్ డ్రాప్ లో కథ రెడీ చేశారు. మాటలు రాసే భాద్యతను పరుచూరి బ్రదర్స్ పై పెట్టారు కృష్ణ. సంగీత భాద్యతల్ని చక్రవర్తి కి అప్పగించారు. హీరో కృష్ణ సరసన రాధ , రమేష్ బాబు సరసన సోనమ్ ను హీరోయిన్స్ ఎంపిక చేసి ఊటీలో షూటింగ్ మొదలు పెట్టారు.  ఈ సినిమాకు నిర్మాతగా తల్లి నాగరత్నమ్మ గారి పేరు వేసి కృష్ణ గారే డైరెక్ట్ చేశారు. చకచకా షూటింగ్ పూర్తి చేసి  1988 లో అక్టోబర్ 20న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా మంచి విజయం సాదించింది.

అలా ముగ్గురు కొడుకులు (Mugguru Kodukulu) సినిమాతో తల్లి కోరిక తీర్చడమే కాకుండా ప్రేక్షకులకు ఓ ఉత్తమ  సినిమాను అందించి కొడుకులతో కలిసి విజయం అందుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics