"వెన్నెల"గా రాబోతున్న శివానీ రాజ‌శేఖ‌ర్

Wednesday,July 01,2020 - 03:14 by Z_CLU

రానున్న ఒక ఫాంట‌సీ ల‌వ్ స్టోరీలో వెన్నెల అనే క్యూట్ రోల్‌లో శివానీ రాజ‌శేఖ‌ర్ ప‌రిచ‌య‌మౌతోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రంలో తేజ స‌జ్జా హీరోగా న‌టిస్తున్నాడు. జూలై 1, అంటే ఈరోజు శివానీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినిమాలో ఆమె పోషిస్తోన్న క్యారెక్ట‌ర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టులు రాజ‌శేఖ‌ర్‌, జీవితా రాజ‌శేఖ‌ర్ కుమార్తె అయిన శివానీ ఆ పోస్ట‌ర్‌లో ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చుడీదార్ ధ‌రించి, గోడ మీద కూర్చొని ఆకాశంలోని నెల‌వంక‌ను చూపిస్తోన్న ఆమె అపురూప లావ‌ణ్యంతో మెరిసిపోతున్నారు. ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ స‌రిగ్గా పాత్ర పేరు వెన్నెల‌కు త‌గ్గ‌ట్లుగా ఆమె క‌నిపిస్తోంది.

బాల‌న‌టుడిగా ప‌లు చిత్రాల్లో న‌టించి, సూప‌ర్ హిట్ సినిమా ‘ఓ బేబీ’లో యంగ్ యాక్ట‌ర్‌గా ఆక‌ట్టుకున్న తేజ స‌జ్జా ఈ న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.