జీ స్పెషల్: పూరి 20 ఏళ్ల ప్రయాణం

Monday,April 20,2020 - 12:00 by Z_CLU

ఇరవై ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఓ దర్శకుడు టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. తొలి సినిమా ‘బద్రి’ నుంచి ‘ఇస్మార్ట్ శంకర్’ వరకు ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఇండస్ట్రీపై తన మార్క్ వేశాడు. అతడే డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్. ఈ 20 ఏళ్లలో పూరి ఎన్నో ఘనతలు సాధించాడు కానీ అన్నింటికంటే గొప్ప ఘనత మాత్రం ఒకటుంది. టాలీవుడ్ ట్రెండ్ ను మార్చేసిన అతికొద్ది మంది దర్శకుల్లో పూరి జగన్నాధ్ ఒకడు.

తొలి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ తో ‘బద్రి’ తీసి ఓ సూపర్ హిట్ తో కెరీర్ స్టార్ట్ చేశాడు పూరి. ఆ వెంటనే జగపతిబాబుతో ‘బాచి’ చేశాడు. అది ఆడలేదు. అయినా వెనకడుగు వేయలేదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలో అర్థం చేసుకున్నాడు. ‘ఇట్లు శ్రావణి సుబ్రహమణ్యం’ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కి అక్కడి నుండి ప్రతీ సినిమాతో ఓ పోరాటం చేస్తూ చివరికి టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు.

ఇండస్ట్రీలో హిట్స్ గురించి మాట్లాడుకున్నా, సూపర్ హిట్స్ ను తలుచుకున్నా , ఇండస్ట్రీ హిట్ లిస్టు తిప్పి చూసుకున్నా వీటిలో పూరి సినిమాలు కచ్చితంగా ఉంటాయి. ‘బద్రి’, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘చిరుత’, ‘బుజ్జిగాడు’, ‘బిజినెస్ మేన్’, ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ ఇలా పూరి హిట్ సినిమాలు చాలానే ఉంటాయి.

మహేష్ తో పూరి తీసిన ‘పోకిరి’ రికార్డు స్థాయిలో 40 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ ఫీట్ సాధించిన తొలి సినిమా కూడా ఇదే. ఆ సినిమాతో మహేష్ లుక్ మార్చేసి సూపర్ స్టార్ ని కంప్లీట్ మాస్ హీరోగా తీర్చిద్దిన ఘనత పూరి దే. ముఖ్యంగా ‘పోకిరి’లో పూరి డైలాగ్స్ ఇప్పటికీ చిన్నపిల్లలు చెప్తుంటే ముచ్చటేస్తుంది. అదీ పూరి డైలాగ్స్ పవర్. ప్రస్తుతం టాలీవుడ్ టాప్-5 స్టార్స్ లో ఒకడిగా కొనసాగుతున్న రామ్ చరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా పూరీనే.

‘టెంపర్’ తర్వాత వరుసగా పూరిని అపజయాలు పలకరించాయి. అయినా సరే జగన్ అవన్నీ పట్టించుకోకుండా ఏమాత్రం కుంగిపోకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఓ సముద్రపు కెరటంలా దూసుకొచ్చాడు. ఒక్క ఫ్లాప్ వస్తేనే దర్శకులు నెక్స్ట్ సినిమా చేయడానికి దైర్యం చాలని రోజులివి. కొన్ని ప్లాపులొచ్చినా సరే పూరి దైర్యంగా తన కెరీర్ ను ముందుకు సాగించి మళ్ళీ ఓ స్ట్రాంగ్ హిట్ తో ‘ఐయాం బ్యాక్’ అంటూ బాక్సాఫీస్ లెక్కల్ని సరిచేశాడు.

iSmart Shankar FULL MOVIE కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎక్కడో నర్సీపట్నం నుండి సినిమా పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఓ స్టార్ డైరెక్టర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. ఆ కృషి పట్టుదలతో సినిమానే నమ్ముకొని సినిమాతోనే జీవితం అనుకున్నాడు కాబట్టే పూరి అభిమానుల గుండెల్లో ఓ సెపరేట్ ప్లేస్ అందుకున్నాడు.

పూరి సిల్వర్ స్క్రీన్ డైలాగ్సే కాదు రియల్ లైఫ్ లో కూడా ఆయన మాట్లాడే మాటలకు, చెప్పే విషయాలకు పడి చస్తారు ఫ్యాన్స్. ఎప్పుడైనా మనకు ఏంటీ జీవితం అనిపించినప్పుడు జస్ట్ పూరి మాటలు వింటే ఓ కొత్త ఎనర్జీ వస్తుంది. పోరాడాలనే ఉత్సాహం మనలో మొదలవుతుంది. వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా డిప్రెషన్ మూడ్ లో ఉన్నప్పుడు పూరి మాటలే వినాలనుకుంటానంటూ ప్రకటించాడు.

ఓ సూపర్ హిట్ తో మొదలై ఇటీవలే ఓ డబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న పూరి జగన్నాథ్ ఇరవై ఏళ్ల సినీ జీవితం కొత్త దర్శకులందరికీ ఓ స్ఫూర్తి. పూరి మరెన్నో బ్లాక్ బస్టర్స్ అందుకొని ఇలాగే బాక్సాఫీస్ ను ఎప్పటికప్పుడు షేక్ చేస్తూ మనల్ని సరికొత్తగా ఎంటర్టైన్ చేయాలని ఆశిద్దాం.