Movie Review - జేమ్స్

Thursday,March 17,2022 - 04:32 by Z_CLU

నటీ నటులు : పునీత్ రాజ్ కుమార్ , ప్రియా ఆనంద్ , శ్రీకాంత్ , శరత్ కుమార్ , ముకేష్ రుషి , ఆదిత్యా మీనన్ , అను ప్రభాకర్ , హరీష్ పేరడీ తదితరులు.

సంగీతం : చరణ్ రాజ్

సినిమాటోగ్రఫీ : స్వామి జే. గౌడ

నిర్మాత : కిషోర్ పత్తికొండ

రచన – దర్శకత్వం : చేతన్ కుమార్

నిడివి : 149 నిమిషాలు

విడుదల : 17 మార్చ్ 2022

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేతన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘జేమ్స్‘ ఈరోజే ప్రేక్షకుల మునుకొచ్చింది. పునీత్ ఆఖరి సినిమా కావడంతో ఈ సినిమాపై బజ్ నెలకొంది. ఫైనల్ గా జేమ్స్ పునీత్ కి ట్రిబ్యూ లా నిలిచిందా ? అతని ఫ్యాన్స్ ని మెప్పించిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 James telugu review 1

కథ :

వరల్డ్ ఉన్న ముగ్గురు గ్యాంగ్ స్టర్స్ మధ్య బిజినెస్ పరంగా వార్ జరుగుతుంటుంది. ఈ క్రమంలో విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్) తన కుటుంబానికి రక్షణగా జే వింగ్స్ అనే సెక్యురిటీ కంపెనీలో సెక్యురిటీ మేనేజర్ గా వర్క్ చేసే సంతోష్ (పునీత్ రాజ్ కుమార్) ని నియమించుకుంటాడు.

ఇక విజయ్ గైక్వాడ్ కి అలాగే అతని కుటుంబానికి రక్షణ కల్పించడంలో తన నేర్పరితనం చూపుతూ ఎప్పటికప్పుడు కాపాడుతూ ఆ కుటుంబానికి దగ్గరవుతాడు సంతోష్. తన కుటుంబాన్ని కాపాడే క్రమంలో సంతోష్ దైర్య సాహసాలు చూసి అతని ప్రేమలో పడుతుంది విజయ్ చెల్లెలు నిషా గైక్వాడ్ (ప్రియా ఆనంద్). మరో వైపు వరల్డ్ లోనే అతిపెద్ద గ్యాంగ్ స్టర్ (శరత్ కుమార్) తన తమ్ముళ్ళను చంపిన జేమ్స్ గురించి వెతికే క్రమంలో తను వెతుకుతున్న జేమ్స్ సంతోష్ అని తెలుసుకుంటాడు. అసలు సంతోష్ ఎవరు ? అతని జేమ్స్ గా ఎందుకు మారాడు ? విజయ్ గైక్వాడ్ దగ్గర సెక్యురిటీ ఆఫీసర్ గా ఎందుకు చేరాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

పునీత్ రాజ్ కుమార్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది ? తన ఎనర్జీ పెర్ఫార్మెన్స్ తో ఇన్నేళ్ళు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన పునీత్  తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో అలాగే సాంగ్ లో తన ఎనర్జీ చూపించి మెస్మరైజ్ చేశాడు. నిషా గైక్వాడ్ పాత్రలో ప్రియా ఆనంద్ మెప్పించింది. గ్యాంగ్ స్టర్ చెల్లెలుగా కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. ఆర్మీ ఆఫీసర్ గా ప్రత్యేక పాత్రతో శివ రాజ్ కుమార్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.

శ్రీకాంత్ , శరత్ కుమార్, ముకేష్ రుషి తమ విలనిజంతో ఆ పాత్రలకు బలం చేకూర్చారు. సాధు కోకిల , రఘు కామెడీ వర్కౌట్ అవ్వలేదు. హీరో ఫ్రెండ్స్ గా నటించిన ఆర్టిస్టులు ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఆదిత్యా మీనన్ ,  అను ప్రభాకర్ ,  కేతన్  కరండే మిగతా వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన  స్వామి జే. గౌడ మంచి విజువల్స్ అందించాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో కెమెరా వర్క్ చాలా బాగుంది. చరణ్ రాజ్ అందించిన సంగీతం బాగుంది. ఈ సినిమా కోసం చరణ్ కంపోజ్ చేసిన సాడ్ సాంగ్ సినిమాకు ఆయువు పట్టులా నిలిచింది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్స్ నిలిచాయి. కొన్ని యాక్షన్ స్టంట్స్  పునీత్ సొంతంగా కంపోజ్ చేసుకోవడం విశేషం. దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ పరవాలేదు.

చేతన్ కుమార్ కథ -కథనం రొటీన్ గాఉన్నప్పటికీ టేకింగ్ బాగుంది. కొన్ని సన్నివేశాలను అతని తీసిన విధానం ఆకట్టుకుంది. అలాగే సినిమాలో ఉన్న ఎమోషన్ ని క్యారీ చేయడంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కిషోర్ ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్ పై కనిపించింది.

 James telugu review 2

జీ సినిమాలు సమీక్ష : 

కమర్షియల్ యాక్షన్ సినిమాల్లో చాలా వరకూ మూస కథే కనిపిస్తుంది.  గ్యాంగ్ స్టర్స్, వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేసే హీరో. ‘జేమ్స్’ లోనూ అదే ఉంది. కాకపోతే దర్శకుడు చేతన్ ఇందులో ఆర్మీ సోల్జర్ వర్సెస్ గ్యాంగ్ స్టర్స్ అంటూ కొత్తగా కథను చూపించే ప్రయత్నం చేశాడు.  నిజానికి కమర్షియల్ మాస్ సినిమా తీయడం సులువే. ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని కొన్ని ఎపిసోడ్స్ తో మెప్పించగలిగితే కథ పాతదే అయినప్పటికీ మాస్ ఆడియన్స్ ని మెప్పించడం ఈజీ. కాకపోతే మరీ రొటీన్ అనిపించకుండా మెప్పించగలగాలి.  చేతన్ అతని టీం  కమర్షియల్ యాక్షన్ సినిమాకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ , ట్విస్టులు బాగానే క్రియేట్ చేశారు.

ఇక పునీత్ హఠాన్మరనం తర్వాత అతని నుండి వచ్చిన సినిమా కావడంతో కన్నడ ప్రేక్షకులకు ఈ సినిమా ఎలా ఉన్నా నచ్చేస్తుంది. పైగా వాళ్ళు కథ -కథనం కంటే పునీత్ ని స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. నిజానికి పునీత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ తో అతని కష్టం స్క్రీన్ పై కనిపించింది. హై ఎనర్జీతో పవర్ హౌజ్ లా కనిపిస్తూ స్టంట్స్ చేశాడు. మొదటి సాంగ్ లో పునీత్ డాన్స్ కూడా ఎప్పటిలానే అలరిస్తుంది. పునీత్ ఇంట్రో , అతని క్యారెక్టరైజేషణ్ ,  హీరోయిజం ఫ్యాన్స్ కి థియేటర్స్ లో పండగ వాతావరణం తీసుకొచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు మేజర్ హైలైట్స్ అని చెప్పొచ్చు. ఇక పునీత్ చేయాల్సిన కొంత షూట్ ని మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. చివర్లో సినిమాలో ఉన్న ఓ సాడ్ సాంగ్ తో పునీత్ మేకింగ్ విజువల్స్ వేసి మరో పక్క అతని కెరీర్ గురించి తెలియజేసేలా ఇన్ఫో అందిస్తూ నివాళి అందించారు. ఆ సాంగ్ తో పునీత్ మేకింగ్ విజువల్స్ చూస్తే ఫ్యాన్స్ కంట్లో నీళ్ళు ఆగవు. చివర్లో  పునీత్ కి ఈ సినిమా ద్వారా ఘన నివాళి ఇచ్చారనిపిస్తుంది.

కాకపోతే సినిమా కథ -కథనం రొటీన్ అనిపిస్తాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా గతంలో చాలా సినిమాల్లో చూసేసినట్టే ఉంటుంది. కాకపోతే ఎమోషనల్ గా సాగే ఆ ఎపిసోడ్ కొందరు  ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో పాటు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా థ్రిల్ చేస్తుంది. పునీత్ యాక్టింగ్ , యాక్షన్ ఎపిసోడ్స్ , ఇంటర్వెల్ బ్లాక్ , సాంగ్స్ , విజువల్స్ , ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా పునీత్ చివరి సినిమా మాస్ ఆడియన్స్ ని అలరిస్తూ మెప్పిస్తుంది. పునీత్ యాక్షన్ కోసం ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే.

Note: ఇది దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా. కాబట్టి ఈ మూవీకి రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అందుకే రేటింగ్ ఇవ్వడం లేదు.