అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. మాయాబజార్

Wednesday,March 27,2019 - 03:32 by Z_CLU

తెలుగు చలనచిత్ర చరిత్రలో నంబర్ వన్ స్థానం ఇవ్వాల్సి వస్తే మాయాబజార్ సినిమాకే ఎక్కువ మంది ఓటేస్తారు. ప్రతి తెలుగు ప్రేక్షకుడు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా ఇది. తెలుగువాడి ఆస్తి ఈ సినిమా. తెలుగు సినిమా బతికున్నంత కాలం మాయాబజార్ నిలిచిపోతుంది. ఈ ఆణిముత్యం విడుదలైన ఇవాళ్టికి (మార్చి 27)
సరిగ్గా 62 ఏళ్లు అయింది.

అప్పటివరకు కృష్ణుడు అంటే మనకు ఈలపాట రఘురామయ్యే. కానీ మాయాబజార్ లో తెలుగింటి కృష్ణుడిగా మారిపోయారు ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత ఏకంగా 18 సినిమాల్లో ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించారంటే,
మాయబజార్ మహత్యాన్ని అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికీ కృష్ణుడు అంటే తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆరే.

ఈ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్. నిజానికి ఈ పాటల వెనక కూడా గమ్మత్తయిన కథ ఉంది. ఈ సినిమా కోసం ముందుగా సాలూరి రాజేశ్వరరావును తీసుకున్నారు. ఆయన 4 పాటలు కూడా ఇచ్చారు. తర్వాత ఆయన బిజీగా ఉండడంతో, ఘంటసాలను తీసుకున్నారు. మిగతా పాటలన్నీ ఘంటసాలే స్వరపరిచారు. టైటిల్స్ లో ఘంటసాల పేరు వేశారు.

అప్పట్లో 10 లక్షల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను నిర్మించేందుకు విజయా ప్రొడక్షన్స్ వెనక్కి తగ్గింది. దీంతో చాలా నిర్మాణ సంస్థలు మాయాబజార్ నిర్మించేందుకు ముందుకొచ్చాయి. ఫైనల్ గా
విజయా బ్యానర్ పైనే వచ్చింది మాయాబజార్.

తెరపై ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి ఎంతగా జీవించారో.. తెరవెనక పింగళి నాగేంద్రరావు, ఘంటసాల, మార్కస్ బార్ ట్లే, పీతాంబరం, కేవీరెడ్డి అంతలా కష్టపడ్డారు. అందుకే మాయాబజార్ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది.