'మగధీర' సంచలనానికి 11 ఏళ్లు

Thursday,July 30,2020 - 05:41 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తొలి సినిమా ‘చిరుత’ తో సూపర్ హిట్ కొట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో సినిమాను రాజమౌళి డైరెక్షన్ లో చేయడం, అదీ ‘మగధీర’ లాంటి పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం అవ్వడంతో అటు మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్ని కూడా ఆకర్షించి సినిమా విడుదల కోసం వేయి కళ్ళతో ఎదురుచూసేలా చేసింది. దాదాపు రెండేళ్ళ పాటు షూటింగ్ జరగడం, మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్స్ , సాంగ్స్ అన్నీ ఆకట్టుకొని సినిమాపై ఎక్కడలేని భారీ అంచనాలు నెలకొల్పాయి. అలా భారీ అంచనాలతో థియేటర్స్ లో అడుగుపెట్టినప్రేక్షకుల అంచనాలు అధిగమించి విజయం సాధించి సంచలనం సృష్టించింది ‘మగధీర’. కాలభైరవ గా రామ్ చరణ్ సాధించిన సంచలన విజయానికి జులై 31తో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

2009 జులై 31.. అప్పటికే బెన్ఫిట్ షోలు చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేవ్. ఒక్కొక్కరు పూనకమోచ్చినట్టు ఊగిపోతున్నారు. కొందరు ఇంటర్వెల్ కే సినిమా హాల్ నుండి బ్లాక్ బస్టర్ అంటూ బయటికొచ్చారు. ఇక సినిమా పూర్తయ్యాక వారి నోటి నుండి వచ్చిన ఇండస్ట్రీ హిట్ అనే మాటే లెక్కగా నిజమైంది. మొదటి రోజు మార్నింగ్ షో నుండి 175 డేస్ వరకూ డ్రాప్ అనే పదానికి చోటివ్వకుండా సరికొత్త లెక్కలు చూపిస్తూ తెలుగు స్థాయిని పెంచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘మగధీర’.

తొలి రోజు మార్నింగ్ షో నుండే టికెట్ల కోసం జనాలు థియేటర్స్ ముందు క్యూ కట్టడం, దొరకక మళ్ళీ మళ్ళీ సినిమా హాల్ చుట్టూ రౌండ్స్ వేయడం మొదలైంది. మెగా స్టార్ వారసుడిగా ఉన్న క్రేజ్ కి అదిరిపోయే బొమ్మ పడటంతో రామ్ చరణ్ రికార్డులు తిరగరాశాడు. ఒక గొప్ప సినిమా తీసి తన సత్తా చాటాలన్న దర్శకుడు రాజమౌళి కల, వరల్డ్ వైడ్ గా భారీ సినిమా తీసి నిర్మాతగా మరింత గుర్తింపు తెచ్చుకోవాలనే అల్లు అరవింద్ కోరిక ఒక్క సినిమాతోనే సాధ్యమైంది.

కాల భైరవ, మిత్ర వింద ఓ కొండపై నుండి లోయలోకి పడే షాట్ తో మొదలైన సినిమా క్లైమాక్స్ వరకు అదే టెంపో మెయింటైన్ చేస్తూ కొన్ని చోట్ల మెస్మరైజ్ చేస్తూ చివరికి ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమా చూసామనే ఫీలింగ్ కలిగించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో 10 నిమిషాల్లో 400 ఏళ్లు వెనక్కి అంటూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై హింట్ ఇచ్చి ప్రేక్షకుల మైండ్ లో సెకండ్ హాఫ్ పై ఆసక్తి కలిగించాడు జక్కన్న. ఇక ఫస్ట్ హాఫ్ లో హర్ష గా మెప్పించిన రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కాల భైరవగా రెచ్చిపోయి సీటులో కూర్చున్న ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి అభిమానులకు పూనకాలు తెప్పించాడు. ముఖ్యంగా సినిమా కోసం కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీ నేర్చుకొని కాల భైరవ పాత్రకు ప్రాణం పోశాడు. సినిమా అనంతరం తండ్రికి తగ్గ కొడుకు అంటూ ప్రశంసలు కూడా అందుకున్నాడు చరణ్. రెండో సినిమాకే రాజమౌళి లాంటి దర్శకుడి చేతిలో పడి ఇండస్ట్రీ హిట్ సాధించి ఔరా అనిపించాడు.

చరణ్ తర్వాత కాజల్ గురించే చెప్పుకోవాలి. సినిమాలో మిత్రవింద గా కాజల్ మెరుపులు చిమ్మింది. అమ్మడు అందానికి రణదేవ్ బిల్లా లా ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.రాజకుమారి అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేలా పాత్రలో ఒదిగిపోయింది కాజల్. ఇక షేర్ ఖాన్ పాత్రలో శ్రీహరి సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయ్యాడు. శ్రీకాకుళం యాసతో సోలోమన్ గా ఆకట్టుకున్న శ్రీహరి ఫ్లాష్ బ్యాక్ లో షేర్ ఖాన్ గా అదరగొట్టి ఘన విజయంలో పాలుపంచుకున్నాడు. హీరోగా ఎన్ని సినిమాలు చేసినా ,నటుడిగా ఎన్ని పాత్రల్లో కనిపించినా శ్రీహరి పేరు వినగానే గుర్తుచ్చే పాత్రగా షేర్ ఖాన్ మిగిలిపోయింది. ముఖ్యంగా ‘మళ్ళీ పుట్టలిరా భైరవా’ అంటూ షేర్ ఖాన్ గా శ్రీహరి చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ కి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. విలన్ గా దేవ్ గిల్ కూడా బాగా సూటయ్యాడు. గుర్రపు స్వారీ అంటేనే భయపడే దేవ్ గిల్ తనకి వచ్చిన అద్బుతమైన అవకాశంగా భావించి పట్టుపట్టి నేర్చుకున్నాడు.

కాల భైరవ వంద మంది సైనికులను హతమార్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమా ఘన విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ ‘మగధీర’ అంటే ఒక్కొక్కడ్ని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకే సారి రమ్మను అంటూ చరణ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో పాటు ఆ యాక్షన్ సీన్ గుర్తొస్తుంది. ఇక శంకర్ దాదా జిందాబాద్ తర్వాత బ్రేక్ తీసుకున్న చిరు తనయుడితో గెస్ట్ రోల్ చేసి అభిమానులకి సప్రయిజ్ ఇచ్చాడు. చిరు కనిపించింది కాసేపే అయినా ఆ సన్నివేశం స్క్రీన్ పై బాగా పండింది. చాలా రోజుల తర్వాత మెగా స్టార్ ను స్క్రీన్ పై చూసి ఫ్యాన్స్ మురిపోయారు. సినిమాలో ప్రతీ సన్నివేశాన్ని గొప్పగా తీసి తెలుగు సినిమా సత్తా చాటాడు రాజమౌళి. అవును ‘బాహుబలి’ సినిమా తీయడానికి రాజమౌళి కి , నిర్మించడానికి నిర్మాతలకు ఓ భరోసా ఇచ్చిన సినిమా ‘మగధీర’. ఇది ముమ్మాటికి ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.

ఏ మాటకామాటే రాజమౌళి మైండ్ లో ఉన్న ఐడియా సినిమా రావడానికి టీం అందరు బెస్ట్ సపోర్ట్ అందించారు. ముఖ్యంగా సినిమా సాధించిన సంచలన విజయంలో కీరవాణి పాత్ర ఎక్కువ అని చెప్పొచ్చు. తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ప్రేక్షకులు బాగా కనెక్ట్ చేయడమే కాకుండా సినిమాకు అదిరిపోయే ఆల్బం ఇచ్చాడు కీరవాణి. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ గా రాజమౌళి భార్య రమ కూడా చాలా కష్టపడ్డారు. హీరో హీరోయిన్ కి ఆమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. అలాగే సెంథిల్ హై స్టాండర్డ్ సినిమాటోగ్రఫీ, అద్భుతమైన ఫైట్స్ వెనుకున్న పీటర్ హెయిన్స్ , భారీ సెట్స్ డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, సినిమాను పర్ఫెక్ట్ గా కట్ చేసిన కోటగిరి వెంకటేశ్వరావుతో , అద్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్ డిజైన్ చేసిన కమల్ కన్నన్ ఇలా టీం అందరూ రాజమౌళి కి బెస్ట్ సపోర్ట్ ఇచ్చి గొప్ప విజయంలో భాగస్వామ్యం అయ్యారు. ఇక అప్పట్లోనే కోట్ల వ్యయంతో సినిమాను గొప్పగా నిర్మించిన అల్లు అరవింద్ దైర్యాన్ని కూడా మెచ్చుకోవాలి. ఇలా చెప్పుకుంటే పోతే మగధీర గురించి ఓ పుస్తకం రాయొచ్చు.

 

తెరవెనుక కథ :

*దాదాపు పదిహేనేళ్ళ క్రితం తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన రాజమాత, ఆమెను నిత్యం కాపాడే ఓ బాడీ గార్డ్ కథ రాజమౌళి మైండ్ లో రిజిస్టర్ అయిపొయింది. ఓ సందర్భంలో తండ్రి ఒక సినిమా కోసం రెడీ చేసి రిజెక్ట్ అయిన ఆ కథను ఎప్పటికైనా తను తీయాలని డిసైడ్ అయ్యాడు రాజమౌళి. ఆ పట్టుదలతోనే ఆ కథ వినిపించి మెగా ఫ్యామిలీ ను ఒప్పించి వారిలో కాన్ఫిడెన్స్ పెంచాడు. ఇంకేముంది రాజమౌళి చెప్పిన కథకు థ్రిల్ అయిన చిరు, రామ్ చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక మేనల్లుడు హీరోగా ఓ గొప్ప సినిమా చేయాలని అది చిరంజీవి గారికి గిఫ్ట్ లా ఉండాలన్న ఉద్దేశ్యంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ అవ్వకూడదని రాజమౌళి కి చెప్పేశాడు అల్లు అరవింద్.

*షూటింగ్ సమయంలో స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ బైక్ స్టంట్ చేస్తూ గాయలపాలయ్యాడు. మళ్ళీ నెలకే కోలుకొని సెట్ లో అడుగుపెట్టాడు. వాటర్ ఫాల్స్ నుండి గుర్రంతో జంప్ చేసే సన్నివేశంలో చరణ్ లిగ్మెంట్ కి గాయమైంది.

*చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడి పెట్ట సాంగ్ ను ఇందులో రీమేక్ చేశారు. ఆ ఐడియా కీరవాణి భార్య వల్లి గారిది. ఆమె తన ఆలోచన బయట పెట్టగానే రాజమౌళి బాగుంది వదిన అనేసారు.

*ఉత్తమ నృత్య దర్శకునిగా శివ శంకర్ మాస్టర్ కి , బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో కమల్ కన్నన్ కి నేషనల్ అవార్డ్స్ దక్కాయి. అలాగే తొమ్మిది నంది అవార్డులు, ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకుంది మగధీర.

*సినిమాకు అనుకున్న బడ్జెట్ దాటినా విజువల్ ఎఫెక్ట్స్ కోసం మళ్ళీ ఓ బడ్జెట్ కేటాయించి ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా చూసారు నిర్మాత అల్లు అరవింద్. ఇక రిలీజ్ కి రెండ్రోజుల ముందు కాంప్రమైజ్ అవ్వకుండా గ్రాఫిక్స్ షాట్స్ లో మార్పులు చేశాడు రాజమౌళి.

*వందరోజుల పాటు హౌజ్ ఫుల్ బోర్డులతో దూసుకెళ్లిన మగధీర 223 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది.

పదకొండేళ్ళు కాదు ఇంకో వందేళ్ల తర్వాత కూడా గొప్పగా చెప్పుకొనే తెలుగులో సినిమాల్లో మగధీర ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

-రాజేష్ మన్నె