Karthikeya 2 - రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,July 21,2022 - 04:25 by Z_CLU

నిఖిల్ హీరోగా నటిస్తున్న కార్తికేయ-2పై భారీ అంచనాలున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు, అంచనాలకు తగ్గట్టే భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. కార్తికేయ2 సినిమాను ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

నిజానికి ఈ సినిమా, లెక్కప్రకారం ఈ వీకెండ్, అంటే 22వ తేదీన థియేటర్లలోకి రావాలి. కానీ థాంక్యూ సినిమాకు సోలో రిలీజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, దిల్ రాజు విజ్ఞప్తి మేరకు కార్తికేయ-2ను వాయిదా వేశారు. అలా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాను ఆగస్ట్ 12న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

శ్రీకృష్ణుడి ప్రయాణం, ద్వారక నగరం లాంటి అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి వివరించేందుకు, ఇస్కాన్ ఆహ్వానం మేరకు ద్వారక వెళ్లింది యూనిట్. అక్కడే తెలుగు తప్ప, మిగతా భాషల టీజర్లను విడుదల చేసింది. అదే వేదికపై సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2, ట్రయిలర్ తోనే అంచనాల్ని అందుకుంది. ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నాడు కార్తికేయ. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రయిలర్-2ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందించాడు.