Interview - దిల్ రాజు (F3 Movie)

Thursday,May 19,2022 - 04:35 by Z_CLU

27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది ఎఫ్3. ఎఫ్ 2 రేంజ్ లో ఇది కూడా పెద్ద హిట్టవుతుందంటున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా హైలెట్స్ తో పాటు.. డిస్ట్రిబ్యూటర్ గా తన అనుభవాలు, టాలీవుడ్ లో పెంచిన టికెట్ రేట్లపై తన అభిప్రాయాల్ని బయటపెట్టాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.

పంచభూతాలతో పాటు డబ్బు కూడా
ఎఫ్2 పెద్ద హిట్టయితే, ఎఫ్3 చేద్దామని అనీల్ రావిపూడి అప్పట్లోనే నాకు ఈ ఐడియా చెప్పాడు. ఆ తర్వాత సినిమా సక్సెస్ అవ్వడంతో ఎఫ్3 స్టార్ట్ చేశాం. అందర్నీ రెడీ చేశాం. అనీల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే. ఇది నాన్-స్టాప్ ఎంటర్ టైనర్. ఎఫ్2లో అమ్మాయి-అబ్బాయి, భార్యాభర్త మధ్య ఫ్రస్ట్రేషన్ చూపించాం. ఎఫ్3లో మనీ గురించి చెప్పాం. మనిషికి పంచభూతాలు ఎంత అవసరమో, డబ్బు అంతే అవసరం అని చెప్పాం.

క్యారెక్టర్లు అవే.. క్యారెక్టరైజేషన్లు మారతాయి..
ఎఫ్2 లో ఉన్న క్యారెక్టర్లే ఉంటాయి. కానీ క్యారెక్టరైజేషన్లు భిన్నంగా ఉంటాయి. కథ మొత్తం మనీ చుట్టూ తిరుగుతుంది. అనీల్ స్టయిల్ ఏంటంటే.. కథ కంటే ఎక్కువగా కథనం మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. రెండున్నర గంటలు ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాలని చూస్తాడు. నేను కథ మీద ఉంటాను. అందుకే అనీల్ విషయానికొచ్చేసరికి నేను కథ కంటే అనీల్ ను చూస్తాను.

భారీ తారాగణం..బిగ్ బొనాంజా
ఎఫ్2 కంటే ఎఫ్3లో ఎక్కువమంది ఆర్టిస్టులున్నారు. ఎఫ్2 పాత్రలన్నీ ఎఫ్3లో ఉంటాయి. ఫస్టాఫ్ లో సునీల్ యాడ్ అవుతాడు. సెకండాఫ్ లో ప్రతి లేయర్ లో ఓ కొత్త నటుడు యాడ్ అయ్యాడు. అలా మా సినిమా పెద్ద బొనాంజా అయిపోయింది. ఇంతమంది ఆర్టిస్టులతో సినిమా చేయడం చాలా టఫ్ జాబ్. పైగా ప్యాండమిక్ కూడా ఉంది. అందుకే 85 రోజుల్లో అనుకున్న సినిమాకు 105 రోజులు పట్టింది.

ఒక్క సీన్ కూడా చూడలేదు
తన సినిమాను బిట్స్ బిట్స్ గా ప్రొడ్యూసర్, హీరోకు చూపించడం అనీల్ రావిపూడికి అలవాటు. కానీ ఎఫ్3కి వచ్చేసరికి నేను ఒక్క సీన్ కూడా చూడలేదు. ఎడిటింగ్ పూర్తయి, రఫ్ కట్ అయిన తర్వాతే చూస్తానని చెప్పాను. నా చుట్టుపక్కల ఉన్నోళ్లంతా సీన్లు చూశారు. నాకు చెబుతుంటే వద్దనే వాడ్ని. ఎందుకంటే ఎఫ్3 ఎలా రాబోతోందనేది నాకు తెలుసు. ఫైనల్ గా డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత ఫస్టాఫ్ పూర్తయ్యేసరికి నవ్వలేక కడుపు పట్టుకున్నాను. సినిమాలో 90 నిమిషాలు కచ్చితంగా నవ్వుతారు. థియేటర్ల నుంచి బయటకొచ్చే 5 నిమిషాల ముందు వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. నేను గ్యారెంటీ.

పాత జీవో ప్రకారమే టికెట్ రేట్లు
కరోనా/లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. ఎంత తగ్గింది, ఏ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే అంశంపై నేను రిపోర్ట్స్ తెప్పించుకున్నాను. మధ్యతరగతి ప్రేక్షకులు టికెట్ రేట్లకు భయపడి రావడం తగ్గించారు. అంత డబ్బు పెట్టి సినిమా చూసేబదులు మటన్ తెచ్చుకొని తిందాం అనే ఆలోచనలో ఉన్నారు. ఈ పద్ధతి మార్చాలనుకున్నాం. తిరిగి ప్రేక్షకులు థియేటర్లకు రావాల్సిందే. అందుకే టికెట్ రేట్ల విషయంలో పాత జీవోనే ఫాలో అవ్వబోతున్నాం. నాకు నాన్-థియేట్రికల్ బిజినెస్ కిక్ ఇవ్వదు. థియేటర్లలో సినిమా ఫుల్స్ నడిస్తే నాకు కిక్. ఎఫ్3 సినిమా నాకు ఆ కిక్ ఇస్తుందని నమ్ముతున్నాను. థియేటర్లకు విచ్చలవిడిగా ఆడియన్స్ వస్తారు. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ పెరుగుతారు.

అందరూ నన్నే తిడుతున్నారు
ఈమధ్య కొన్ని సినిమాలు రిలీజయ్యాయి. వాటి కోసం టికెట్ రేట్లు పెంచారు. రేట్లు పెంచినప్పుడు జనాలు నన్ను తిట్టారు. నైజాంలో నేను ఓ సినిమా రిలీజ్ చేస్తే టికెట్ రేట్లు నేను పెంచుతున్నానని అనుకున్నారు. తెరవెనక ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు. ఆ సినిమా వెనక నిర్మాత, ప్రొడ్యూసర్, మార్కెట్ ఇలా అన్నీ ఉంటాయి. కానీ ముందు నేను కనిపిస్తున్నాను కాబట్టి నన్ను తిడుతున్నారు. అందుకే అందరికంటే ముందు నేను స్టెప్ తీసుకున్నాను. సాధారణ టికెట్ రేట్లకే ఎఫ్3ను రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా రిజల్ట్ తో నేను మిగతా ప్రొడ్యూసర్లతో గట్టిగా మాట్లాడగలను.

టికెట్ డబ్బులన్నీ నిర్మాతకు రావు
టికెట్ రేట్లు పెంచితే డబ్బు అంతా నిర్మాతకే వచ్చేస్తుందనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ కు వచ్చేది చాలా తక్కువ. ఉదాహరణకు మల్టీప్లెక్సునే తీసుకుందాం. ఎఫ్3 సినిమానే తీసుకుందాం. హైదరాబాద్ ప్రైమ్ మల్టీప్లెక్సులో ఎఫ్3 టికెట్ రేటు 250 + జీఎస్టీ ఉంటుంది. అటుఇటుగా 295 రూపాయలు పడుతుంది. ఇందులో 45 రూపాయలు (జీఎస్టీ) ప్రభుత్వానికి వెళ్తుంది. 250 రూపాయలు నెట్ అంటాం. ఇందులో సగం డబ్బు మల్టీప్లెక్సుకు వెళ్తుంది. మిగతా సగం, అంటే 125 రూపాయలు మాత్రమే డిస్ట్రిబ్యూటర్ లేదా ప్రొడ్యూసర్ కు వస్తుంది.

నైజాంలో నాకు 60 థియేటర్లు మాత్రమే
నైజాంలో 450 థియేటర్లు ఉన్నాయి. మా సంస్థకు లీజు రూపంలో 60 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. ఏషియన్ సునీల్, సురేష్ బాబు గారి దగ్గర 150 థియేటర్లు ఉన్నాయి. మిగతావాళ్లకు మిగతా థియేటర్లు ఉన్నాయి. నైజాంను దిల్ రాజు కంట్రోల్ లో పెట్టుకున్నాడు… ఊపేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. 60 థియేటర్లతో నేను ఊపలేను. కాకపోతే మిగతా 150 థియేటర్లు ఉన్నోళ్లు నా మాట వింటారు. ఎఁదుకంటే, ఎవరైనా మాకు అడ్వాన్స్ ఇస్తే, 2-3 వారాల్లో వాళ్లు ఎకౌంట్స్ క్లోజ్ చేసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్లు డబ్బు తీసుకెళ్తారు. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా అడ్వాన్స్ నా దగ్గర సెక్యూర్డ్ గా ఉంటుంది. రెండో రీజన్ ఏంటంటే.. ఎక్కువగా సినిమాలు చేయడం వల్ల ఆటోమేటిగ్గా ప్రయారిటీ మాకు ఇస్తారు. ఈ రెండు కారణాల వల్ల నైజాంలో మేం నంబర్ వన్ గా ఉన్నాం. అంతేతప్ప, మేమేదో కంట్రోల్ చేసేస్తాం అనుకుంటే అది తప్పు. 20 ఏళ్లుగా మేం సంపాదించింది డబ్బు కాదు.. ఓ గౌరవం, ఓ గుడ్ విల్. హీరో, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ లో నా మాటకు ఓ విలువ ఉంటుంది.

ఎఫ్4 ఐడియా కూడా ఉంది..
ఎఫ్4 కూడా ప్లానింగ్ లో ఉంది. అనీల్ రావిపూడి మంచి ఐడియా చెప్పాడు. ఎఫ్3 తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటాం. ఎఫ్2 మా బ్యానర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎఫ్3 వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయనేది జూన్ 10వ తేదీన చెబుతాను.