అందమైన ప్రేమకథకు 14 ఏళ్లు

Tuesday,May 19,2020 - 03:48 by Z_CLU

ఈ వేసవి చాలా చల్లగా ఉంటుందనే కాప్షన్ తో వచ్చిన గోదావరి సినిమా.. 2006 వేసవిలో నిజంగానే మంచు కురిపించింది. పరవళ్లు తొక్కే గోదారి అందాల మధ్య, శేఖర్ కమ్ముల ఆవిష్కరించిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ విడుదలై నేటికి (మే 19) సరిగ్గా 14 ఏళ్లు.

ఆనంద్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమా గోదావరి. సుమంత్, కమలినీ ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు గోదావరిని బ్యాక్ డ్రాప్ గా సెలక్ట్ చేసుకోవడమే సగం సక్సెస్. దీనికి కేఎమ్ రాథాకృష్ణన్ సంగీతం యాడ్ అవ్వడంతో… ఓ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ఆవిష్కృతమైంది.

ఈ సినిమాలో పాటలన్నీ హిట్టే. లెజెండ్ లిరిక్ రైటర్ వేటూరి రాసిన పాటలివి. అందంగా లేనా.. ఉప్పొంగెలే గోదావరి, రామసక్కని సీత, మనసావాచా.. ఇలా ప్రతి పాట దేనికదే సూపర్ హిట్ అయింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా రాథాకృష్ణన్ కు నంది అవార్డ్ అందించింది.

ఇక సినిమాలో హీరోగా నటించిన సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటికే సత్యం లాంటి సూపర్ హిట్ సినిమా అతడి కెరీర్ లో ఉంది. గౌరి, మహానంది లాంటి సినిమాలతో మాస్ ఇమేజ్ కూడా ఉంది. అలాంటి టైమ్ లో గోదావరి సినిమాలో రామ్ అనే సాఫ్ట్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు సుమంత్. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఈ హీరో కెరీర్ లో గోదావరి సినిమాది ప్రత్యేక స్థానం.

అటు కమలినీ ముఖర్జీ కూడా ఈ సినిమాతోనే పాపులర్ అయింది. ఈమెతో పాటు నటించిన నీతూచంద్ర, కమల్ కామరాజు, తనికెళ్ల భరణి, సీవీఎల్ నరసింహారావు లాంటి నటీనటులందరికీ ఈ సినిమాతో మంచి పేరొచ్చింది.

ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వరించాయి. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా ఇది ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా కమ్ముల, ఉత్తమ మ్యూజిక్ డైరక్టర్ గా రాధాకృష్ణన్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా విజయ్ సి.కుమార్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా సునీత్ (అందంగా లేనా పాట) నంది అవార్డులు అందుకున్నారు.