ఎక్స్ క్లూజీవ్ : డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఇంటర్వ్యూ

Friday,January 10,2020 - 10:17 by Z_CLU

శతమానం భవతి’ సినిమాతో మంచి ఫ్యామిలీ సినిమాల దర్శకుడు అనిపించుకున్న సతీష్ వేగేశ్న ‘ఎంత మంచివాడవురా’ తో మాస్ టచ్ ఉన్న సినిమా కూడా చేయగలడు అనిపించుకోబోతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘జీ సినిమాలు’ తో షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం.

 

మా మంచోడు అలాంటి వాడే… 

మనం నవ్వుతూ హ్యాప్పీగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని పంచుకున్నవాడి కన్నా, మనం బాధలో ఉన్నప్పుడు మన బాధని పంచుకున్నవాడు మనకు లైఫ్ లో గుర్తుండిపోతాడు. వీడు మంచోడు అనుకుంటాడు. మా మంచోడు కూడా అలాంటివాడే.

సినిమా కాన్సెప్ట్ అదే 

మనందరిలో ఎంతో కొంత మంచి ఉంటుంది. ఆ మంచిని పది మందికి పంచినప్పుడు ఇంకా బావుంటుంది. అదే ఈ సినిమా కాన్సెప్ట్.

 

చాలా మార్పులు చేశాం…

గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ నుండి కేవలం ఎమోషన్ సప్లై అనే ఒక్క పాయింట్ తప్ప, చాలా వరకు మార్పులు చేసాము. హీరోయిన్ క్యారెక్టర్ దగ్గరి నుండి కథ నడిచే విధానం ప్రతీది మార్చుకున్నాం. కథగా చెప్పుకుంటే ‘ఆక్సిజన్’ కథ వేరు.. ‘ఎంత మంచివాడవురా’ వేరు… ఒక్క ఎమోషన్ సప్లై అనే పాయింటే ఆ కథనుండి తీసుకున్నాం.

 

ఫ్యామిలీ సినిమాల స్పెషలిస్ట్…

సినిమా ఇండస్ట్రీకి రావాలని కొన్ని లక్షల మంది కలలు కంటే ఒక వెయ్యి మంది మాత్రమె రాగలుగుతారు. ఆ వెయ్యి మందిలో 100 మాత్రమే తను అనుకున్నది చేయగలుగుతారు. ఆ వంద మందిలో కొంతమందికి మాత్రమే ఒక బ్రాండ్ దక్కుతుంది. అలాంటప్పుడు నన్ను ఫ్యామిలీ సినిమాల స్పెషలిస్ట్ గా గుర్తిస్తే హ్యాప్పీనే కదా.

 

మార్పు తప్పనిసరి…

మూడేళ్ళ క్రితం రిలీజైన ‘శతమానం భవతి’ చూసిన జెనెరేషన్ కి ఇప్పటి జెనెరేషన్ కి తేడా ఉంది. నేను మళ్ళీ అలాంటి సినిమానే చేస్తేనే సతీష్ వేగేశ్న ఇంకా ఎదగలేదు అక్కడే ఉన్నాడు అంటారు. అందుకే ఇప్పుడీ సినిమా… సినిమా సినిమాకి మార్పు తప్పనిసరి.

కళ్యాణ్ రామ్ గారికి నచ్చలేదు…

ప్రసాద్ గారు కళ్యాణ్ రామ్ గారికి ‘ఆక్సిజన్’ సినిమా గురించి చెప్పగానే ఆ సినిమా ఆయనకు నచ్చలేదు. అప్పుడు ప్రసాద్ గారు ఒకసారి డైరెక్టర్ వర్షన్ వినండి ఆ తరవాత డిసైడ్ అవుదాం అంటే.. అప్పుడు విన్నారు. ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నారు. మహా అయితే ఆయన ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ప్రిఫర్ చేశారు.

 

అదే ఫ్రెష్ పాయింట్…

‘ఎంత మంచివాడవురా’ లో ఉన్న కొత్త పాయింట్ ఏంటంటే.. ఈ సినిమా జస్ట్ ఒక్క కథ కాదు. ఓ కథ అయిపొయింది అనగానే ఇంకో కథ కనెక్ట్ అవుతుంది. వారితో హీరోకి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ బాండింగ్.. చాలా కొత్తగా అనిపిస్తుంది.