Interview - వసిష్ట (బింబిసార)

Monday,August 01,2022 - 04:33 by Z_CLU

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వసిష్ఠ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై హరి నిర్మించిన సోషియో ఫాంటసీ మూవీ ‘బింబిసార’ ఆగస్ట్ 5న గ్రాంగ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వసిష్ట మీడియాతో మాట్లాడారు. తన మొదటి సినిమా గురించి వసిష్ఠ చెప్పిన విశేషాల తన మాటల్లోనే…

ఆదిత్య 369 …ఆదర్శంగా

సింగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో బాలయ్య గారు నటించిన ఆదిత్య 369 ని ఆదర్శంగా తీసుకొని టైం ట్రావెల్ కథ రాసుకోవడం జరిగింది. ఇంకొన్ని టైం ట్రావెల్ సినిమాలు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను.  కానీ టైం ట్రావెల్ సినిమాల్లో అన్నిటిలో ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళారు తప్ప వెనక నుండి ముందుకు రాలేదు. ఆ పాయింట్ టచ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఒక రాజు ఆ కాలం నుండి ఈ కాలానికి వస్తే ? ఎలా ఉంటుంది అనే ఐడియా నుండి పుట్టిందే బింబిసార.

పేరొక్కటే వాడుకున్నాం

ఈ కథకి ఒకప్పటి రాజు బింబిసారుడు కి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆయన పేరు మాత్రమే తీసుకున్నాం తప్ప ఈ పాత్ర కి ఆ పాత్రకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది ఓ చందమామ కథ లాంటి ఫిక్షన్ స్టోరీ అంతే.

పటాస్ నుండి ట్రావెల్ 

కళ్యాణ్ రామ్ గారితో పటాస్ నుండి ట్రావెల్ అవుతున్నాను. ఆయనకీ కొన్ని కథలు చెప్పాను. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. కళ్యాణ్ రామ్ గారు మహానాయకుడు షూటింగ్ లో ఉండగా ఆయనకి కాల్ చేసి ఒకసారి కలవాలి అని చెప్పాను. వెంటనే ఆయన టైం ఇవ్వడం ‘బింబిసార’ కథ చెప్పగానే నచ్చడం , తర్వాత హరి గారికి నెరేషన్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ కొన్ని రోజులకే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ చేసి తొందరగానే సెట్స్ పైకి వెళ్ళిపోయాం.

టీం వర్క్ 

కళ్యాణ్ రామ్ గారు ఈ కథ మీద అలాగే నా మీద మంచి నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. అలాగే ఇది టీం వర్క్ తో సాధ్యమైన సినిమా అని చెప్పొచ్చు. అనుభవం ఉన్న టెక్నీషియన్స్ దొరకడంతో బింబిసారుడి కథని ఈ స్కేల్ లో చూపించగలిగాను. ముఖ్యంగా ఛోటా గారి ఎక్స్ పీరియన్స్ ఆయన వర్క్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. అలాగే కీరవాణి గారి స్కోర్ కూడా బాగా హెల్ప్ అయింది. ఫైట్ మాస్టర్స్ , ఆర్ట్ డైరెక్టర్ , డైలాగ్ రైటర్ వాసు ఇలా అన్ని డిపార్ట్ మెంట్స్ నుండి బెస్ట్ అవుట్ పుట్ లభించింది. సినిమా రిలీజ్ తర్వాత బింబిసార టీం అందరికీ మంచి పేరు తెస్తుంది.

500 ఏళ్ల క్రితం కథ 

‘బింబిసార’ ఐదొందల ఏళ్ల నాటి కథ. సో ప్రతీది మేము క్రియేట్ చేయాల్సిందే. అది మాకు పెద్ద ఛాలెంజ్. అలాగే ఎక్కువ భాగం సీజీ మీద ఆధారపడి తీయాల్సి ఉంటుంది. అందుకే ప్రతీ రోజు ఛాలెంజ్ గానే ఉండేది. కానీ షూట్ జరిగినన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా మేము టైం ట్రావెల్ చేసి అక్కడికి వెళ్లినట్టు అనిపించేది.

కర్మ సిద్ధాంతం 

సినిమాలో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది కర్మ సిద్ధాంతం గురించి. దాన్ని పర్ఫెక్ట్ గా చెప్పానని అనుకుంటున్నాను. అందుకే సినిమాలో ఈశ్వరుడే అంటూ సాంగ్ పెట్టడం జరిగింది. ఆ సాంగ్ లో మీనింగ్ అదే ఉంటుంది.  అందుకే మేము ఈవెల్ టు గుడ్ అనే లైన్ హైలైట్ చేస్తూ వస్తున్నాం.

కీరవాణి గారు బిజీ.. అందుకే 

ఈ సినిమాకు ముందుగా కీరవాణి గారినే అనుకున్నాం.  ఆ టైంలో RRR వర్క్ తో ఆయన బిజీ గా ఉన్నారనుకునుకోని ఆయన్ని అప్రోచ్ అవ్వకుండానే మేమే అనేసుకున్నాం. అప్పుడు చిరంతన్ భట్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయనకి కథ చెప్పగానే కర్మ సాంగ్ ఇచ్చారు. తర్కాత ఇంకో సాంగ్ కూడా ఇచ్చారు. మూడో సాంగ్ వరికుప్పల యాదగిరి గారితో కంపోజ్ చేయించాం. అలాగే సంతోష్ నారాయణ గారు కూడా టీజర్ కి మ్యూజిక్ ఇచ్చారు. తర్వాత కీరవాణి గారిని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం అప్రోచ్ అయ్యాం. ఆయన సినిమా చూసి చెప్తా అన్నారు. చూసిన వెంటనే ఓకె అంది నేను చేస్తాను అన్నారు.  అక్కడి నుండి సినిమాకు ఆయన ప్రాణం పోశారు.

రవితేజ గారికి రెండు కథలు

ఇంతకు ముందు రవితేజ గారికి రెండు కథలు చెప్పాను. ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. కానీ అప్పుడు ఆయనున్న బిజీకి ప్రాజెక్ట్ మెటిరియలైజ్ అవ్వలేదు. అల్లు శిరీష్ గారితో కూడా ఒక సినిమా అనుకున్నాను. కానీ అది పెద్ద బడ్జెట్ అవ్వడం వల్ల చేయలేకపోయాం. ఆ తర్వాత కళ్యాణ్ రాం గారికి కూడా రెండు మూడు కథలు చెప్పాను. అవేవి వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా ‘బింబిసార’ తో డైరెక్టర్ గా లాంచ్ అవ్వాలని డెస్టినీ డిసైడ్ చేసింది.

రెండు భాగాలు..అందుకే  

ఈ కథ అనుకున్నప్పుడే మూడు గంటలు చెప్పాలని డిసైడ్ అయ్యాము. కానీ అన్ని గంటలు ఒకే సినిమాగా చెప్పడం కుదరదు కాబట్టి. ముందు ఒక పార్ట్ తీసి అందులో ఎంత వరకూ చెప్పాలనేది ఫిక్స్ అయ్యాం. అందుకే స్టోరీ ని సెపెరేట్ చేయడం జరిగింది.

తెలుగులో …ప్రపంచ వ్యాప్తంగా 

ఈ సినిమా తెలుగు భాషలోనే రిలీజ్ చేయడానికి రీజన్ ముందు మన గ్రౌండ్ లోనే ఆడదామని అనుకున్నాం. ఆ తర్వాతే మిగతా భాషలు అనుకున్నాం. కేవలం డబ్బింగ్ చేస్తే సరిపోదు అన్ని చోట్లా తిరిగి ప్రమోషన్స్ కూడా చేసుకోవాలి. ముందు నుండి కూడా ఆ ప్లాన్ లేకపోవడం వల్ల కేవలం తెలుగుకే ఫిక్స్ అయ్యాం. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషలోనే సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ తర్వాత డబ్బింగ్ గురించి ఆలోచిస్తాం.

బింబిసార2… ఇంకో యాంగిల్ 

మొదటి భాగంలో బింబిసారుడు ఒకలా కనిపిస్తే రెండో పార్ట్ లో ఇంకో యాంగిల్ లో చూపించబోతున్నాం. మొదటి భాగానికి ఓ కంక్లూజన్ ఉంటుంది. ఈ ఏడాది లోనే బింబిసార  2 స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics