Koratala - ప్రజెంటర్ గా మారిన స్టార్ డైరక్టర్
Monday,July 05,2021 - 05:21 by Z_CLU
Koratala Siva first time as Presenter
చాలామంది దర్శకులు సమర్పకులుగా మారిన సందర్భాలు మనం చూశాం. ”మారుతి సమర్పించు..” అనే టైటిల్ చాలాసార్లు చూశాం. ఇప్పుడీ లిస్ట్ లోకి స్టార్ డైరక్టర్ కొరటాల శివ కూడా చేరిపోయాడు. వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో నటుడిగా, హీరోగా మెప్పిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సత్యదేవ్ 25వ చిత్రానికి రంగం సిద్ధమైంది. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను కమర్షియల్ పంథాలో తెరకెక్కిస్తూ దర్శకుడిగా తనదైన ఇమేజ్‌ను సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం.

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని కాల్చడానికి సిద్ధంగా ఉండటం, ఓ వైపు జీపు ఆగి ఉండటం అనే విషయాలను పోస్టర్‌లో గమనించవచ్చు. అలాగే సత్యదేవ్ లుక్ సరికొత్తగా ఉంది.
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్న సత్యదేవ్ తన 25వ చిత్రంలో ఎలాంటి పాత్రను పోషించబోతున్నాడనేది ఆసక్తిని రేపే అంశాల్లో ఒకటైతే.. ఇప్పటి వరకు ఏ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తొలిసారి ఈ సినిమాకు సమర్పకుడిగా ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

కాల భైరవ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics