Daggubati Abhiram - లాంచింగ్ కి రెడీ!

Friday,April 30,2021 - 08:04 by Z_CLU

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుండి వెంకటేష్ ఆ తర్వాత రానా హీరోలుగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కుటుంబం నుండి మరో హీరో రాబోతున్నాడు. అవును దగ్గుబాటి అభిరామ్ హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాతో అభిరామ్ హీరోగా లాంచ్ కానున్నాడని సమాచారం. నిజానికి దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ సినిమా గురించి ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాకు కూడా అభిరామ్ పేరు వినిపించింది. కట్ చేస్తే ఆ సినిమాను సుమంత్ ని పెట్టి తీశారు. ఆ తర్వాత కూడా అభిరామ్ తొలి సినిమా గురించి వివిధ దర్శకులతో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు దగ్గుబాటి యంగ్ హీరో మొదటి సినిమాకు ముహూర్తం ఖరారైంది అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని తెలుస్తుంది.

నిజానికి సురేష్ బాబు తన తనయుడ్ని ఓ మంచి స్క్రిప్ట్ తో లాంచ్ చేయాలని చూస్తున్నారు. రానాని ‘లీడర్’ అనే స్ట్రాంగ్ స్క్రిప్ట్ తో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి మంచి కథతో అభిరామ్ ని హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నారు. అందుకే దగ్గుబాటి హీరో మొదటి సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. మరి తేజ అభిరామ్ లాంచ్ సినిమా కోసం ఎలాంటి కథను సిద్దం చేశాడు ? ఫైనల్ గా సురేష్ బాబు ని ఎలా ఇంప్రెస్ చేశాడనేది హాట్ టాపిక్ గా మారింది. మరి దగ్గుబాటి కుర్ర హీరోకి సంబంధించి ఈ ప్రచారమైనా నిజమేనా ? అనే సందేహాలు కూడా ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఏదేమైనా ఈ సినిమా గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics