Chiranjeevi - పూరి దర్శకత్వంలో మెగాస్టార్?

Thursday,October 13,2022 - 01:37 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో చాలా ఏళ్లుగా ఓ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఒక టైంలో వీరిద్దరి కాంబో ‘ఆటోజానీ’ అనే టైటిల్ తో సినిమా వార్తల్లో నిలిచింది. కానీ పూరి చెప్పిన ఆ కథలో సెకండాఫ్ చిరంజీవికి నచ్చలేదని అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే టాక్ వినిపించింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఈ కాంబో సినిమా గురించి ఎలాంటి న్యూస్ లేదు. తాజాగా ఈ కాంబో మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది.

ప్రస్తుతం మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తో చిరు ఆన్లైన్ ఇంట్రాక్షన్ చేశారు. అందులో భాగంగా చిరు ఆటో జానీ సినిమా ఎప్పుడు చేస్తావ్ ? ఆ కథ ఉందా ? పక్కన పెట్టేశావా అంటూ అడిగే సరికి ఆ కథ ఓల్డ్ అయిపొయింది సార్. త్వరలోనే మరో కథతో వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూ చెప్పుకున్నాడు. తప్పకుండా నువ్వు కథ తీసుకురా కలిసి చేద్దాం మనం చేసే ఓ మంచి ప్రాజెక్ట్ కోసమే ఇప్పుడు ఇలా కలిశామేమో అంటూ రెస్పాన్స్ అయ్యారు చిరు.

దీంతో ఈ కాంబో సినిమాపై క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే పూరి చిరు కి ఏదైనా కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకుంటే వెంటనే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. కానీ ఆటో జానీ మాత్రం ఇకలేనట్టే. ఆ కథను పూరి పక్కన పెట్టేసినట్టే. చూడాలి మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో మరి.