MGR ఫస్ట్ లుక్.. అదరగొట్టిన అరవింద్ స్వామి

Friday,January 17,2020 - 11:44 by Z_CLU

సౌత్ లో తలైవి సెన్సేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి జయలలిత లుక్ ను విడుదల చేయగా, దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తలైవి మూవీ నుంచి ఎంజీఆర్ లుక్ కూడా వచ్చింది. ఎంజీఆర్ గా అరవింద్ స్వామి అదరగొట్టాడు.

ఈరోజు (జనవరి 17) ఎంజీఆర్ జయంతి. ఈ సందర్భంగా ‘తలైవి’ సినిమాలోని ఆయన లుక్ రిలీజ్ చేశారు. ఎంజీఆర్ గా అరవింద్ స్వామి మేకోవర్ చాలా బాగుంది. అచ్చు గుద్దినట్టు ఎంజీఆర్ లా మారిపోయాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ లో ఎంజీఆర్ మేనరిజమ్స్ ను కూడా యాజ్ ఇటీజ్ దించేశాడు అరవింద్ స్వామి.

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్ర‌ ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం `త‌లైవి`. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాలో అర‌వింద‌స్వామి దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంజీ రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు.

విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్న‌ర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు. జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో ప్రియమణి కనిపించనుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయబోతున్నారు.