'శమంతక మణి' రివ్యూ

Friday,July 14,2017 - 03:56 by Z_CLU

నటీ నటులు : నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది, డా. రాజేంద్ర ప్రసాద్, చాందినీ చౌదరి, జెన్నీ హనీ, అనన్య సోనీ

సంగీతం : మణిశర్మ

కెమెరా : సమీర్ రెడ్డి

నిర్మాణం : భవ్య క్రియేషన్స్

నిర్మాత : ఆనంద్ ప్రసాద్ వి

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య

 

నారా రోహిత్ , సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది సాయికుమార్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ ‘శమంతకమణి’ ఈరోజే విడుదలైంది. మరి మొదటి సినిమా ‘భలే మంచి రోజు’ తో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న శ్రీరామ్ ఆదిత్య నలుగురు హీరోలతో ఎలా ఎంటర్టైన్ చేసాడో..చూద్దాం..


కథ :

ఓ కారు మెకానిక్ గా ఉంటూ తన కాలనీలోనే కూరగాయలమ్ముతూ జీవితాన్ని కొనసాగిస్తున్న విడో భానుమతి(ఇంద్రజ)ని ప్రేమించే ఉమా మహేశ్వరరావు(రాజేంద్ర ప్రసాద్), తను ప్రేమించిన శ్రీదేవి(జెన్నీ) తనని కాదని మరో వ్యక్తి ని పెళ్లి చేసుకోవడంతో హైదరాబాద్ వచ్చిన శివ (సందీప్), తనను ఎప్పుడు తిడుతూ ఉండే తండ్రిని ఎదిరించలేక అదే ఇంట్లో నిరుద్యోగిగా తన తల్లి జ్ఞాపకాలతో జీవితాన్ని గడిపే కృష్ణ(సుధీర్), మధు(చాందిని) అనే అమ్మాయిని అమితంగా ప్రేమిస్తూ తనే జీవితంగా భవిస్తూ మిడిల్ క్లాస్ జీవితాన్ని గడిపే కార్తీక్ (ఆది).. ఇలా ఈ ఐదుగురు తమ అవసరం తీర్చే డబ్బు కోసం ఎదురుచూస్తున్న సమయంలో 5 కోట్లు విలువ చేసే శమంతకమణి అనే కారు దొంగతనం చేయబడుతుంది. కారు దొంగతనం జరిగిన సమయం ఆ ప్లేస్ లో ఉన్న ఉమా మహేశ్వరరావు, కృష్ణ, శివ, కార్తీక్ లను ఒక్కొక్కరిగా ఇంటరాగేషన్ చేస్తాడు ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్(నారా రోహిత్). అసలు కారు దొంగతనం చేసిందెవరు. ఆ సమయంలో వీరందరూ అక్కడికి ఎందుకు వెళ్లారు. చివరికి శమంతకమణి కారు దొరికిందా..లేదా.. అనేది సినిమా కథాంశం.

 

నటీనటుల పనితీరు :

ముఖ్యంగా మల్టీ స్టారర్ సినిమా అంటే ఎవరి పాత్ర ఎంత అనే కొలమానాలుంటాయి. అయితే ఈ సినిమాలో మాత్రం అందరికీ కథతో ట్రావెల్ చేసే సమానమైన పాత్రలు దొరికాయని చెప్పాలి. తమ పర్ఫెర్మెన్స్ కి సరిపడే రోల్స్ కావడంతో నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది తమ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేసి ఎంటర్టైన్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ మరో సారి తన కామెడీ టైమింగ్ తో మహేష్ అనే క్యారెక్టర్ లో ఎంటర్టైన్ చేశాడు. చాందిని, జెన్నీ లు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదని పించుకున్నారు. ఇక సుమన్,ఇంద్రజ, తనికెళ్ళ భరణి,హేమ, గిరి, సత్యం రాజేష్, రఘు,బెనర్జీ,గుండు సుదర్శనం, భద్రం,ఫణి, అభయ్, హేమంత్ తదితరులు తమ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు :

శమంతకమణి సినిమా రిలీజ్ కి ముందే బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎట్రాక్ట్ చేసిన మణిశర్మ సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ‘పద పద పద పడి పడి పదా’ అనే సాంగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. అక్కడక్కడా కొన్ని కామెడీ డైలాగ్స్ పేలాయి. ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ పరవాలేదనిపించాయి.


జీ సినిమాలు సమీక్ష:

నాలుగురు యంగ్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తున్నారంటే ఆ సినిమా పై ఓ మోస్తరు అంచనాలు నెలకొనడం సహజమే. అందులోకి భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడనగానే రిలీజ్ కి ముందే ఈ సినిమా పై పాజిటీవ్ బజ్ వినిపించింది.
ఇక సినిమా విషయానికొస్తే మొదటి సినిమాలో కొత్త క్యారెక్టర్స్ తో ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే ట్విస్టులతో ఎంటర్టైన్ చేసిన శ్రీరామ్ ఆదిత్య రెండో సినిమాకు కూడా క్యారెక్టర్స్ , ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్టుల పై డిపెండ్ అయ్యాడు.
ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ జస్ట్ పరవాలేదనిపించుకున్న శ్రీరామ్ ఆదిత్య సెకండ్ హాఫ్ లో మాత్రం తనదైన ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేశాడు. దర్శకుడిగా ‘శమంతకమణి’ అనే కారు చుట్టూ జరిగే  రొటీన్ స్టోరీ నే సెలెక్ట్ చేసుకున్న శ్రీరామ్ ఈ సినిమాతో కొన్ని పాత సినిమాలను గుర్తు చేశాడు. ఇక క్యారెక్టర్స్ కు తగిన హీరోలను ఎంచుకోవడంలో ఫరవాలేదనిపించుకున్నాడు.
ఓ మోస్తరు ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే ప్రేక్షకులకు శమంతకమణి సూట్ అవుతుంది.

 

రేటింగ్ : 2.75 /5