MOVIE Review - పఠాన్

Wednesday,January 25,2023 - 02:11 by Z_CLU

నటీ నటులు : షారూఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ , దీపికా పదుకొన్ , జాన్ అబ్రహం, అశుతోష్ రానా, డింపుల్ కపాడియా తదితరులు

కెమెరా : సంచిత్ పౌలోస్

సంగీతం : విశాల్ – చంద్రశేఖర్

నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా

స్క్రీన్ ప్లే : శ్రీధర్ రాఘవన్

నిర్మాత : ఆదిత్య చోప్రా

కథ, దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్

విడుదల తేదీ : 25 జనవరి, 2023

 

షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘పఠాన్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా వరుస అపజయలతో ఇబ్బంది పడుతున్న షారూఖ్ కి బ్లాక్ బస్టర్ హిట్ అందించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

 

కథ :

కశ్మీర్ కావాలని లేదంటే ఇండియాపై ఎటాక్ ప్లాన్ చేస్తానని ఇండియాకి వార్నింగ్ ఇచ్చే ప్రైవేట్ ఉగ్రవాద సంస్థ “ఔట్‌ఫిట్ ఎక్స్”కి నాయకత్వం వహించే మాజీ RAW ఏజెంట్ జిమ్‌ (అబ్రహం)ను అంతం చేసేందుకు RAW ఫీల్డ్ ఆపరేటివ్ ఏజెంట్ పఠాన్‌(షారూఖ్ ఖాన్)ను నియమిస్తారు.

ఇక జిమ్ ఇండియాపై బయో వార్ ప్లాన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడిని ఇండియన్ ఏజెంట్ పఠాన్ (షారుఖ్ ఖాన్) ఎలా అడ్డుకున్నాడు? ఇండియన్ ఏజెంట్లకు పఠాన్ కొన్నేళ్ళు ఎందుకు దూరమయ్యాడు ? పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబై (దీపికా పదుకోన్) ‘పఠాన్’కు ఎలాంటి సాయం చేసింది అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

పఠాన్ గా షారూఖ్ ఖాన్ మెప్పించాడు. లుక్ , స్టంట్స్ తో మెస్మరైజ్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు షారూఖ్. ఇక గెస్ట్ కేరెక్టర్ లో సల్మాన్ ఖాన్ మేజిక్ చేశాడు. సల్మన్ ఖాన్ కనిపించింది కాసేపే అయినప్పటికీ సినిమాలో టైగర్ కేరెక్టర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. దీపికా గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. షారూఖ్ తర్వాత ఆమెకి కథలో కీలకమైన పాత్ర లభించడంతో యాక్షన్ బ్లాక్స్ తో ఆకట్టుకుంది. హీరోకి సవాల్ విసిరే స్టైలిష్ విలన్ గా జాన్ అబ్రహం అదరగొట్టేశాడు. పవర్ ఫుల్ విలనిజంతో సినిమాకు ప్లస్ అయ్యాడు జాన్. అశుతోష్ రానా, డింపుల్ కపాడియా తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు : 

ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవల్సింది యాక్షన్ కొరియోగ్రఫీ గురించే. హాలీవుడ్ స్టైల్ స్టంట్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. Craig MacRae కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు మేజర్ హైలైట్. సంచిత్ పౌలోస్ విజువల్స్ సినిమాను ఆకట్టుకునేలా చేశాయి. కొన్ని సన్నివేశాలు  అలాగే సాంగ్స్ పిక్చరైజేషన్ లో సంచిత ప్రతిభ కనిపిస్తుంది.

విశాల్ – చంద్రశేఖర్ కంపోజ్ చేసిన సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కొరియోగ్రఫీ కూడా బాగుంది.  సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా పరవాలేదనిపిస్తుంది కానీ హై ఇచ్చే స్కోర్ అందించలేకపోయారు. సిద్దార్థ ఆనంద్ కథ , శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తాయి.

సిద్దార్థ ఆనంద్ టేకింగ్ , డైరెక్షన్ బాగుంది. ఈ సినిమా కోసం నిర్మాత ఆదిత్య చోప్రా పెట్టిన భారీ ఖర్చు స్క్రీన్ పై కనిపించి సినిమా క్వాలిటీ ను పెంచేలా చేసింది.

 

జీ సినిమాలు సమీక్ష : 

సిద్దార్థ ఆనంద్ డైరెక్షన్ లో షారూఖ్ ఖాన్ ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడని తెలియగానే పఠాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ , సాంగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక సిద్దార్థ ఆనంద్ ‘పఠాన్’ కోసం రొటీన్ కథే తీసుకున్నాడు. దానికి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గానే ఉంది. ట్విస్టులు కూడా వావ్ అనిపించేలా లేవు. అలా అని పఠాన్ ను తక్కువ చేయలేం అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ , షారూఖ్ ఖాన్ పెర్ఫార్మెన్స్ , దీపికా అందాల ఆరబోత ఇలా కమర్షియల్ సినిమా నుండి కోరుకునే అంశాలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ప్రారంభమైన కాసేపటికి షారూఖ్ ఖాన్ ఎంట్రీ , వెంటనే వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తుంది. అక్కడి నుండి యాక్షన్ ఎపిసోడ్స్ మధ్యలో వచ్చే సాంగ్ ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి తన మాటలతో అలరించాడు. పఠాన్ ను కాపాడడానికి వచ్చే టైగర్ గా సల్మాన్ ఖాన్ ఎంట్రీ , కేరెక్టర్ , డైలాగ్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. అలాగే షారూఖ్ , సల్మాన్ కలిసి చేసే ఫైట్ , క్లైమాక్స్ అయ్యాక ఇద్దరు మాట్లాడుకునే సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

సిద్దార్థ ఆనంద్ సినిమాల్లో ఇప్పటికే చూసేసిన కథ , కేరెక్టర్స్ , సాంగ్స్ అన్నీ పఠాన్ లోనూ రిపీట్ అయ్యాయి. దీంతో బ్యాంగ్ బ్యాంగ్ , వార్ సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా ఇప్పటికే చాలా యాక్షన్ థ్రిల్లర్స్ లో చూసేసిన రా ఏజెంట్స్ వర్క్ , సీక్రెట్ మిషన్ , టెర్రరిస్ట్ ఎటాక్స్ ఇవే ముడిసరుకుగా తీసుకొని ఈ కథ రాసుకున్నాడు సిద్దార్థ్ .  ఇక పఠాన్ లో కొత్త కథ ఊహించే వారిని మాత్రం సినిమా కాస్త నిరాశ పరుస్తుంది. ఇక హీరోయిన్ తాలూకు ట్విస్టులు కూడా రెగ్యులర్ గానే అనిపిస్తాయి తప్ప వావ్ అనిపించలేదు. కానీ ఇవేం పట్టించుకోకుండా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అలాగే వైరస్ క్రియేషన్ , తర్వాత వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా దేశం కోసం రా ఏజెంట్స్ ప్రాణాలు విడిచే సన్నివేశం మనసుకి హత్తుకుంటుంది. షారూఖ్ ఖాన్ కి దీటుగా జాన్ అబ్రహం ను పెట్టడం సిద్దార్థ నుమెచ్చుకోవాల్సిన విషయం. జాన్ అబ్రహం పెర్ఫార్మెన్స్ , లుక్ సినిమాకి కలిసొచ్చాయి.

షారూఖ్ ఖాన్ పెర్ఫార్మెన్స్ , అదిరిపోయే స్టంట్స్ , ఎట్రాక్ట్ చేసే విజువల్స్, కొన్ని డైలాగ్స్, దీపికా గ్లామర్ , సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ సినిమాకు హైలైట్స్ కాగా రొటీన్ కథ -కథనం, పేలవంగా అనిపించే ఫ్లాష్ బ్యాక్ , ఎమోషన్ పండకపోవడం, సెకండాఫ్ లో కాస్త స్లో గా సాగే సన్నివేశాలు మైనస్ .

 

బాటమ్ లైన్ :  యాక్షన్ తో మెప్పించే ‘పఠాన్’

రేటింగ్ : 2 .75 /5