Movie Review - హంట్

Thursday,January 26,2023 - 05:58 by Z_CLU

నటీనటులు – సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్, మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, గోపరాజు రమణ, చిత్రా శుక్ల తదితరులు..
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్‌
సంగీతం : జిబ్రాన్
నిర్మాత : వి. ఆనంద ప్రసాద్
బ్యానర్ : భవ్య క్రియేషన్స్
దర్శకత్వం : మహేష్
సెన్సార్: యు/ఏ
రన్ టైమ్: 2 గంటల 12 నిమిషాలు
రిలీజ్: జనవరి 26, 2023

కెరీర్ లో చాలా పెద్ద ప్రయోగం చేశానని ప్రకటించుకున్నాడు సుధీర్ బాబు. అదే హంట్ మూవీ. ఇంతకీ సుధీర్ బాబు చేసిన ఆ ప్రయోగం ఏంటి? హంట్ సినిమా ఎలా ఉంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ..

Sudheer-Babu-Hunt-Movie-Telugu-Review 3 (1)

కథ
ఏసీపీ అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు)కు మరో పోలీసాఫీసర్ ఆర్యన్ దేవ్ (భరత్) మంచి స్నేహితుడు. ఓ సందర్భంలో గ్యాలంట్రీ అవార్డును స్వీకరిస్తున్నప్పుడు భరత్ ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి షూట్ చేసి చంపేస్తాడు. ఈ కేసును అర్జున్ ప్రసాద్ హ్యాండిల్ చేస్తాడు. దాదాపు కేసును చేధిస్తాడు. తన బాస్ మోహన్ (శ్రీకాంత్)తో ఫోన్‌లో ఆ విషయం చెప్పాలనుకుంటాడు. అదే క్షణంలో యాక్సిడెంట్ కు గురవుతాడు. సెలక్టివ్ మెమొరీ లాస్‌తో బయటపడతాడు.

అర్జున్ ప్రసాద్ పూర్తిగా కోలుకున్నప్పటికీ, అతని జ్ఞాపకశక్తి తిరిగి రాదు. అయినప్పటికీ హంతకుడ్ని వెదకడం కోసం మళ్లీ ప్రయత్నిస్తాడు. మరి తన షార్ట్ మెమొరీతో అర్జున్ ప్రసాద్ హంతకుడ్ని పట్టుకున్నాడా? హంతకుడిని రెండోసారి వెతికి పట్టుకునే క్రమంలో అర్జున్ ప్రసాద్ కు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు
సుధీర్ బాబు ఈ కథను ఎంచుకోవడం అతడి టేస్ట్ కు నిదర్శనం. కొత్త కథలు ప్రయత్నించాలనే అతడి డెడికేషన్ ను మెచ్చుకొని తీరాల్సిందే. ఈ కథ కోసం అతడు మేకోవర్ అయిన విధానం, యాక్టింగ్ కోసం చేసిన హోమ్ వర్క్ మెప్పిస్తుంది. ఈ సినిమాకు భరత్, శ్రీకాంత్ ను సెకెండ్ హీరో, థర్డ్ హీరో అనాలి. అంతటి ఇంపార్టెంట్ పాత్రలు పోషించారు వీళ్లు. మైమ్ గోపి, కబీర్ దుహాన్ సింగ్, రవివర్మ, చిత్ర శుక్ల తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు
ఈ సినిమాకు మెయిన్ టెక్నీషియన్ దర్శకుడు మహేష్. చేసింది రీమేక్ ప్రాజెక్టు అయినప్పటికీ టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకోలేదు. కథకు తగ్గ నటీనటుల్ని తీసుకున్నాడు, హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకున్నాడు. దర్శకత్వంలో కూడా తనదైన మార్క్ చూపించాడు. ఇక జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అరుణ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. సినిమా రన్ టైమ్ తక్కువగానే ఉన్నప్పటికీ, ఇంకాస్త తగ్గిస్తే బాగుంటుంది. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

Sudheer-Babu-Hunt-Movie-Telugu-Review (1)

జీ సినిమాలు సమీక్ష
రీమేక్ ప్రాజెక్టును హ్యాండిల్ చేయడం ఈజీ అని కొందరంటారు. కష్టమని మరికొందరంటారు. మార్పులు చేయకుండా తీయడం బెటరని కొందరంటారు, ఆడియన్స్ పల్స్ కు తగ్గట్టు మార్పుచేర్పులు చేయడం బెటరని మరికొందరంటారు. సరిగ్గా ఇక్కడే రీమేక్ విషయంలో జడ్జ్ చేయడం చాలా కష్టం. ఈరోజు రిలీజైన హంట్ విషయంలో ఈ జడ్జిమెంట్ లోపించింది.

దాదాపు పదేళ్ల కిందటొచ్చిన ఓ మలయాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది హంట్ సినిమా. అయితే అప్పటి సినిమాను, ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పుచేర్పులు చేయకపోవడమే హంట్ కు మైనస్ గా మారింది. పదేళ్ల కిందటి కథ, పైగా కరోనా తర్వాత ఆడియన్స్ అభిరుచుల్లో చాలా తేడా వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్పులు చేసినట్టయితే, హంట్ సినిమా ఓ మంచి థ్రిల్లర్ అయ్యేది. యథాతథంగా తీయడం వల్ల కొంచెం గురితప్పింది.

పృధ్వీరాజ్ హీరోగా నటించిన మలయాళం సినిమాకు రీమేక్ ఇది. ఈ కథ పదేళ్ల కిందట ఓకే, ఆ నెరేషన్ అప్పుడు నడిచింది. కానీ ఇప్పుడు ఆ నెరేషన్ పనిచేయలేదు. గ్రిప్పింగ్ థ్రిల్లర్లు చూసిన టాలీవుడ్ ఆడియన్స్, హంట్ లో స్క్రీన్ ప్లేకు కనెక్ట్ అవ్వడం కష్టమే.

స్పాయిలర్స్ చెప్పకూడదు కాబట్టి క్లయిమాక్స్ గురించి అక్కడ ప్రస్తావించడం లేదు. కథ మొత్తం ఆ క్లయిమాక్స్ లోనే ఉంది. ఆ పాయింట్ దగ్గరకు ప్రేక్షకుడ్ని తీసుకురావడానికి ఎంతో ఉత్కంఠ కలిగించే స్క్రీన్ ప్లే ఉండాలి. పైగా హీరోయిన్ లేని కథ కూడా కావడంతో, నెరేషన్ మరింత గ్రిప్పింగ్ గా ఉండాలి. ఈ కోణంలో వర్క్ చేసినట్టయితే సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉండేది. కానీ నెరేషన్ ను మార్చకుండా, యాక్షన్ సన్నివేశాలపై మాత్రమే ఎక్కువ దృష్టిపెట్టారు.

అలా అని ఈ సినిమాను తీసిపారేయడానికి లేదు. యూనిట్ కష్టం మొత్తం కనిపించింది. మరీ ముఖ్యంగా సుధీర్ బాబు, హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు. అతడి ఫిజిక్, మేనరిజమ్స్, రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ కోసం అతడు చేసిన హోమ్ వర్క్ సినిమాలో కనిపించింది. హాలీవుడ్ రేంజ్ లో పిక్చరైజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అప్సర రాణి ఐటెంసాంగ్ మెరిసింది.

మరీ ముఖ్యంగా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ, ఈ సినిమా విషయంలో తను చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకున్నానంటూ సుధీర్ బాబు పదేపదే ఎందుకు చెప్పాడో, ఈ సినిమా క్లయిమాక్స్ చూస్తే అర్థమౌతుంది. సుధీర్ బాబు నిజంగానే చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకున్నాడు. టాలీవుడ్ లో మరే హీరో ఈ పాత్ర చేయడానికి అంగీకరించడు. ఇది మాత్రం వాస్తవం. శ్రీకాంత్, భరత్, మైమ్ గోపి, చిత్రశుక్ల, గోపరాజు రమణ లాంటి నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. భరత్ పాత్ర ఈ సినిమాకు చాలా కీలకం. అతడు డీసెంట్ గా చేశాడు.

ఇక భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు హై-రేంజ్ లో ఉన్నాయి. ఈ కథను వాళ్లు ఎంత నమ్మారో ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే అర్థమౌతుంది. దర్శకుడిగా మహేష్ కు పూర్తిస్థాయిలో మార్కులు పడకపోవచ్చు కానీ, ఉన్నదున్నట్టు రీమేక్ చేయడంలో ఇతడు బెస్ట్ అనిపించుకున్నాడు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

ఓవరాల్ గా హంట్ సినిమాను ఓ డిఫరెంట్ స్టోరీ కోసం, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరికొన్ని ఫైట్ సీక్వెన్సుల కోసం ఓసారి చూడొచ్చు. ఇలాంటి స్టోరీని సెలక్ట్ చేసుకున్న సుధీర్ బాబుకు ప్రత్యేకంగా అభినందనలు

రేటింగ్ – 2.5/5