Movie Review - విమానం

Friday,June 09,2023 - 03:01 by Z_CLU

న‌టీన‌టులు: స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్

సినిమాటోగ్ర‌ఫీ :  వివేక్ కాలేపు

ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేష్‌

సంగీతం :  చ‌ర‌ణ్ అర్జున్‌

నిర్మాతలు :  జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌)

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం :  శివ ప్ర‌సాద్ యానాల‌

విడుదల తేది  : 9 జూన్ 2023

సముద్రఖని ,  అనసూయ , ధన్ రాజ్ , రాహుల్ రామకృష్ణ, మాస్టర్ దృవన్ , నటించిన ‘విమానం‘ టీజర్ , ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసి నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిన్న సినిమా కంటెంట్ తో మెప్పించిందా ?  జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

బేగంపేట్ దగ్గర ఓ మురికివాడ. అక్కడ నివసించే వీరయ్య (సముద్ర ఖని) సులభ్ కాంప్లెక్స్ చూసుకుంటూ ఉపాధి సాగిస్తుంటాడు. అదే వాడలో ఉండే ఆటో డ్రైవర్ డానీ (ధన్ రాజ్), చెప్పులు కుట్టే కోటి (రాహుల్ రామకృష్ణ) , వ్యభిచారం చేసుకునే సుమతీ(అనసూయ) ఉంటారు.  ఒక్కగానొక్క కొడుకు రాజు(మాస్టర్  ధ్రువన్) కోసమే జీవించే వీరయ్య, తండ్రిగా రాజుకి ఉజ్వల భవిష్యత్తు అందించాలని ఆరాటపడుతుంటాడు.  వికలాంగుడైన వీరయ్య తన తహతకి మించి కొడుకును మంచి స్కూల్ లో చదివిస్తాడు. వీరయ్య కొడుకుకి మాత్రం ఎప్పటికైనా విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. నిద్రలో కూడా విమానం గురించే ఆలోచిస్తూ వీరయ్యను విమానం ఎక్కించమని అడుగుతూనే ఉంటాడు.

కొడుకు చదువు , తెలివి తేటలు చూస్తూ మురిసిపోయే వీరయ్యకి రాజు విమానం గురించి చెప్తున్నప్పుడల్లా విసుగొస్తుంటుంది. రాజుకి  క్యాన్సర్ వ్యాధి ఉందని ఎక్కువ రోజులు బ్రతకడని తెలుసుకొని కుమిలిపోతాడు వీరయ్య. చివరికి రాజుని  చనిపోయే లోపు ఎలాగైనా విమానం ఎక్కించాలని డబ్బు కోసం అష్టకష్టాలు పడుతుంటాడు. మరి ఫైనల్ గా తనపంచ ప్రాణాలుగా భావించే కొడుకును వీరయ్య విమానం ఎక్కించగలిగాడా ?  చివరికి వీరి జీవితం ఏమైంది ? అనేది విమానం కథ.

నటీ నటుల పనితీరు : 

సముద్రఖని నటన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.  యాక్టర్ గా టర్న్ అయినప్పటి నుండి తన విలక్షణ నటనతో మెప్పిస్తూ వస్తున్న సముద్రఖనికి ఛాలెంజ్ విసిరే పాత్ర దక్కడంతో వికలాంగుడి పాత్రలో వీరయ్యగా మెప్పించాడు. తన నటనతో సినిమాకు హైలైట్ అనిపించుకున్నాడు. కానీ కొన్ని హై ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ సన్నివేశాల్లో ప్రేక్షకులు ఆశించే యాక్షన్ సముద్రఖనిలో కనిపించలేదు. మాస్టర్ దృవన్ రాజు పాత్రలో ఒదిగిపోయాడు. విమానం గురించే మాట్లాడే సన్నివేశాల్లో మంచి మార్కులు అందుకున్నాడు. వేశ్య పాత్రలో అనసూయ ఆకట్టుకుంది. కాకపోతే మరీ బొద్దుగా కనిపించింది. ఆటో డ్రైవర్ డానీ పాత్రలో ధన్ రాజ్ మంచి నటన కనబరిచి పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. చెప్పులు కుట్టే కోటి పాత్రతో రాహుల్ రామకృష్ణ అలరించాడు. రాజేంద్రన్ , రాహుల్ రామకృష్ణ ట్రాక్ నవ్వించింది.  మీరా జాస్మిన్ క్లైమాక్స్ కి ముందు వచ్చే గెస్ట్ పాత్రతో మంచి ఎమోషన్ పండించింది.

సాంకేతిక వర్గం పనితీరు : 

విమానం కి టెక్నికల్ గా మంచి సపోర్ట్ దక్కింది. కెమెరా వర్క్ , మ్యూజిక్,  ఎడిటింగ్ , ఆర్ట్ వర్క్ ఇలా అన్నీ విభాగాల్లో బెస్ట్ అవుట్ పుట్ అందింది. దీంతో టెక్నీషియన్స్ అందరూ సినిమాకు ప్లస్ అయ్యారు. వివేక్ కెమెరా వర్క్ బాగుంది. కథకు తగ్గట్టే సన్నివేశాలను నేచురల్ గా చూపించాడు. చరణ్ అర్జున్ ఎమోషనల్ సన్నివేశాలకు బలం చేకూర్చే నేపథ్య సంగీతం అందించాడు. కథకి తగ్గట్టే ఎక్కువ ల్యాగ్ లేకుండా  మార్తాండ్ కె వెంకటేష్ క్రిస్ప్ గా ఎడిట్ చేశారు. జె.జె.మూర్తి ఆర్ట్ వర్క్ బాగుంది. కొన్ని సీన్స్ చూస్తే సెట్ అనిపించకుండా ఉంది.  అక్కడక్కడా హ‌ను రావూరి మాటలు ఆకట్టుకున్నాయి. శివ ప్రసాద్ కథ , కథనం బాగున్నాయి. డైరెక్షన్ పరవాలేదు. ప్రొడక్షన్ వెల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

తరచూ విదేశాలు వెళ్ళే వారికి , తక్కువ టైమ్ లో ట్రావెల్ చేయాలనుకునే వారికి విమానం ఒక వాహనం మాత్రమే. కానీ పేద కుటుంబంలో పుట్టిన ఎంతో మంది పిల్లలకి విమానం అనేది ఒక ఎమోషన్. ఎప్పటికైనా విమానం ఎక్కాలనేది వారిలో చాలా మంది డ్రీమ్. దీన్నే కథా వస్తువుగా తీసుకొని దర్శకుడు శివ ప్ర‌సాద్ యానాల‌ ‘విమానం’ సినిమా తీశాడు. విమానం ఎక్కాలనుకునే కోరికతో నిత్యం దాని పేరే జపించే నిరుపేద పిల్లాడి పాత్రకు సపోర్ట్ గా తనే పంచ ప్రాణాలుగా జీవించే వికలాంగుడైన తండ్రి పాత్రను రాసుకోవడం మెచ్చుకోవాలి.  విమానం కోసం శివ ప్రసాద్ రాసుకున్న పాయింట్ బాగుంది. ఈ కథకి న్యాయం చేసే నటీ నటులను ఎంచుకోవడం మరో ప్లస్ పాయింట్.

కాకపోతే ఇలాంటి చిన్న కథతో రెండున్నర గంటల సినిమాగా తీయడం అంటే ఆషా మాషీ కాదు. బలమైన ఎమోషన్స్ ఉండాలి. క్లాప్స్ కొట్టించే సీన్స్ పడాలి. ఈ రెండు విషయాల్లో దర్శకుడు శివ ప్రసాద్ కొంత వరకూ సక్సెస్ అయ్యాడు కానీ మెజారిటీ మార్కులు స్కోర్ చేయలేకపోయాడనే చెప్పాలి. అనుభవం లేకపోవడం వల్ల కొన్ని సన్నివేశాలను ఆశించి స్థాయిలో తెరకెక్కించలేకపోయాడనిపిస్తుంది. అలా అని దర్శకుడిలో విషయం లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఎంచుకున్న కథ , కేరెక్టర్ డిజైనింగ్ , కొన్ని సన్నివేశాలను డీల్ చేసిన విధానం , మెప్పించే క్లైమాక్స్ చూస్తే అతనిలో ఉన్న  ప్రతిభ కనిపిస్తుంది. తండ్రి కొడుకుల బంధాన్ని గొప్పగా చూపించాడు. కొడుకు పట్ల తండ్రి చూపించే అతి ప్రేమతో వచ్చే సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి.

ఇక ఇలాంటి కథల్లో హై ఎమోషన్ ఉండాలి. ప్రేక్షకుడి కళ్ళలో నీళ్ళు తెప్పించే సన్నివేశాలు ఎక్కువ పడాలి. కానీ విమానంలో కొన్ని సీన్స్ లో ప్రేక్షకులు ఆశించే స్థాయిలో ఎమోషన్ పండకపోవడం సినిమాకు కొంత మైనస్. అలా అని ఎమోషనే  లేదని చెప్పలేం. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యే కంటెంట్ ఉంది. సెకండాఫ్ లో కన్నీరు తెప్పించే సీన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా  క్లైమాక్స్ లో గుండెలు బరువెక్కుతాయి. ఈ తరహా సినిమాళ్లో ఆశించే స్థాయి ఎమోషన్ ఊహించిన స్థాయిలో లేకపోయినా ‘విమానం’ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో కథ ముగిసిన విధానం మెప్పిస్తుంది. ఓవరాల్ గా హానెస్టీ ఎటెంప్ట్ అనిపిస్తుంది.

 

రేటింగ్ : 2.75 /