Movie Review - కస్టడీ

Friday,May 12,2023 - 03:02 by Z_CLU

నటీ నటులు : నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరేన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్  తదితరులు.

సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్

డైలాగ్స్: అబ్బూరి రవి

సమర్పణ: పవన్ కుమార్

నిర్మాణం : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు

విడుదల  తేదీ : 12 మే 2023

నిడివి : 147 నిమిషాలు

 

అక్కినేని నాగచైతన్య , దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెలుగు , తమిళ్ బై లింగ్వెల్ మూవీగా తెరకెక్కిన ‘కస్టడీ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చైతు కానిస్టేబుల్ పాత్రలో నటించిన ఈ  కాప్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా ? ఈ సినిమాతో అక్కినేని హీరో రెండు భాషల్లో హిట్ కొట్టాడా ?  జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

 

కథ : 

సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే శివ (నాగ చైతన్య) తను ప్రేమించిన అమ్మాయి రేవతి (కృతి శెట్టి)ను పెళ్లి చేసుకునేందుకు సిద్దపడతాడు. రేవతి ఇంట్లో ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కాలనుకునే శివ జీవితంలో ఓ ఊహించని సంఘటన అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అండతో ఎలాంటి దారుణానికైనా ఒడిగట్టే  రాజు (అరవింద్ స్వామి) అతన్ను పట్టుకున్న సీబీఐ ఆఫీసర్ జార్జ్(సంపత్ రాజ్) ఇద్దర్నీ శివ కస్టడీలోకి తీసుకుంటాడు. మరో వైపు రాజును సీబీఐ నుండి విడిపించి అతన్ని చంపేందుకు ఐజీ  నటరాజ్ (శరత్ కుమార్) ప్రయత్నిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పోలీస్ ఆఫీసర్స్ కి చిక్కకుండా రాజును ఎలాగైనా బోర్డర్ దాటించి కోర్టులో హాజరు పరచాలనే జార్జ్ కోరిక మేరకు శివ ఎలాంటి ప్రయత్నం చేశాడు ? చివరికి రాజును శివ కోర్టులో హాజరు పరిచాడా ? లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

శివ పాత్రలో నాగ చైతన్య నటన బాగుంది. కానిస్టేబుల్ గా కొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో తన నటనతో హైలైట్ అనిపించుకున్నాడు చైతు. కృతి శెట్టి కి కథలో స్కోప్ ఉన్న పాత్రే దక్కింది. కేవలం పాటలు , లవ్ ట్రాక్ కోసమే కాకుండా హీరోతో త్రూ అవుట్ ట్రావెల్ చేసే పాత్రలో ఆకట్టుకుంది. అరవింద్ స్వామీ కేరెక్టర్ , నటన సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే స్పెషల్ రోల్ లో జీవ నటన బాగుంది.  పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్ ,  సీబీఐ  ఆఫీసర్ గా  సంపత్ రాజ్,సీబీఐ  హెడ్ గా జయ ప్రకాష్ , మాజీ ఆర్మీ ఆఫీసర్ గా రాంకీ ,  జడ్జ్ పాత్రలో జయసుధ ,  హీరో తండ్రి పాత్రలో గోపరాజు , హీరో మావయ్య గా కాదంబరి కిరణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ పేలలేదు. మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమాకు మైనస్ అనిపించింది. పాటలు ఆకట్టుకోలేదు. అక్కడక్కడా వచ్చే నేపథ్య సంగీతం బాగుంది కానీ ఆ స్కోర్ ఎక్కువ సార్లు రిపీట్ చేశారు.  ఎస్ఆర్ కతీర్ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బాగుంది. వెంకట్ రాజన్ ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది.  స్టన్ శివ, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. డివై సత్యనారాయణ ఆర్ట్ వర్క్ బాగుంది.

అబ్బూరి రవి అందించిన మాటలు అక్కడక్కడా ఆకట్టుకున్నాయి. వెంకట్ ప్రభు స్టోరీ -స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్. ప్రొడక్షన్ వెల్యూస్ బాగున్నాయి.

 

 

జీ సినిమాలు సమీక్ష :

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాళ్లో కథలు ఎలాగున్నా అతని స్క్రీన్ ప్లేలో మేజిక్ ఉంటుంది. ఆ మేజిక్ తోనే కోలీవుడ్ లో సూపర్ హిట్లు అందుకున్నారు.  తొలిసారి నాగ చైతన్య తో  తెలుగు , తమిళ్ లో వెంకట్ ప్రభు ఓ కాప్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడనగానే ‘కస్టడీ’ పై అంచనాలు నెలకొన్నాయి.  చైతన్యను కానిస్టేబుల్ పాత్రలో సరికొత్తగా చూపించాలనే వెంకట్ ప్రభు ప్రయత్నం బాగుంది. కానీ దానికి బలమైన కథ , అదిరిపోయే స్క్రీన్ ప్లే కుదరలేదు. దీంతో కస్టడీ మోస్తరుగా ఆకట్టుకుంది కానీ పూర్తిగా మెప్పించలేకపోయింది.  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమె చెప్పిందల్లా చేసే గుండా , అతన్ని పట్టుకునేందుకు చూసే సీబీఐ , మధ్యలో హీరో , తన డ్యూటీ , కుటుంబాన్ని వదిలేసి సీబీఐ కి సహాయం చేసేందుకు ఆ గుండాను పట్టుకొని కోర్టు వరకూ వెళ్ళడం. ఇందులో హీరోకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. ఇదే కస్టడీ స్టోరీ. కథ ఎలాగున్నా వెంకట్ ప్రభు లాంటి దర్శకుడు డీల్ చేసినప్పుడు గ్రిప్పింగ్ గా ఆసక్తి నెలకోల్పే  స్క్రీన్ ప్లే ఆశిస్తారు ప్రేక్షకులు. అయితే కస్టడీ విషయంలో ఆ లెక్కలు పక్కన పెట్టి ఓ సాదా సీదా సినిమా అందించాడు వెంకట్ ప్రభు. ప్రేక్షకులు ముందే ఊహించే సన్నివేశాలతో , డ్రాగ్ చేస్తూ ఎలాంటి ట్విస్టులు లేకుండా సినిమాను ముందుకు నడిపించి ఆకట్టుకోలేకపోయాడు.

నిజానికి పాయింట్ పరవాలేదనిపించినా ట్రీట్ మెంట్ విషయంలో వెంకట్ ప్రభు మార్కులు స్కోర్ చేయలేకపోయాడు. పోలీస్ హీరో , తను చేసిందే రైట్ అని నమ్మే పవర్ ఫుల్ విలన్ , మధ్యలో సీబీఐ , ఇద్దరికీ మధ్య ఓ రీవెంజ్…  ఇలా కమర్షియల్ సినిమాకు కావలసిన కంటెంట్ ప్లాన్ చేసుకున్నా దాన్ని ఎలాంటి హై మూమెంట్ లేకుండా ప్లాట్ నేరేషన్ తో చెప్పిన విధానం తేడా కొట్టింది. సినిమా మొదలైన ఇరవై నిమిషాలు , కేరెక్టర్స్ ఇంట్రడక్షన్ , లవ్ ట్రాక్ తో మామూలుగా నడిపించాడు వెంకట్ ప్రభు. అరవింద్ స్వామీ కేరెక్టర్ ఎంటరయ్యాక సినిమా గ్రాఫ్ పెరుగుతుంది. శివ తన ప్రాణాలను పణంగా పెట్టి సీబీఐ కోసం రాజుని విడిపించి స్టేషన్ నుండి బయట పడేసే వరకు కాస్త ఆసక్తిగా నడిపించిన దర్శకుడు ఆ తర్వాత ప్రేక్షకుడు ఆశించే అదిరిపోయే ట్విస్టులు లాంటివి ఏం ప్లాన్ చేసుకుండా డ్రాగ్ చేస్తూ నడిపించాడు. ప్రీ క్లైమాక్స్ . క్లైమాక్స్ మరీ పేలవంగా ఉన్నాయి.

అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు , యాక్షన్ ఎపిసోడ్స్ , ఇంటర్వల్ , నాగచైతన్య -అరవింద స్వామీ నటన సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా , డ్రాగ్ అనిపించే సీన్స్ , ఆకట్టుకోని లవ్ ట్రాక్ , స్క్రీన్ ప్లే , ట్విస్టులు లేకపోవడం, రొటీన్  ఫ్లాష్ బ్యాక్, పేలవంగా అనిపించే కామెడీ,  క్లైమాక్స్ సినిమాకు మైనస్. ఓవరాల్ గా కస్టడీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

రేటింగ్ : 2 .25 /