'తేజ్ ఐ లవ్ యు' మూవీ రివ్యూ

Friday,July 06,2018 - 02:45 by Z_CLU

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాశ్ తదితరులు

సంగీతం : గోపీసుందర్

మాటలు : డార్లింగ్ స్వామి

నిర్మాణం : క్రియేటివ్ కమర్షియల్స్

నిర్మాత : కే.ఎస్.రామారావు

కథ -స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ఎ.కరుణాకరన్

సెన్సార్ : U

నిడివి : 144 నిమిషాలు

విడుదల తేది : 6 జులై 2018

కెరీర్ స్టార్టింగ్ లో సూపర్ హిట్స్ అందుకొని మెగా ఫ్లో ను కంటిన్యూ చేసిన సాయి ధరం తేజ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. అయితే తేజూ ఈ సారి రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన కరుణాకరన్ తో కలిసి లక్ టెస్ట్ చేసుకున్నాడు. మరి సాయి ధరం తేజ్ -కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తేజ్’ మెగా హీరోకు హిట్ అందించిందా… కరుణాకరన్ మరోసారి లవ్ స్టోరీ తో మెప్పించాడా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ .

కథ :
చిన్నతనంలోనే అనుకోకుండా చేసిన తప్పుకు జైలుకు వెళ్తాడు తేజు(సాయి ధరమ్ తేజ్). బయటికి వచ్చాక కుటుంబంతో సరదాగా గడుపుతూ ఉంటాడు. ఇష్టపడిన అబ్బాయితో చెల్లికి ప్రేమ వివాహం చేసినందుకు గానూ ఇంటి నుంచి వెళ్ళిపోమని తండ్రి చెప్పడంతో ఇంటి నుండి బయటికి వచ్చేస్తాడు. అలా బయటికొచ్చేసిన తేజ్ కి ఓ రైలు ప్రయాణంలో ఫారిన్ నుంచి వచ్చిన నందిని(అనుపమ పరమేశ్వరన్) పరిచయమవుతుంది. తొలిచూపులోనే తనను ప్రేమిస్తాడు. మొదట టీజ్ చేసినా తర్వాత నందు కూడా తేజ్ ప్రేమలో పడిపోతుంది.

అమ్మ చివరి కోరిక తీర్చడం కోసం ఇండియాకి వచ్చిన నందిని ఒక సంఘటన వల్ల తన గతాన్ని మర్చిపోతుంది. అప్పటి నుండి తనకు జరిగినదంతా గుర్తుచేసేందుకు ప్రయత్నిస్తాడు తేజ్. ఈ క్రమంలో నందినిని తన ఊరికి తీసుకెళతాడు తేజ్. ఇంతకీ నందినికి తన గతం గుర్తుచేసేందుకు తేజ్ చేసిన ప్రయత్నాలేంటి… చివరికి నందినికి గతం గుర్తుచేసి తేజ్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు… మళ్ళీ నందిని చేత ‘తేజ్ ఐ లవ్ యు’ అని ఎలా చెప్పించుకున్నాడు అనేదే బ్యాలెన్స్ స్టోరీ.

నటీనటుల పనితీరు:

సాయి ధరమ్ తన లుక్ తో ఎట్రాక్ట్ చేశాడు కానీ పెర్ఫార్మెన్స్ లో బెస్ట్ ఇవ్వలేకపోయాడు. అతని నటనలో కొత్తదనం కనిపించలేదు. అనుపమ తన పెర్ఫార్మెన్స్ తో పరవాలేదనిపించుకుంది. ఎప్పుడూ ఎక్స్ ప్రెషన్లు మాత్రమే ఇచ్చే అనుపమ ఈసారి బోనస్ గా స్టెప్పులేసింది.

పృథ్వి , వైవా హర్ష అక్కడక్కడా నవ్వించారు. జయ ప్రకాష్ , పవిత్రా లోకేశ్‌, సురేఖా వాణి, జోష్ రవి మిగిలిన వారందరూ నామమాత్రంగానే నటించి ఓకే అనిపించారు. నిజానికి పాత్రల్లో కొత్తదనం లేకపోవడం, ఎమోషన్ కి పెద్దగా స్కోప్ లేకపోవడంతో నటీనటులందరూ జస్ట్ పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు:
రొమాంటిక్ మూవీస్ కి బెస్ట్ సాంగ్స్ అందించే గోపీసుందర్ ఈ సినిమాకు మాత్రం తన స్థాయికి తగ్గ ఆల్బమ్ అందించలేకపోయాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మైనస్ అనిపించింది. అండ్రూ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని కలర్ ఫుల్ ఫ్రేమ్స్ తో అలాగే సాంగ్స్ పిక్చరైజేషన్ లో కెమెరా వర్క్ తో మెస్మరైజ్ చేసాడు. ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ సినిమాకు తగ్గట్టుగా ఉంది.

సెకండ్ హాఫ్ లో వెంకట్‌ మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్ పెద్దగా ఆకట్టుకోలేదు. కొన్ని సందర్భాల్లో డార్లింగ్ స్వామి అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. కరుణాకరన్ స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా ఉంది. క్రియేటీవ్ కమర్షియల్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి.

జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ :

వరుసగా ఫెయిల్యూర్స్ చూస్తున్న సాయిధరమ్ తేజ్ ఈసారి ప్యూర్ లవ్ స్టోరీ సెలక్ట్ చేసుకున్నాడు. ఇప్పటికే కొన్ని జానర్స్ టచ్ చేసిన ఈ హీరో, ఓ ప్యూర్ లవ్ స్టోరీ తనకు సక్సెస్ ఇస్తుందేమో అనే ఆశతో ఈ సినిమా చేశాడు. ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరణ్ ను సెలక్ట్ చేసుకోవడంతో ఈసారి సాయిధరమ్ తేజ్ ది రైట్ ఛాయిస్ అనుకున్నారంతా. అయితే సినిమా చూసిన తర్వాత స్టోరీ సెలక్షన్ లో సాయిధరమ్ తేజ్ ది రాంగ్ ఛాయిస్ అని అర్థమౌతుంది.

కరుణాకరన్ ను సెలక్ట్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ కరుణ చెప్పిన స్టోరీకి తలూపడం మాత్రం తప్పు. పాత చింతకాయపచ్చడి అనే పదం కూడా ఈ సినిమా స్టోరీ ముందు చిన్నబోతుంది. ఇలాంటి ఓల్డ్ స్టోరీని తేజూ ఎలా సెలక్ట్ చేసుకున్నాడనే ఆలోచనతోనే థియేటర్ నుంచి అంతా బయటకొస్తాం. అంతలా మన బుర్రల్ని తొలిచేస్తుంది తేజ్ ఐ లవ్ యు. బహుశా కరుణాకరన్ పై ఉన్న నమ్మకంతో తేజు ఈ సాహసానికి సిద్ధపడినట్టున్నాడు. హీరోది గుడ్డి నమ్మకమని తెలుసుకోవడానికి పెద్దగా టైమ్ పట్టదు.

ఓ మంచి పాయింట్ ను తీసుకొని దాని చుట్టూ ఎమోషన్ తో ఓ అందమైన ప్రేమకథను అల్లడంలో కరుణాకరన్ దిట్ట. అయితే ఇది ఒకప్పుడు కరుణాకరన్ సంగతి. తేజ్-ఐ లవ్ యులో అతడి మార్క్ లవ్ సన్నివేశాలు కానీ, ఎమోషన్ కానీ కనిపించదు. మూవీ స్టార్టింగ్ నుండే కరుణాకరన్ ఏం చూపించబోతున్నాడో ప్రేక్షకులు పసిగట్టేసేలా ఉన్నాయి సీన్స్. ఏ లవ్ స్టోరీ కైనా హీరో- హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి.. కానీ ఈ సినిమాలో సాయి ధరం తేజ్- అనుపమ మధ్య అది కుదరలేదు. సినిమాకు పెద్ద మైనస్ కూడా అదే. తన ప్రతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ నుండి బెస్ట్ మ్యూజిక్ రాబట్టుకునే కరుణాకరన్ ఈసారి ఆ యాంగిల్ లో కూడా చేతులెత్తేశాడు.

కరుణాకరన్ గతంలో తీసిన ‘డార్లింగ్’, ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాల ఛాయలు ఈ సినిమాలో బాగా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా సినిమా చూస్తున్నంతసేపు డార్లింగ్ సినిమా పదే పదే గుర్తొస్తే అది మీ తప్పుకాదు. హీరో ఓ గ్యాంగ్ తో మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తూ ఉండటం, సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ బాండింగ్ లాంటి సీన్స్ అన్నీ యాజ్-ఇటీజ్ దించేశారు.

నిజానికి ఒక మంచి లవ్ స్టోరీ ఉంటే కరుణాకరన్ తన స్క్రీన్ ప్లే తో మెప్పించగలడు. కానీ ఈ సినిమాకు రొటీన్ స్టోరీ ఎంచుకోవడంతో పాటు తన గత సినిమాల స్క్రీన్ ప్లేనే మళ్ళీ రీపీట్ చేశాడు. ఇక క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనసుకు హత్తుకోవడం మాట అటుంచితే, ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది.

సాయి ధరమ్ తేజ్ లుక్, అనుపమ పెర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ, ‘అందమైన చందమామ’ సాంగ్ మాత్రమే సినిమాలో హైలెట్స్.

రేటింగ్ : 2 / 5