'పంతం' మూవీ రివ్యూ

Thursday,July 05,2018 - 02:22 by Z_CLU

నటీనటులు: గోపీచంద్‌, మెహ‌రీన్‌, ముకేష్ రుషి, తనికెళ్ళ భరణి, సంపత్ రాజ్, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు

మ్యూజిక్ : గోపీసుంద‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ : ప్ర‌సాద్ మూరెళ్ల‌

నిర్మాత : కె.కె.రాధామోహ‌న్‌

స్క్రీన్ ప్లే : కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి), కే.ఎస్.రవీంద్ర (బాబి)

కథ , దర్శకత్వం : కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి)

సెన్సార్ : UA

నిడివి : 145 నిమిషాలు

విడుదల తేది : 5 జులై 2018

మైల్ స్టోన్ మూవీ అనగానే ఆడియన్స్ ఫోకస్ పెరుగుతుంది. హీరోల జాగ్రత్తలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తన 150వ సినిమా కోసం చిరంజీవి ఎంత కేర్ తీసుకున్నాడో అందరం చూశాం. వందో సినిమాను బాలయ్య ఎంత స్పెషల్ గా మలుచుకున్నాడో కూడా చూాశాం. సో.. గోపీచంద్ కూడా తన 25వ చిత్రంతో సమ్ థింగ్ స్పెషల్ ఆఫర్ చేస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తారు. మరి పంతం సినిమాతో గోపీచంద్ ఏం చేశాడు..? తన 25వ చిత్రంతో ఈ హీరో హిట్ కొట్టాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ


కథ :

విక్రాంత్ (గోపీచంద్) నలుగురికి సహాయం చేస్తూ ఆపదలో ఉన్నవారిని సామాన్యుడిలా ఆదుకుంటూ సమాజం పట్ల కాస్త బాధ్యతగా ఉంటాడు. అలా కష్టం ఉన్న ప్రతీ వ్యక్తికి సహాయపడుతూనే మరోవైపు ఎవరికి తెలియకుండా హోమ్ మినిస్టర్ జయేంద్ర(సంపత్ రాజ్) అలాగే కొందరు మంత్రుల నల్లడబ్బుని దొంగతనం చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ ఉంటాడు. విక్రాంత్ చేస్తున్న మంచి పనులు చూసి అతని ప్రేమలో పడుతుంది అక్షర(మెహ్రీన్). అయితే ఎవరికీ తెలియకుండా దొంగతనం కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ వినయ్ పటేల్(షియాజీ షిండే)ని నియమిస్తాడు హోం మినిస్టర్ జయేంద్ర. ఈ క్రమంలో తన వెంటే ఉంటూ తన డబ్బు దొంగతనం చేసింది విక్రాంత్ అని తెలుసుకొన్న జయేంద్ర.. విక్రాంత్ బాగ్రౌండ్ గురించి తెలుసుకొని షాక్ అవుతాడు. ఇంతకీ విక్రాంత్ ఎవరు.. ఇదంతా ఎందుకు చేశాడు… చివరికి దొంగతనం కేసులో లొంగిపోయిన విక్రాంత్ సమాజానికి ఏం సందేశం ఇచ్చాడనేది బ్యాలెన్స్ స్టోరీ.

నటీనటుల పనితీరు:

25వ సినిమా కావడంతో కాస్త కేర్ తీసుకుని తన లుక్, పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేశాడు గోపీచంద్. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన పెర్ఫార్మెన్స్ తో మరోసారి మంచి మార్కులు అందుకొని సినిమాకు హైలైట్ గా నిలిచాడు. స్కోప్ లేని రోల్ కావడంతో మెహ్రీన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ గ్లామర్ తో పరవాలేదనిపించుకుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో నెగెటివ్ షేడ్ ఉన్న మినిస్టర్ గా నటించిన సంపత్ రాజ్ విలన్ గా ఆకట్టుకోలేకపోయాడు. పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి తమ కామెడీతో కొంత ఎంటర్టైన్ చేశారు. ముకేష్ రుషి, తనికెళ్ళ భరణి, గిరిబాబు, పవిత్ర లోకేష్, జయప్రకాశ్ రెడ్డి, అజయ్ తదితరులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఈ సినిమాకు గోపీ సుందర్ అందించిన బ్యాక్  గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సీన్స్ ని ఎలివేట్ చేయలేకపోయింది. సాంగ్స్ కూడా సినిమాకు హెల్ప్ అవ్వలేదు. ‘ఫస్ట్ టైం నిన్ను చూసి’ అనే సాంగ్ తప్ప మిగతావన్నీ  జస్ట్ ఓకే అనిపిస్తాయి. భాస్కరభట్ల సాహిత్యం బాగుంది. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్, అలాగే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రసాద్ కెమెరా పనితనం కనిపిస్తుంది. ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. సాంగ్స్ కొరియోగ్రఫీ పెద్దగా ఆకట్టుకోలేదు. రమేష్ రెడ్డి అందించిన పవర్ ఫుల్ డైలాగ్స్ అక్కడక్కడ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్, సెకండ్ హాఫ్ లో ఫైట్ ఒకటి ఆకట్టుకున్నాయి. చక్రి, బాబీ స్క్రీన్ ప్లే తో మేజిక్ చేయలేకపోయారు. దర్శకుడిగా మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్న దర్శకుడిగాలానే సినిమాను డీల్ చేశాడు చక్రి. సత్య సాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

చక్రి అనే రైటర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ గోపీచంద్ 25వ సినిమా చేస్తున్నాడనగానే ఈ సినిమాపై కాస్త బజ్ క్రియేట్ అయింది. టీజర్, ట్రైలర్ సినిమాలో గోపీచంద్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాపై హైప్ తీసుకొచ్చాయి. ఆ అంచనాలతో ఈ సినిమాకెళ్ళిన ప్రేక్షకులను నిరుత్సాహపరిచాడు గోపీచంద్.

గతంలో కొన్ని సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన చక్రి, తన మొదటి సినిమాకు ఓ రొటీన్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని బోర్ కొట్టించాడు. టీజర్ లో గోపీచంద్ ఆవేశంగా చెప్పిన డైలాగ్ చూసి, సమాజంలో అవినీతి, మోసాలను దర్శకుడు గట్టిగానే ప్రశ్నించాడని భావించిన ప్రేక్షకులు, సినిమా చూసి సగమే సంతృప్తి చెందుతారు. సమాజంలో చాలా సమస్యలున్నప్పటికీ బ్లాక్ మనీ, ఎక్స్ గ్రేషియా అంటూ కేవలం రెండింటి పైనే దృష్టి పెట్టి ఆ రెండుతోనే సినిమా అంతా నడిపించాడు చక్రి. పోనీ ఆ రెండు యాంగిల్స్ నైనా సరిగ్గా డీల్ చేసాడా.. అంటే అదీ లేదు. బలమైన సీన్స్ తో ఎమోషన్ పండించడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా డబ్బుకే విలువిచ్చే హీరో తండ్రి ఉన్నట్టుండి ఒకే సీన్ తో మారిపోవడం లాంటి సీన్స్ కొన్ని ప్రేక్షకుడికి నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సందర్భాల్లో గోపీచంద్ లాంటి పవర్ ఫుల్ హీరోను పెట్టుకొని చక్రి, డెప్త్ లోకి వెళ్ళలేకపోయాడు.

కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఓ సందేశం ఇవ్వడం కాస్త కష్టమే.. ఇలాంటి సబ్జెక్టుల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ముఖ్యంగా మన సమస్యలపై హీరో పోరాడుతున్నట్టుగా అనిపించాలి. కానీ సినిమాలో ఎక్కడా అలాంటి ఫీల్ కలగదు. కాస్తో కూస్తో ఆసక్తి కలిగించే సందర్భాల్లో లవ్ ట్రాక్ తో ఫ్లోను డిస్టర్బ్ చేశాడు డైరెక్టర్.

క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ బాగుంది. ఆ సీన్ కూడా గతంలో చూసినట్టుగానే అనిపించినప్పటికీ గోపీచంద్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో రక్తికట్టించాడు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్, అతడు నల్లధనాన్ని దొంగిలించే సీన్స్ గతంలో కొన్ని సినిమాలను గుర్తుచేసేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కామెడి, ప్రీ-ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ సినిమాలో హైలైట్స్  అని చెప్పొచ్చు.

ఫైనల్ గా సోషల్ మెసేజ్ నేపధ్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘పంతం’ పూర్తి స్థాయిలో మెప్పించకపోయినా, పరవాలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2.5 / 5