నర్తనశాల మూవీ రివ్యూ

Thursday,August 30,2018 - 03:00 by Z_CLU

న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, అజ‌య్‌, శివాజి రాజ‌ త‌దిత‌రులు.

ఛాయాగ్రహణం : విజ‌య్ సి కుమార్‌

సంగీతం : మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్

నిర్మాత‌ : ఉష ముల్పూరి

క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శక‌త్వం : శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి

విడుదల తేది : 30 ఆగస్ట్ 2018

సెన్సార్ : U/A

 

వరుస అపజయాల తర్వాత సొంత బ్యానర్ లో ‘ఛలో’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు నాగ శౌర్య… మళ్ళీ తన సొంత బ్యానర్ లో ‘@నర్తనశాల’ చేశాడు. మరి సొంత బ్యానర్ లో శౌర్య మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడా… జీ సినిమాకు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ .


కథ :

అమ్మాయిలు తమకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళే తమ శక్తిసామర్ధ్యాలతో వాటిని ఎదుర్కోవాలని భావిస్తాడు రాధాకృష్ణ(నాగశౌర్య).. అమ్మాయిలను దైర్యవంతులుగా చేయడానికి ఓ ఇనిస్టిట్యూట్ కూడా నడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో జీవితం మీద విరక్తి చెందిన మానస(కష్మీరషా) అనే అమ్మాయికి సహాయం చేసి కష్టాల నుండి ఆమెను బయటపదేస్తాడు. ఇక అమ్మాయిల మీద ఉన్న గౌరవం వారికి సహాయం చేసే మనసు చూసి రాధా కృష్ణ తో ప్రేమలో పడుతుంది మానస. రాదా కృష్ణ కూడా ఆమె ప్రేమలో పడతాడు. కానీ అనుకోకుండా ఓ సంఘటన వల్ల కృష్ణ తో తొలి చూపులోనే ప్రేమలో పడుతుంది సత్య(యామిని భాస్కర్). ఇక ఎట్టకేలకు తన కృష్ణ ప్రేమలో పడ్డాడని తెలుసుకున్న తండ్రి తండ్రి(శివాజీ రాజా) కొడుకుని అడగకుండా నేరుగా వెళ్లి అమ్మాయి తండ్రి రాయుడు(జయప్రకాష్ రెడ్డి)తో సంబంధం ఖాయం చేసుకుంటాడు. ఆ పెళ్లి నుండి తప్పించుకోవడం కోసం తను గే అంటూ చెప్తాడు కృష్ణ.. ఆ తర్వాత తను ప్రేమించిన మానసది కూడా అదే ఫ్యామిలీ అని తెలుసుకున్న కృష్ణ చివరికి ఆ ఫ్యామిలీ ని ఎలా ఒప్పించాడు.. మానసను ఎలా పెళ్లి చేసుకున్నాడు.. అనేది మిగతా కథ..

 

నటీనటుల పనితీరు:

ఇప్పటికే హీరోగా తనేంటో నిరుపించుకున్న నాగశౌర్య రాథాకృష్ణ క్యారెక్టర్ తో పరవాలేదనిపించుకున్నాడు. ముఖ్యంగా గే క్యారెక్టర్ తో నవ్వించే ప్రయత్నం చేసి కొంత వరకూ నవ్వించాడు. . కష్మిరా తన పెర్ఫార్మెన్స్ తో ఓకే అనిపించుకుంది. యామిని భాస్కర్ తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించింది. ఒక సాంగ్ లో గ్లామర్ షో చేసి సినిమాకు ప్లస్ అయ్యింది. చాలా రోజులకి ఓ ఇంపార్టెంట్ రోల్ దొరకడంతో శివాజీ రాజా బెస్ట్ ఇచ్చాడు. కొన్ని సార్లు అతి అనిపించినా తన టైమింగ్ తో నవ్వించాడు. ఇక తన యాస డైలాగ్ డెలివరీ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు జయప్రకాష్ రెడ్డి. సెకండ్ హాఫ్ లో జయప్రకాశ్ కామెడి బాగా వర్కౌట్ అయ్యింది. అజయ్ డిఫరెంట్ క్యారెక్టర్ తో అలరించాడు. జెమిని సురేష్ రెండు మూడు సందర్భాల్లో తన మాటలతో ప్రేక్షకులను నవ్వించాడు. సత్యం రాజేష్ కామెడి వర్కౌట్ అవ్వక పోగా కాస్త విసుగు తెప్పించింది. ఇక సుధా, ప్రియ , రాకెట్ రాఘవ, ఉత్తేజ్ తదితరులు దర్శకుడు చెప్పింది చేస్తూ వారి రోల్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించే. తన కెమెరా వర్క్ తో సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాడు . విజ‌య్ సి కుమార్‌. ముఖ్యంగా సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. ‘ఛలో’ సినిమాకు బెస్ట్ ఆల్బం అందించి సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించిన మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ సినిమాకు ఆ రేంజ్ ఆల్బం అందించలేకపోయాడు. ‘ఎగిరెనె’ పాట మినహా మిగతా పాటలేవి సినిమాకు హెల్ప్ అవ్వలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్  సినిమాకు అనుగూణంగా ఉంది. భాస్కరభట్ల, శ్రీమణి అందించిన సాహిత్యం బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. దర్శకుడిగా పరవాలేదనిపించుకున్న శ్రీనివాస్ చక్రవర్తి ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లేతో పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. ఐరా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది కామెడీ. సరిగ్గా కట్ చేస్తే జోక్ బ్రహ్మాండంగా పేలుతుంది. ఏమాత్రం తేడాకొట్టినా తుస్సుమంటుంది. ఛలో సినిమాలో ఈ కామెడీ కత్తిని బాగానే వాడిన నాగశౌర్య, నర్తనశాలలో మాత్రం సరిగ్గా వాడలేకపోయాడు. హిలేరియస్ అని అతడు భావించాడు, జనాలు మాత్రం ఇంకా ఎంతసేపు అని ఫీలయ్యారు. అదే నర్తనశాలకు ఛలో సినిమాకు ఉన్న తేడా. ఛలో తర్వాత సొంత బ్యానర్ నుంచి వచ్చిన మూవీ కావడంతో.. ఆ చిత్రంతో నర్తనశాలకు పోలిక పెట్టడంలో తప్పులేదు.

కాన్సెప్ట్ నచ్చి, అందులో కామెడీ పండించే సినిమాలు చేసేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నాగశౌర్య. ఛలో సినిమా అతడికి ఈ ధైర్యాన్నించింది. అదే నమ్మకంతో నర్తనశాల ఓకే చేశాడు. శౌర్య నమ్మకానికి తగ్గట్టే ఇందులో కాన్సెప్టు ఉంది. కానీ అతడు నమ్మిన కామెడీ మాత్రం సరిపోలేదు. ఉందంటే  ఉంది, లేదంటే లేదు.

తెలుగు ప్రేక్షకులకు ‘గే’ కామెడి సినిమాలు కొత్త. గతంలో మసాలా సినిమాలో హీరో రామ్ ఈ తరహా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు నాగశౌర్య మరోసారి దాని చుట్టూనే కథ అల్లి కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. గతంలో కృష్ణవంశీ, వంశీ పైడిపల్లి దగ్గర పనిచేసిన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరవాలేదనిపించాడు కానీ, రైటింగ్ లో ఫెయిల్ అయ్యాడు. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.

మూవీ మొదటి భాగం ఏదో సాగుతుందనిపిస్తూ చాలా వరకూ విసుగు తెప్పించిన దర్శకుడు ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పరవాలేదనిపించాడు… ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత రెండో భాగం హిలేరియస్ గా ఉంటుందేమోనని ఆశించిన ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు . సినిమాలో చాలా మంది ఆర్టిస్టులున్నప్పటికీ ఒక్క జయప్రకాష్ ని మాత్రమే పూర్తిగా వాడుకున్నాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో జయప్రకాశ్ కామెడి సినిమాకే హైలైట్ .. ఆ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.

తను రాసుకున్న కథను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు దర్శకుడు. కొన్ని సందర్భాల్లో నాగ శౌర్య కూడా దర్శకుడ్ని గుడ్డిగా నమ్మి సినిమా చేసాడనిపిస్తుంది. నాగశౌర్య క్యారెక్టర్ , సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడి సీన్స్ , నాగ శౌర్య -అజయ్ మధ్య వచ్చే సీన్స్, రెండు పాటలు సినిమాకు హైలైట్స్ కాగా స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు మైనస్ అనిపిస్తాయి. ఓవరాల్ గా ‘నర్తనశాల’ కొంచెంకొంచెం కామెడీతో అక్కడక్కడ నవ్విస్తుంది.

రేటింగ్ : 2.5 /5