Movie Review - స్వాతిముత్యం

Wednesday,October 05,2022 - 09:11 by Z_CLU

నటీనటులు: గణేష్ బెల్లంకొండ , వర్ష బొల్లమ్మ , రావు రమేష్ , గోపరాజు రమణ , వెన్నెల కిషోర్ , ప్రగతి , సురేఖ వాణి తదితరులు

సంగీతం : మహతి స్వర సాగర్

కెమెరామెన్ : సూర్య

ఆర్ట్ వర్క్ : అవినాష్ కొల్ల

ఎడిటింగ్ : నవీన్ నూలి

మాటలు : SV రాఘవ్ రెడ్డి

సమర్పణ : PDV ప్రసాద్

నిర్మాత : సూర్య దేవర నాగ వంశీ

రచన – దర్శకత్వం : లక్ష్మణ్ కే కృష్ణ

విడుదల తేది : 05 అక్టోబర్ 2022

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన ‘స్వాతిముత్యం’ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు బడా సినిమాల మధ్య దసరా పోటీలో నిలిచిన ఈ చిన్న సినిమా హిట్ అనిపించుకుందా? కొత్త దర్శకుడు కంటెంట్ తో మెప్పించగలిగాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

పిఠాపురంకి చెందిన బాలమురళి కృష్ణ (గణేష్ బెల్లంకొండ) ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పెళ్లి ప్రయత్నాల్లో ఉంటాడు. కొన్ని సంబంధాలు చూసిన తర్వాత బాల మురళి, భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ) ని పెళ్లి చూపుల్లో చూసి ఇష్టపడతాడు. కానీ భాగ్యలక్ష్మి పెళ్లికి ఇంకాస్త టైం కావాలని ఈ లోపు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని కోరుతుంది. ఆ గ్యాప్ లో బాలమురళి కృష్ణ మంచితనం చూసి అతను స్వాతిముత్యం అని ప్రేమలో పడి పెళ్లి పీటలు ఎక్కుతుంది.

అలా చూడగానే ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన బాలమురళికృష్ణ కి అనుకోకుండా ఓ సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యతో భాగ్యలక్ష్మితో తన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. హాయిగా సాగుతూ పెళ్లికి రెడీ అయిన బాలమురళి జీవితంలో వచ్చిన ఆ అనుకోని సమస్య ఏంటి ? చివరికి ఆ చిక్కు నుండి ఎలా బయటపడి మళ్ళీ పెళ్లి పీటలెక్కాడనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

మొదటి సినిమా అయినప్పటికీ బెల్లంకొండ గణేష్ బాగా నటించాడు. మంచి లక్షణాలున్న అబ్బాయిగా ఆకట్టుకున్నాడు. కాకపోతే నటనలో గణేష్ ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో పాస్ మార్కులు అందుకోలేకపోయాడు. అలాగే ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంది. హీరోయిన్ గా వర్ష బొల్లమ్మ భాగ్యలక్ష్మి పాత్రకు న్యాయం చేసింది. కొన్ని సినిమాలు చేసిన అనుభవంతో ఆ పాత్రలో మెప్పించింది. రావు రమేష్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన డైలాగ్ డెలివరీ, పల్లెటూరి స్లాంగ్ మాటలతో హిలేరియస్ గా నవ్వించాడు. రావు రమేష్ కు పోటీగా, గోపరాజు రమణ తన పాత్రతో బాగా నవ్వించాడు. పెళ్ళికి వచ్చిన పెద్దగా నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ అందించాడు. రావు రమేష్, గోపరాజు రమణ ఇద్దరూ సినిమాకు మెయిన్ హైలైట్స్. నరేష్ విజయ్ కృష్ణ తనదైన శైలి పాత్రలో ఆకట్టుకున్నాడు. వీరి తర్వాత చెప్పుకోవాల్సిన మరో గొప్ప పాత్ర వెన్నెల కిషోర్ ది. కిషోర్ కి మరో మంచి పాత్ర దక్కడంతో అక్కడక్కడా నవ్విస్తూ అలరించాడు. గీతగోవిందం తర్వాత మళ్ళీ అలాంటి కేరెక్టర్ దొరకడంతో సుబ్బరాజు నటనపరంగా బెస్ట్ ఇచ్చాడు. ప్రగతి, సురేఖ వాణి, హర్ష వర్ధన్ అలాగే మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసి సినిమా విజయంలో భాగమయ్యారు.

సాంకేతిక వర్గం పనితీరు :

చిన్న సినిమా అయినపటికీ ఈ సినిమాకు టెక్నీషియన్స్ నుండి మంచి సపోర్ట్ అందింది. ముఖ్యంగా మహతి స్వర సాగర్ నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. పాటలు బాగున్నాయి కానీ మళ్ళీ మళ్ళీ పాడుకునే స్థాయిలో లేవు. సూర్య కెమెరా పనితనం బాగుంది. సినిమాను తన కెమెరా వర్క్ తో చాలా నేచురల్ గా చూపించి మంచి విజువల్స్ అందించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు బిగ్ ప్లస్ అయ్యింది. సినిమాను పర్ఫెక్ట్ రన్ టైంకి కుదించడంతో ఎక్కడా డ్రాగ్ అనిపించకుండా సాగింది.

దర్శకుడు లక్ష్మణ్ రైటింగ్ అందరూ మెచ్చుకునేలా ఉంది. ముఖ్యంగా ఒక చిన్న పాయింట్ రాసుకొని దాని చుట్టూ ఎంటర్టైన్ మెంట్ అల్లిన విధానం ఆకట్టుకుంటుంది. కొత్త దర్శకుడైనప్పటికీ కథను బాగా డీల్ చేశాడు. రాఘవ్ రెడ్డి మాటలు సినిమాకు బిగ్ ప్లస్ అయ్యాయి. పల్లెటూరిలో మాటలతో కామెడీ సృష్టించి రచయితగా ఆయన మంచి మార్కులు అందుకున్నాడు. ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

swathi muthyam movie

జీ సినిమాలు సమీక్ష :

ఒక పెళ్లి కాని అబ్బాయి తన స్నేహితుడి మాట కాదనలేక చేసిన ఓ పని అతన్ని ఊహించని ఇబ్బందిలో పడేస్తే? ఆ సమస్య కారణంగా అతని పెళ్లి ఆగిపోతే? ఈ పాయింట్ తీసుకొని కొత్త దర్శకుడు లక్ష్మణ్ మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టులు రావు రమేష్, గోపరాజు రమణను సరిగ్గా వాడుకొని వారి పాత్రల ద్వారా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ మెంట్ అందించి హిలేరియస్ గా నవ్వించాడు. మొదటి సినిమాలో ఇంత కామెడీ వర్కౌట్ చేసుకోవడం లక్ష్మణ్ ని మెచ్చుకోవాల్సిన విషయం. నిజానికి కామెడీ ట్రాక్ రాసుకోవడం దాన్ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి హాస్యం పుట్టించడం దర్శకులకు కాస్త కష్టమే అని చెప్పాలి. కానీ లక్ష్మణ్ కామెడీ పోర్షన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి దర్శకుడిగా పాస్ అయిపోయాడు.

హీరో గణేష్ బెల్లంకొండకి ఇది మొదటి సినిమా కావడంతో అతనిపై ఎక్కువ భాద్యత పెట్టకుండా అతని పరిధి వరకూ నటన రాబట్టుకొని మిగతా భాగాన్ని రావు రమేష్, గోపరాజు రమణ, నరేష్ ల భుజాలపై పెట్టాడు దర్శకుడు. లక్ష్మణ్ హిలేరియస్ కామెడీ సన్నివేశాలు రాసుకోవడం, రాఘవ్ రెడ్డి వాటికి మంచి హాస్యంతో సంభాషణలు రాసి ఇవ్వడంతో రావు రమేష్, గోపరాజు రమణ తమ పాత్రలతో రెచ్చిపోయి పసందైన కామెడీ పండించి కడుపుబ్బా నవ్వించారు. మొదటి భాగమంతా పల్లెటూరు, అక్కడ ఉండే కొందరు మనుషులు హీరో -హీరోయిన్ లవ్ ట్రాక్ తో సరదాగా నడిపించిన దర్శకుడు లక్ష్మణ్ ఇంటర్వెల్ లో ఓ ట్విస్ట్ పెట్టి అక్కడి రెండో భాగాన్ని రావు రమేష్, గోపరాజు కామెడీ తో మెప్పించాడు. మొదటి భాగం కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా బాగానే నడిపించినప్పటికీ రెండో భాగంలో మాత్రం ప్రేక్షకులకు హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ అందించి పూర్తి స్థాయిలో మెప్పించి థియేటర్ బయటికి పంపించాడు దర్శకుడు.

ఈ సినిమా కోసం సరోగసి అనే డిఫరెంట్ పాయింట్ తీసుకొన్న దర్శకుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా డీల్ చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను తీర్చిదిద్దాడు. ముఖ్యంగా పాత్రలు వాటి బిహేవియర్ బాగా రాసుకున్నాడు. అలాగే దర్శకుడు లక్ష్మణ్ రాసుకున్న సన్నివేశాలకు రాఘవ్ రెడ్డి మాటలు బాగా కుదిరాయి. గోదావరి జిల్లాల మాటలతో ఆ పాత్రలకు మరింత అందం తీసుకొచ్చి రచయితగా మంచి మార్కులు అందుకున్నాడు రాఘవ్ రెడ్డి.

ఒక డెబ్యూ హీరోని పెట్టుకొని తన మొదటి సినిమాకు ఇలాంటి రిస్క్ పాయింట్ తీసుకున్న లక్ష్మణ్ ని అభినందించాలి. ఈ తరహా కథలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా తేడా కొట్టేస్తుంది. స్పర్మ్ డొనేషన్ అనే పాయింట్ తీసుకొని దాన్ని ఏమాత్రం అసభ్యకరంగా చూపించకుండా దాని చుట్టూ మంచి ఆహ్లాదకరమైన కామెడీ అల్లి సినిమాగా తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకునేలా చేస్తుంది.

ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్స్ లోకి వచ్చిన ‘స్వాతిముత్యం’ ప్రేక్షకుడు కొన్న టికెట్టుకి న్యాయం జరిగేలా హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ అందించి సంతృప్తిపరుస్తుంది. రావు రమేష్ – గోపరాజు పాత్రల ద్వారా వచ్చే కామెడీ ఈ సినిమాను రెండో సారి కూడా చూసేలా చేస్తుంది. ఈ ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.

రేటింగ్ : 3/5