Movie Review - రాధేశ్యామ్

Friday,March 11,2022 - 09:30 by Z_CLU

నటీనటులు : ప్రభాస్ , పూజ హెగ్డే ,కృష్ణంరాజు, సత్య రాజ్, సచిన్ ఖేడేఖర్, మురళి శర్మ , ప్రియదర్శి తదితరులు

సంగీతం : జస్టిన్ ప్రభాకర్

నేపథ్య సంగీతం : ఎస్. తమన్

ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరావు

నిర్మాణం : UV క్రియేషన్స్ , T సిరీస్

నిర్మాతలు : వంశీ, ప్రమోద్, ప్రసీద

రచన – దర్శకత్వం : రాధా కృష్ణ

నిడివి : 138 నిమిషాలు

విడుదల : 11 మార్చ్ 2022

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నుండి సినిమా వచ్చి మూడేళ్ళవుతోంది. ‘సాహో’ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ‘రాధేశ్యామ్’తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఈసారి పీరియాడిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు డార్లింగ్. రాధాకృష్ణ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజే రిలీజైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ అంచనాలు ఎందుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

Makers of Prabhas starrer ‘Radhe Shyam’ to roll out NFT exclusive collectibles
కథ :

కథ అంతా ఇటలీలో జరుగుతుంది. విక్రమాదిత్య (ప్రభాస్) ఫేమస్ పామిస్ట్. హస్త రేఖలు చూసి ఏం జరగబోతుందో ముందే ఊహించి చెప్పగల దిట్ట. అందుకే విక్రమాదిత్యతో తమ భవిష్యత్తు గురించి చెప్పించుకోవడానికి ఎందరో ప్రపంచదేశ నాయకులు అతన్ని కలవాలనుకుంటారు. తన జీవితంలో ప్రేమ, పెళ్లి లేవనుకుంటూ కూల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేసే ఆదిత్య ఓ సందర్భంలో ప్రేరణ (పూజ హెగ్డే) తో ప్రేమలో పడతాడు. ప్రేరణ కూడా కొన్ని రోజులకే అతని ప్రేమలో పడుతుంది. అందరి చేతి రేఖలు చూసి జరగబోయేది క్లియర్ గా చెప్పేసే విక్రమాదిత్య ప్రెడిక్షన్ అన్నిటిలో కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది.

కొన్ని నెలల్లో చనిపోయే ప్రేరణకి లాంగ్ లైఫ్ ఉంటుందని ప్రెడిక్ట్ చేసి చెప్తాడు ఆదిత్య. కానీ ప్రేరణ మాత్రం ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పని ప్రూవ్ చేయాలని చూస్తుంది. మరి డెస్టినీ వర్సెస్ లవ్ అనే ఈ యుద్ధంలో చివరికి ఏది గెలిచింది ? ప్రేరణ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ కరెక్టేనా ? లేదా ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

ఫేమస్ పామిస్ట్ విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ మెస్మరైజ్ చేశాడు. స్లిమ్ గా కనిపిస్తూ స్టైలిష్ లుక్ తో ఎట్రాక్ట్ చేశాడు. తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచాడు డార్లింగ్. డాక్టర్ ప్రేరణ పాత్రకి పూజా హెగ్డే పర్ఫెక్ట్ అనిపించుకుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో తన అందంతో యువతని ఆకట్టుకునేలా నటించింది. పూజ తన కెరీర్ లో చెప్పుకునే గొప్ప పాత్రల్లో ప్రేరణ కచ్చితంగా ఉంటుంది. స్వామీజీ పరమహంస పాత్రలో కృష్ణంరాజు మెప్పించారు. నటనలో తనకున్న ఎన్నో ఏళ్ల అనుభవంతో ఆ పాత్రలో ఒదిగిపోయాడు. డాక్టర్ పాత్రకు సచిన్ ఖేడేకర్ , ప్రభాస్ తల్లి పాత్రకు భాగ్య శ్రీ, పూర్తి న్యాయం చేశారు. జగపతి బాబు కనిపించింది రెండు సన్నివేశాల్లోనే అయినా అతని పాత్ర విక్రమాదిత్య క్యారెక్టర్ ని ఎలివేట్ చేసింది. జయరామ్ కామిక్ క్యారెక్టర్ లో కనిపించి ఎంటర్టైన్ చేశాడు. రిద్ది కుమార్, ప్రియదర్శి మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

భారీ బడ్జెట్ తో తీసే సినిమాలకు టెక్నీషియన్స్ ఎంత కృషి చేస్తే అంత మంచి అవుట్ పుట్ వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్ అందరూ వారి వారి విభాగాల్లో బెస్ట్ వర్క్ డెలివర్ చేశారు. ముఖ్యంగా మనోజ్ పరమహంస తన విజువల్స్ తో సినిమా స్థాయిని పెంచాడు. ఫ్రేమ్స్ అన్ని పెయింటింగ్ ని తలిపించాయి. కొన్ని సన్నివేశాల్లో మనోజ్ కెమెరా వర్క్ చూస్తే వావ్ అనిపిస్తుంది. ఇక జస్టిన్ ప్రభాకర్ తన ప్లెజెంట్ సాంగ్స్ తో మంచి ఫీల్ తీసుకొచ్చాడు. “ఈ రాతలే” సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆ సాంగ్ విజువల్ గా కూడా ఆకట్టుకుంది మిగతా పాటలు కూడా అలరించాయి. కృష్ణకాంత్ సాహిత్యం పాటలకు ప్రాణం పోసింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. చాలావరకూ ఇంపార్టెన్స్ సీన్స్ కి తన స్కోర్ తో మరింత బలం చేకూర్చి బెస్ట్ వర్క్ ఇచ్చాడు తమన్. రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ డిజైనింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఆర్ట్ వర్క్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. కమల్ కన్నణ్ టీం క్రియేట్ చేసిన విజువల్స్ ఎఫెక్స్ట్ వర్క్ హాలీవుడ్ సినిమాని తలపించేలా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం వారు పడిన కష్టం స్క్రీన్ పై కనిపించింది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన సిచ్యువేషనల్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ స్కిల్స్ సినిమాకు ఎడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆయన తన కత్తెరకి పని చెప్పి పర్ఫెక్ట్ రన్ టైం లాక్ చేయడం సినిమాకు ప్లస్ అయ్యింది. రాధాకృష్ణ స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్ పై కనిపించింది. నిర్మాతలు రిస్క్ చేసి పెట్టిన బడ్జెట్ సినిమా క్వాలిటీని పెంచడానికి తోడ్పడింది. ఓవరాల్ గా హై టెక్నికల్ వేల్యూస్ తో సినిమా టాప్ నాచ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

UV-Producers-spend-above-200cr-for-Radheshyam-prabhas-pooja-zeecinemalu

జీ సినిమాలు సమీక్ష :

జ్యోతిష్యం అనే ఎలిమెంట్ తో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసి దాని చుట్టూ స్క్రీన్ ప్లే అల్లడం అంటే మాములు విషయం కాదు. అందుకే చంద్రశేఖర్ యేలేటి ఈ స్టోరీ లైన్ మీద ఎక్కువ వర్క్ చేయలేకపోయాడు. ఆ ఐడియాని తీసుకొని కొన్నేళ్ళు కసరత్తు చేసి దాన్ని ఓ ఫార్మేట్ లోకి తీసుకొచ్చాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అయితే తను నమ్మిన కథని కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళకుండా నిజాయితిగా చెప్పే ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయ్యాడు. నిజానికి సినిమా ఫస్ట్ హాఫ్ లో ఓ ఫైట్ కి స్కోప్ ఉంటుంది కానీ అక్కడ ఫైట్ పెట్టకుండా ప్రభాస్ కి యాక్సిడెంట్ జరిగినట్టు చూపించి నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. ఇక్కడే తెలుస్తుంది తను ఈ కథని ఎలాంటి డైవర్షన్స్ పెట్టుకోకుండా జెన్యూన్ గా చెప్పాలనుకున్నాడని. కానీ ప్రభాస్ లాంటి కటౌట్ పెట్టుకొని యాక్షన్ లేకుండా మాస్ ఆడియన్స్ ని మెప్పించే అంశాలు పెట్టకుండా ఓ హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో ఈ పీరియాడిక్ లవ్ స్టోరీని చూపించాడు రాధా కృష్ణ.

కృష్ణంరాజు క్యారెక్టర్ ద్వారా ప్రభాస్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ సినిమాను స్టార్ట్ చేసిన దర్శకుడు ఎక్కవ టైం తీసుకోకుండానే కథలోకి వెళ్ళిపోయాడు. లవ్ ట్రాక్ కూడా బాగానే రాసుకున్నాడు. ట్రైన్ లో వచ్చే లవ్ సీన్స్ తో ఇంప్రెస్ చేశాడు. ప్రభాస్-పూజ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో లవ్ ట్రాక్ మెప్పిస్తుంది. విక్రమాదిత్య పామిస్త్రీ చెప్పే సన్నివేశాలు, లవ్ ట్రాక్ , మూడు పాటలతో మొదటి భాగాన్ని నడిపించాడు దర్శకుడు. ఇక హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి జగపతి బాబు పాత్రను కూడా వాడుకొని మంచి సీన్ రాసుకున్నాడు. సచిన్ ఖేడేకర్ ప్రభాస్ ని పిలిచి చనిపోయిన వారి జ్యోతిష్యం చెప్పించే సీన్ ఆడియన్స్ కి హై మూమెంట్ ఇస్తుంది. అలాగే ప్రీ ఇంటర్వెల్ సీన్స్, ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్లాక్ తో ఫస్ట్ హాఫ్ ని ఎండ్ చేసి సెకండాఫ్ మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు రాధాకృష్ణ. ఇక రెండో భాగంలో మాత్రం దర్శకుడు కొంతవరకు తడబడ్డాడనిపించింది. రిద్ది కుమార్ చేసిన తార పాత్రతో సెకండాఫ్ లో మంచి స్పోర్ట్స్ సీన్స్ ఉంటాయని ట్రైలర్ చూసి ఊహిస్తే జస్ట్ ఒక్క సీజీ సీన్ తో ఆ ట్రాక్ కి ఎండ్ కార్డ్ వేశాడు దర్శకుడు. అక్కడ ఆ అమ్మాయి పాత్రతో జ్యోతిష్యం కాదు తనని తాను నమ్ముకొని తన రాత తనే రాసుకుంటానని చెప్పించాడు దర్శకుడు. ఇక సినిమా సెన్సార్ తర్వాత ఓ 12 నిమిషాలు ట్రిమ్ చేశారు మేకర్స్. బహుశా అందులో ట్రైలర్ లో కనిపించిన స్పోర్ట్స్ డ్రామాతో వచ్చే సీన్స్ లేపేసి ఉండొచ్చు.

కృష్ణంరాజుతో స్వామీజీ పాత్రను చేయించి విక్రమాదిత్య కి గురువుగా చూపించి రెబెల్ ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు దర్శకుడు. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే ప్రేమ, పెళ్లి గురించి కృష్ణంరాజు ప్రభాస్ మాట్లాడుకునే మాటలు ప్రభాస్ నిజ జీవితానికి దగ్గరగా అనిపిస్తాయి. పీరియాడిక్ లవ్ స్టోరీని తనదైన స్టయిల్ లో చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు, సెకండాఫ్ ని కొంచెం స్పీడప్ చేస్తే బాగుండేదేమో. ఓవరాల్ గా “మన రాత మన చేతుల్లోనే కాదు చేతల్లో కూడా ఉంటుంది” అంటూ రాజమౌళి వాయిస్ ఓవర్ తో చెప్పించి కథకి ఎండ్ ఇచ్చాడు దర్శకుడు. క్లైమాక్స్ లో వచ్చే షిప్ సీక్వెన్స్ ఆడియన్స్ కి ఓ హాలీవుడ్ సినిమా ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

ప్రభాస్ పెర్ఫార్మెన్స్, పూజా హెగ్డే గ్లామర్, విజువల్స్, హై స్టాండర్డ్ టెక్నికల్ వేల్యూస్, జస్టిన్ మ్యూజిక్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ అనిపించగా స్లో నెరేషన్, సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు  కొంచెం ఇబ్బంది పెడతాయి.

ఓవరాల్ గా చూసుకుంటే, సాహో లాంటి మాస్ యాక్షన్ మూవీ తర్వాత రాధేశ్యామ్ అనే ఓ క్లాసికల్ ప్రేమకథతో వచ్చిన ప్రభాస్.. ఈ యాంగిల్ లో కూడా అందర్నీ ఆకట్టుకున్నాడు. మాస్ మాత్రమే కాకుండా, తను క్లాస్ కూడా చేయగలనని పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాడు. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో, హాలీవుడ్ స్టైల్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో తీసిన ఈ భారీ ప్రయత్నం మాత్రం కచ్చితంగా మెచ్చుకోదగ్గదే.

రేటింగ్ : 3 /5