Movie Review - క్లాప్

Friday,March 11,2022 - 06:58 by Z_CLU

నటీనటులు: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌, కృష్ణ కురుప్‌, నాజ‌ర్‌, ప్ర‌కాష్ రాజ్‌, బ్ర‌హ్మాజీ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: పృథ్వి ఆదిత్య‌
నిర్మాత‌లు: రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి
బ్యాన‌ర్స్‌: శ‌‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌, శ్రీ షిర్డీసాయి మూవీస్‌
సంగీతం: మేస్ట్రో ఇళ‌య‌రాజా
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌వీణ్ కుమార్‌
ఎడిటింగ్‌: రాగుల్‌
రన్ టైమ్: 2 గంటల 12 నిమిషాలు
ఓటీటీ రిలీజ్ డేట్: మార్చి 11, 2022

ఆది పినిశెట్టి హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా క్లాప్. ఈ సినిమా ట్రయిలర్ లో ఓ కాలు లేని అధ్లెట్ గా కనిపించాడు ఆది. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఈరోజు ఓటీటీలోకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Clap-Movie-Review-telugu (1)

కథ
విష్ణును (ఆది పినిశెట్టి) అథ్లెటిక్స్ లో నేషనల్ ఛాంపియన్ ను చేయాలనుకుంటాడు తండ్రి (ప్రకాష్ రాజ్). కొడుక్కి ఇష్టం లేదని రెండో పెళ్లి కూడా చేసుకోడు. విష్ణు కూడా తండ్రి ఆశయాలకు అనుగుణంగా పెరుగుతాడు. కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో తండ్రితో పాటు తన కాలును కూడా పోగొట్టుకుంటాడు. ఏకంగా అథ్లెటిక్స్ కు దూరమౌతాడు. అలా నిరాశ-నిస్పృహతో జీవితాన్ని గడుపుతున్న విష్ణును భాగ్యలక్ష్మి (కృష్ణ కురుప్) ఆకర్షిస్తుంది. అథ్లెటిక్స్ తో మంచి ప్రతిభ చూపిస్తున్న ఆ అమ్మాయి తల్లిదండ్రుల మరణంతో ఆటకు దూరమౌతుంది. ఆమెను తిరిగి ట్రాక్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు విష్ణు. అయితే విష్ణు చేసే ప్రయత్నాల్ని స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడు (నాజర్) ఎప్పటికప్పుడు అడ్డుకుంటాడు. ఇంతకీ విష్ణుకు, నాజర్ కు ఎందుకు పడదు? వీళ్లిద్దరి మధ్య భాగ్యలక్ష్మి కెరీర్ ఏమౌతుంది? మధ్యలో హాకీ ప్లేయర్ మిత్ర (ఆకాంక్ష సింగ్), విష్ణు కోసం ఏం చేసింది? చివరికి విష్ణు తను అనుకున్నది సాధించాడా లేదా అనేది ఈ క్లాప్ స్టోరీ.

నటీనటుల పనితీరు
విష్ణుగా ఆది పినిశెట్టి నటన చాలా బాగుంది. ఒంటిచెత్తే ఈ కథను నడిపించాడు. ఓవైపు ప్రకాష్ రాజ్, నాజర్ లాంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్ మాత్రమే మనకు గుర్తుంటుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ప్రకాష్ రాజ్ ది చిన్న పాత్ర. అయినప్పటికీ తన మార్క్ చూపించాడు. నాజర్ మరోసారి తన మార్క్ విలనీ చూపించాడు. ఆకాంక్ష సింగ్ పాత్రను సరిగ్గా రాసుకోలేదు. కానీ ఆమె బాగా చేసింది. అథ్లెట్ గా నటించిన కృష్ణ కురుప్ ఆకట్టుకుంది. బ్రహ్మాజీతో పాటు ఇతర నటీనటులంతా తమ పాత్రల పరిథి మేరకు నటించి మెప్పించారు.

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా ఈ సినిమాలో ముందుగా ఇళయరాజా గురించే చెప్పుకోవాలి. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. ఎమోషనల్ సన్నివేశాల్లో, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సీన్స్ లో ఇళయరాజీ సీనియారిటీ కనిపిస్తుంది. పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ ఓకే. రాగుల్ ఎడిటింగ్ మాత్రం బాగాలేదు. ఇక దర్శకుడు పృధ్వి ఆదిత్య విషయానికొస్తే, అతడు ఏ పాయింట్ నైతే హైలెట్ చేయాలనుకున్నాడో, దాన్ని సరిగ్గా చూపించలేకపోయాడనిపిస్తోంది. ఓ ఐడియాతో కథ స్టార్ట్ చేసి, ఇంకెక్కడో ముగించినట్టు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది.

clap movie

జీ సినిమాలు సమీక్ష
మన ఆడియన్స్ కు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాదు. జెర్సీ లాంటి ఎమోషనల్ డ్రామాను చూసిన ఎక్స్ పీరియన్స్ మనకు ఉంది. విజిల్, కౌసల్య కృష్ణమూర్తి, గురు లాంటి హార్ట్ టచింగ్ స్పోర్ట్స్ డ్రామాలు కూడా చూశాం. తాజాగా ఓటీటీలోకొచ్చిన క్లాప్ మాత్రం ఆ స్థాయిలో లేదు. అథ్లెటిక్స్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ సినిమాలో దర్శకుడు రాసుకున్న పాయింట్ కొత్తదేం కాదు. స్పోర్ట్స్ అథారిటీలో జరిగే అవకతవలు, లాబియింగ్స్ తో ఇప్పటికే సినిమాలొచ్చాయి. క్లాప్ లో కూడా అదే చూపించారు. తను సాధించలేకపోయిన గెలుపును, మరో వ్యక్తి సాధించేలా చేసి ఆత్మసంతృప్తి పొందే రొటీన్ కథే ఇది. కాకపోతే ఆ రొటీన్ స్టఫ్ ను కూడా ఆకట్టుకునేలా చూపిస్తే ఈ జానర్ కథలకు కనెక్ట్ అవ్వడానికి ఆడియన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ ప్రయత్నం క్లాప్ లో జరగలేదు.

క్లాప్ లో మేజర్ గా కనిపించే సమస్య స్క్రీన్ ప్లే. సినిమాలో హీరో అథ్లెట్. అనుకోకుండా యాక్సిడెంట్ లో తన కాలు పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత కోచ్ గా మారి తను అనుకున్న లక్ష్యాన్ని ఓ అమ్మాయితో సాధిస్తాడు. వీటిలో హీరో అథ్లెట్ అనే కోణాన్ని చాలా తక్కువగా చూపించారు. యాక్సిడెంట్ తో కాలు కోల్పోయి ఓ రకమైన వైరాగ్యంలోకి వెళ్లిపోయే కోణాన్ని ఎక్కువగా చూపించారు. మరో అమ్మాయి సీన్ లోకి వచ్చి మెడల్ కొట్టే కోణాన్ని ఇంకా ఎక్కువగా చూపించారు. వీటిలో ఆడియన్స్ ఏది ఎక్కువ కోరుకుంటున్నారనే లాజిక్ ను డైరక్టర్ మిస్సయ్యాడు.

ఓపెనింగ్ సీన్ లోనే హీరోకు యాక్సిడెంట్. కట్ చేస్తే ఒంటి కాలితో సోఫాలో సిట్టింగ్.. ఇలా మొదలైన క్లాప్ సినిమాలో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు. హీరో ట్రాక్ పై శక్తికొద్దీ పరుగులుపెడితే, అతడితో పాటు మనం కూడా ట్రాక్ పై పరుగుపెట్టే అనుభూతిని పొందాలని అనుకుంటాం. కానీ ఆ ఎపిసోడ్ నే పూర్తిగా మిస్సయ్యాడు దర్శకుడు. మధ్యమధ్యలో హీరోపై చూపించిన అథ్లెటిక్స్ ఎపిసోడ్స్ కూడా తేలిపోయాయి.

ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే, హీరోయిన్ క్యారెక్టర్ మరో ఎత్తు. హీరోకు లవర్ గా, భార్యగా చూపించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆమెను ఎందుకు హాకీ ప్లేయర్ గా చూపించారో అర్థం కాదు. అసలు కథకు, హీరోయిన్ హాకీ ఆడ్డానికి లింక్ ఏంటో తెలియదు. ఇలా సరిగ్గా రాయని పాత్రలకు తోడు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం క్లాప్ సినిమాకు మైనస్.

కథ, స్క్రీన్ ప్లే ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాకు వందశాతం న్యాయం చేశాడు ఆది పినిశెట్టి. అతడి యాక్టింగ్ లో మరో కోణం కనిపిస్తుంది. అథ్లెటిక్ గా, కోచ్ గా, ఓ ఉద్యోగిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్ చూపించాడు ఆది. ఆకాంక్ష సింగ్ ఓకే. ప్రకాష్ రాజ్ పాత్ర ఓపెనింగ్ టైటిల్స్ తోనే క్లోజ్ అయింది. మధ్యలో ఒకట్రెండు చోట్ల మెరుపులా మెరిసిందంతే. విలన్ గా నాజర్, అతడు చెప్పిందల్లా చేసే పాత్రలో బ్రహ్మాజీ సరిపోయారు. ఇక మహిళ అథ్లెట్ గా నటించిన కృష్ణ కురుప్ చాలా బాగా చేసింది. ఆది తర్వాత క్లిక్ అయిన పాత్ర ఇదే. తెర నిండా తెలిసిన నటులు ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చిన అంశం.

టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. ఇళయరాజా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాలు నిలబెట్టాడు. పాటల్లో సాహిత్యం బాగుంది కానీ వినడానికి అంత ఇంపుగా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ ఓకే, ఎడిటింగ్ మైనస్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

ఓవరాల్ గా క్లాప్ సినిమాను ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్ కోసం ఓసారి చూడొచ్చు.

రేటింగ్ – 2.5/5