Movie Review - గని

Friday,April 08,2022 - 02:32 by Z_CLU

నటీనటులు: వ‌రుణ్ తేజ్‌, స‌యీ మంజ్రేక‌ర్‌, ఉపేంద్ర‌, నదియా, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫీ:  జార్జ్ సి.విలియ‌మ్స్‌

మ్యూజిక్‌:  త‌మ‌న్‌.ఎస్‌

ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

నిర్మాత‌లు:  సిద్ధు ముద్ద‌, అల్లు  బాబీ

రచన – ద‌ర్శ‌క‌త్వం :  కిర‌ణ్ కొర్ర‌పాటి

విడుదల తేది : 8 ఏప్రిల్ 2022

నిడివి : 151 నిమిషాలు

కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న వరుణ్ తేజ్ ‘గని‘ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా , అల్లు బాబీ -సిద్దు నిర్మాతలుగా పరిచయం అవుతూ చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ కి ముందు కొంత బజ్ క్రియేట్ చేసి ఎట్రాక్ట్ చేసింది. మరి ఫైనల్ గా ఆ అంచనాలు అందుకొని వరుణ్ తేజ్ ‘గని’ విజయం అందుకుందా ? కొత్త దర్శకుడు ఈ స్పోర్ట్స్ డ్రామాతో మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 varun tej ghani

కథ :

బాక్సింగ్ లో నేషనల్స్ వరకూ వెళ్లి ఓడిపోయిన విక్రమ్ ఆదిత్య (ఉపేంద్ర) స్టెరాయిడ్స్ తీసుకున్న కారణంచేత అతన్ని అలాగే ఆంధ్రప్రదేశ్ ని బాక్సింగ్ గేమ్ లో ఏడాది పాటు బ్యాన్ చేస్తారు. తండ్రి చేసిన తప్పు కారణంగా చిన్నతనం నుండి అందరితో చీటర్ అనిపించుకుంటాడు గని(వరుణ్ తేజ్).

తన తండ్రి ఏ గేమ్ లో అయితే ఓడిపోయి తనకి చీటర్ అనే బిరుదు తెచ్చాడో అదే గేమ్ లో తను నేషనల్స్ ఆడి ఛాంపియన్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని తల్లి(నదియా)కి తెలియకుండా బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటాడు గని. నిత్యం తండ్రిని అసహ్యంచుకుంటూ ఉండే గనికి తన తండ్రి గురించి చెప్పి విక్రమ్ ఆదిత్య గేమ్ పవర్ ఏంటో తెలియజేస్తాడు మాజీ బాక్సింగ్ ఛాంపియన్ (సునీల్ శెట్టి). గేమ్ లో జరిగే పాలిటిక్స్ ని దాటి తన తండ్రి అందుకోలేకపోయిన ఛాంపియన్ ట్రోఫీ ని గని అందుకున్నాడా  లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

గని క్యారెక్టర్ కి వరుణ్ బెస్ట్ ఇచ్చాడు. బాక్సర్ గా మెప్పించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. ఈ సినిమా కోసం వరుణ్ పడిన కష్టం స్క్రీన్ పై కనిపించింది. ముఖ్యంగా ట్రైనింగ్ సాంగ్ లో అలాగే బాక్సింగ్ ఫైట్స్ లో వరుణ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. సయీ మంజ్రేకర్ కి తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ చాలా ఈజ్ తో నటించింది. కాకపోతే లవ్ ట్రాక్ తేడా కొట్టడంతో ఆమె క్యారెక్టర్ క్లిక్ అవ్వలేదు. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేసిన ఉపేంద్ర తన క్యారెక్టర్ కి బెస్ట్ అనిపించుకున్నాడు కాకపోతే  ఆ పాత్ర కేవలం ఫ్లాష్ బ్యాక్ కి మాత్రమే పరిమితం అయింది. కోచ్ గా సునీల్ శెట్టి, హీరో తల్లి పాత్రలో నదియా తమ నటనతో కొన్ని సన్నివేశాలకు బలం చేకూర్చారు. జగపతిబాబు విలనీ రొటీన్ గానే ఉంది. ఆ పాత్ర గతంలో కొన్ని సినిమాల్లో చేసిందే కావడంతో మొనాటనీ అనిపించింది.  స్పెషల్ సాంగ్ లో తమన్నా గ్లామర్ షోతో ఎట్రాక్ట్ చేసింది. నవీన్ చంద్ర తన పాత్రకి న్యాయం చేశాడు. VK నరేష్, రఘుబాబు, తనికెళ్ళ భరణి తమ అనుభవంతో ఆ పాత్రలకు బలం చేకూర్చారు. సత్య, సుదర్శన్, సద్దాం డైలాగ్ కామెడీ వర్కౌట్ అవ్వలేదు.

సాంకేతిక వర్గం పనితీరు : 

తను వర్క్ చేసే ప్రతీ సినిమాని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసే తమన్, గని కి మంచి స్కోర్ ఇచ్చాడు. గని టైటిల్ సాంగ్ బాగుంది. మిగతా పాటలు పరవాలేదు. జార్జ్ సి.విలియ‌మ్స్‌ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అతని విజువల్స్ ఆకట్టుకున్నాయి. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ పరవాలేదు. బాక్సింగ్ తో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

కిరణ్ కొర్రపాటి తీసుకున్న కథ రొటీన్ గానే ఉంది. కథనం మీద కూడా ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుండేది. కానీ మొదటి సినిమా అయినప్పటికీ కొన్ని సన్నివేశాలను బాగానే హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు పెట్టిన ఖర్చు సినిమా క్వాలిటీని పెంచాయి.

 ghani

జీ సినిమాలు సమీక్ష : 

స్పోర్ట్స్ డ్రామాలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఈ జోనర్ లో  సినిమా చేస్తే ఏదో కొత్తదనం చూపించాలి లేదా ఎమోషన్ ఎక్కువగా మిక్స్ చేసి వడ్డించాలి. లేదంటే ప్రేక్షకుడికి ఓ రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ‘జెర్సీ’ లో క్రికెట్ గేమ్ కంటే తండ్రి కొడుకుల ఎమోషన్ నే ఎక్కువగా హైలైట్ చేసి హిట్టు కొట్టాడు దర్శకుడు గౌతం. ఇక కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి మొదటి సినిమాకే ఈ జోనర్ సినిమా సెలెక్ట్ చేసుకోవడం సాహసమే. గతంలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన అనుభవంతో ఈ స్పోర్ట్స్ డ్రామాను కొంత వరకూ బాగానే డీల్ చేశాడు కానీ పూర్తి స్థాయిలో మెస్మరైజ్ చేయలేకపోయాడు.

 స్పోర్ట్స్ డ్రామాలో క్లైమాక్స్ ఏంటో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. స్పోర్ట్స్ డ్రామా అంటేనే జీరో నుండి హీరో కదా మరి. ఇలాంటి కథని డీల్ చేసి ఏదైనా కొత్తగా చెప్పగలిగితేనే  క్లిక్ అవుతుంది. లేదంటే రొటీన్ స్పోర్ట్స్ డ్రామా లిస్టులో చేరిపోతుంది. ‘గని’ విషయంలో అదే జరిగింది. గని క్యారెక్టర్ ఆర్క్ మీద డిపెండయి కథ రాసుకున్న దర్శకుడు కిరణ్ కొర్రపాటి  కెరీర్ లో కొందరు ప్లేయర్స్ పడే ఇబ్బందులను, గేమ్స్ వెనుక జరిగే పాలిటిక్స్ ను బాగానే చూపించాడు కానీ  బలమైన సన్నివేశాలు, ఫ్రెష్ సీన్స్ రాసుకుంటే అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది.  ఇక  సినిమాలో ఎమోషన్ కూడా  పండలేదు. ఎమోషన్ వర్కౌట్ అయ్యి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. ఉపేంద్ర క్యారెక్టర్ తో వచ్చే ఫ్లాష్ బ్యాక్ క్లిక్ అవ్వలేదు. లవ్ ట్రాక్  రొటీన్ అనిపిస్తుంది తప్ప ఇంప్రెస్ చేయలేదు.

వరుణ్ తేజ్ క్యారెక్టర్, తమన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, బాక్సింగ్ ఎపిసోడ్స్ , కొన్ని సన్నివేశాలు సినిమాకు హైలైట్స్ గా  నిలిచాయి. కథ -కథనం రొటీన్ అనిపించడం, బలమైన సన్నివేశాలు పెద్దగా లేకపోవడం , ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోవడం సినిమాకు మేజర్ మైనస్ అని చెప్పొచ్చు. ఈ కారణాల చేత బాక్సాఫీస్ మీద ‘గని’ కొట్టిన కిక్ జస్ట్ యావరేజ్ పంచ్ మాత్రమే అనిపించింది. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారు ఓసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5 / 5

 Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics