Movie Review - ఆరడుగుల బుల్లెట్

Friday,October 08,2021 - 05:06 by Z_CLU

నటీనటులు: గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు తదితరులు
దర్శకుడు : బి. గోపాల్
నిర్మాత : తండ్ర రమేష్
బ్యానర్ : జయ బాలాజీ రియల్ మీడియా
కథ, కథనం : వక్కంతం వంశీ
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : బాల మురుగన్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
సెన్సార్: U/A
రన్ టైమ్: 2 గంటల 21 నిమిషాలు
రిలీజ్ డేట్: అక్టోబర్ 8, 2021

మొన్ననే సీటీమార్ వచ్చింది. అంతలోనే గోపీచంద్ నుంచి మరో సినిమా థియేటర్లలో ప్రత్యక్షమైంది. అదే ఆరడుగుల బుల్లెట్. దాదాపు నాలుగేళ్ల కిందట రావాల్సిన ఈ సినిమా ఈరోజు వచ్చింది. మరి ఈ సినిమాతో గోపీచంద్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Aaradugula Bullet movie gopichand nayanthara

కథ

బాయ్ నెక్ట్స్ డోర్ లా కనిపించే హీరో (గోపీచంద్) ఉద్యోగం చేయడు. సరదాగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. కుటుంబం అంటే విపరీతమైన ప్రేమ. తండ్రి (ప్రకాష్ రాజ్) ఎంత తిట్టినా, అతడంటే అభిమానం, గౌరవం. ఇదే టైమ్ లో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు హీరో. ఓవైపు కుటుంబంలో జులాయిగా, మరోవైపు హీరోయిన్ వెంటపడే లవర్ బాయ్ లా టైమ్ గడిచిపోతుంటుంది. సరిగ్గా అదే టైమ్ లో హీరో తండ్రి భూమినిపై విలన్ (అభిమన్యు సింగ్) కన్నేస్తాడు. ఈ సమస్యను హీరో పరిష్కరించాడు? తండ్రి మనసును ఎలా
గెలుచుకున్నాడు అనేది ఆరడుగుల బుల్లెట్ స్టోరీ.

నటీనటుల పనితీరు

ఇలాంటి పాత్రలు గోపీచంద్ కు కొత్త కాదు. శౌర్యం, లక్ష్యం నుంచి మొదలుపెడితే చాలా సినిమాల్లో చేశాడు. ఇందులో కూడా అంతే ఈజీగా చేశాడు. ఓషేడ్ లో లవర్ బాయ్ గా, మరో షేడ్ లో యాక్షన్ మ్యేన్ గా గోపీచంద్ మంచి వేరియేషన్స్ చూపించాడు. హీరోయిన్ నయనతార అయితే స్క్రీన్ పై మెరిసింది. ఆమె గ్లామర్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. హీరో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ బాగా నటించాడు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం పాత్రలు ఓకే. విలన్ గా అభిమన్యు సింగ్ మాత్రం మెప్పించలేకపోయాడు. హీరో-విలన్ మధ్య వచ్చే సన్నివేశాల్లో అతడు తేలిపోయాడు. ఈ లోకాన్ని వీడిన జయప్రకాష్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణలను ఈ సినిమా మరోసారి ప్రేక్షకులకు చూపించింది.

టెక్నీషియన్స్ పనితీరు

ముందుగా దర్శకుడు బి.గోపాల్ గురించి చెప్పుకోవాలి. ఎంతో సీనియారిటీ ఉండి, ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ దర్శకుడు.. ఆరడుగుల బుల్లెట్ లో మాత్రం తన మెరుపులు చూపించలేకపోయాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాల్లో చెప్పుకుంటున్నట్టు, అప్పట్లో బి.గోపాల్ సినిమాల్లో ప్రత్యేకంగా కొన్ని ఎపిసోడ్స్ హైలెట్స్ గా నిలిచేవి. సినిమాను నిలబెట్టేవి. అలా సినిమాను పైకి లేపే ఎపిసోడ్స్ ఆరడుగుల బుల్లెట్ లో కనిపించలేదు. నెరేషన్ ఫ్లాట్ గా అనిపిస్తుంది. అది కథ-స్క్రీన్ ప్లే అందించిన వక్కంతం వంశీ మిస్టేకా లేదా దర్శకుడిదా అనేది వాళ్లిద్దరే చెప్పాలి. మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు పెద్దగా ఆకట్టుకోవు. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ యాక్షన్ ఎపిసోడ్స్ లో బాగుంది. జయబాలాజీ రియల్ మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టు ఉన్నాయి.

Aaradugula Bullet gopichand nayanthara 2

జీ సినిమాలు రివ్యూ

స్టూడెంట్ నంబర్ వన్ సినిమా గుర్తుందా..? అందులో హీరోని తండ్రి అసహ్యించుకుంటాడు. పోనీ అశోక్ సినిమా గుర్తుందా? అందులో కూడా హీరోని తండ్రి కోప్పడుతుంటాడు. ఇలా హీరోల్ని తండ్రులు తిట్టడం, ఇంటర్వెల్ కో, క్లైమాక్స్ కో హీరో గొప్పదనం తెలుసుకొని పొగడ్డం అనాదిగా చూస్తున్నాం. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఆరడుగుల బుల్లెట్ కూడా ఆ కాలంలో రావాల్సిన సినిమానే. నిజానికి ఈ సినిమా కొన్నేళ్ల కిందట రావాల్సిన మూవీ. బహుశా.. అప్పుడే వచ్చి ఉంటే అప్పటి టేస్ట్ కు తగ్గట్టు క్లిక్ అయ్యేదేమో. వరల్డ్ కంటెంట్ మొత్తం మొబైల్ ఫోన్లలోకి వచ్చేసి, కొత్తకొత్త కాన్సెప్టులు, సినిమాలు చూస్తున్న ఈ తరం ప్రేక్షకులకు మాత్రం ఈ ‘బుల్లెట్’ దిగదు.

ఇందులో హీరో జులాయి. పనీపాట లేకుండా తిరుగుతుంటాడు. కుటుంబం అంటే మాత్రం చాలా ఇష్టం. కుటుంబానికి ఏదైనా ఆపద వస్తే తట్టుకోలేడు. వెంటనే విలన్లను చితకబాదేస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ మనసు గెలుచుకోవడంతో పాటు. తండ్రికి కూడా దగ్గరైపోతాడు. ఈ కథలో కాస్త ఎంజాయ్ చేసే స్టఫ్ ఏదైనా
ఉందంటే అది యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ నచ్చడానికి కూడా ఓ లాజిక్ ఉంది.

ఆవారాగా తిరిగే గోపీచంద్, అతడి ఎక్స్ ప్రెషన్స్ తో పెద్దగా కనెక్ట్ అవ్వలేం. హీరోయిన్ వెంట పడడం, కొన్ని టీజింగ్ సీన్స్ కాస్త ఓల్డ్ స్కూల్ ప్యాట్రన్ అనిపిస్తాయి. ఇవన్నీ దాటి ఎప్పుడైతే మ్యాచో హీరో తన ఒరిజినల్ యాక్షన్ లుక్ లోకి వచ్చేస్తాడో అప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది. అందుకేనేమో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయని అనిపిస్తుంది.

బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అసలు కథను ఇంటర్వెల్ టైమ్ కే మొత్తం చెప్పేస్తారు. కొసరు కథ చెప్పడానికి పోస్ట్-ఇంటర్వెల్ టైమ్ అంతా తీసుకున్నారు. సినిమాకొచ్చాం కాబట్టి ఇంకాసేపు కూర్చోవాలి, ఓ 2 పాటలు, ఫైట్లు చూడాలి అన్నట్టుంటుంది సెకెండాఫ్. ఇలాంటి కథ, పాత ట్విస్టులతో కూడిన నెరేషన్ తో ఈ కాలం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టమే. అయితే ఉన్నంతలో ఈ సినిమాకు క్రౌడ్ పుల్లర్స్ ఎవరంటే, అది గోపీచంద్-నయనతార మాత్రమే.

గోపీచంద్ యంగ్ గా కనిపించాడు. అతడి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బాగుంది. యాక్షన్ పార్ట్ ఇరగదీశాడు. 5 ఏళ్ల కిందట నయనతార చాలా అందంగా ఉంది. లేటెస్ట్ సినిమాల్లో చూస్తున్న నయనతార కంటే.. ఆరడుగుల బుల్లెట్ లో నయనతార చాలా చలాకీగా, గ్లామరస్ గా కనిపించింది. గోపీచంద్-నయనతార జోడీ కూడా చాలా ఎట్రాక్టివ్ గా ఉంది. మణిశర్మ తన పాటలతో కంటే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగా ఆకట్టుకున్నాడు. కాకపోతే ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, రౌడీ ఇన్ స్పెక్టర్, లారీ డ్రైవర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన బి.గోపాల్ నుంచి ఆ స్థాయికి తగ్గ మెరుపులు ఈ సినిమాలో కనిపించలేదు.

ఓవరాల్ గా.. చాలా ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఆరడుగుల బుల్లెట్ సినిమాను గోపీచంద్-నయన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కోసం, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఓసారి చూడొచ్చు. కొత్త కథ, ఎంగేజ్ చేసే కథనం కోరుకునేవాళ్లకు మాత్రం నిరాశ తప్పదు.

రేటింగ్2.25/5