Movie Review - కొండపొలం

Friday,October 08,2021 - 02:31 by Z_CLU

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోటా శ్రీనివాసరావు, సాయి చంద్, హేమ, అన్నపూర్ణమ్మ తదితరులు.

బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్

సంగీతం : ఎంఎం కీరవాణి

సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వీఎస్

కథ : సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి

ఎడిటర్ : శ్రావన్ కటికనేని

నిర్మాత : సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి

స్క్రీన్ ప్లే – దర్శకుడు:  క్రిష్ జాగర్లమూడి

నిడివి : 142 నిమిషాలు

విడుదల తేది :  8 అక్టోబర్ 2021

‘ఉప్పెన’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత హీరో వైష్ణవ్ తేజ్ ని పెట్టి దర్శకుడు క్రిష్ తీసిన ‘కొండపొలం’ ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. ‘కొండపొలం’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకుందా? జీ సినిమాలు రివ్యూ.

kondapolam movie review in telugu zeecinemalu
కథ :

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూసే రవీంద్ర(వైష్ణవ్ తేజ్) అనుకోకుండా వాళ్ళ కుల వృత్తి అయిన గొర్రెల పెంపకం ఎంచుకొని కొండ పొలం చేయడానికి రెడీ అవుతాడు.  గొర్రె మందను తీసుకొని ఊరి వాళ్ళతో కలిసి అడవిలోకి వెళ్లిన రవీంద్ర అడవి గురించి అందులో ఉండే వ్యక్తులు, జీవుల గురించి తెలుసుకుంటాడు.

ఈ క్రమంలో తనతో కలిసి కొండపొలం చేయడానికి వచ్చిన ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. ఓబులమ్మ కూడా తనని ఇష్టపడుతుంది. ఇక అడవిలో పులుల నుండి అలాగే జనాల నుండి తమ గొర్రెలను ఎలా కాపాడుకున్నాడు..?  ఫైనల్ గా అడవిలో జీవితం గురించి తెలుసుకున్న రవీంద్ర ఎట్టకేలకు IFS ఆఫీసర్ గా ఎలా మారాడు ? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే హీరోగా తన నటనతో మంచి మార్కులు అందుకున్న వైష్ణవ్ తేజ్ ఇందులో రవీంద్ర పాత్రతో కూడా ఆకట్టుకున్నాడు. ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో వైష్ణవ్ నటన ఆకట్టుకుంటుంది. ఓబులమ్మ పాత్రలో రకుల్ ఒదిగిపోయింది. ఈ పాత్ర కోసం కట్టు, బొట్టు, యాస మార్చిన రకుల్ ఆ పాత్రతో మెప్పించింది. సాయిచంద్ అద్భుత నటన కనబరిచారు. ఎమోషనల్ సీన్స్ లో అతని నటన హైలైట్. హీరో తాత పాత్రలో కోటా శ్రీనివాసరావు ఆకట్టుకున్నారు.  రవిప్రకాష్, ప్రభు, హేమ  లకి మంచి పాత్రలు దక్కడంతో మెప్పించారు.

కథలో అక్కడక్కడా నవ్వించే కామిక్ రోల్స్ లో రచ్చ రవి, అశోక్ అలరించారు. ఒక సన్నివేశంలో మహేష్ విట్ట నటన బాగుంది. తక్కువ నిడివి గల పాత్రలే అయినప్పటికీ మహేష్ ఆచంట, యాంకర్ శ్యామల చేసిన పాత్రలు కూడా రిజిస్టర్ అయ్యాయి. మిగతా నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు టెక్నీకల్ గా మంచి సపోర్ట్ అందింది. కీరవాణి మ్యూజిక్, జ్ఞాన శేఖర్ విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా కొన్ని సాధారణ సన్నివేశాలకు కూడా కీరవాణి ఇచ్చిన భారీ ఎలివేషన్ ప్లస్ అయింది. కాకపోతే కొన్ని చోట్ల అదే చిన్న మైనస్ అనిపించింది కూడా. వికారాబాద్ లొకేషన్స్ ఎంచుకొని అడవి అందాలను తన కెమెరాలో బంధించి ఆకర్షించాడు జ్ఞాన శేఖర్. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని చోట్ల డ్రాగ్ అనిపించినా కథకి తగ్గట్టుగా సినిమాను ఎడిట్ చేశాడు.

రాజ్ కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. పాత్రలకు తగినట్టుగా ఐశ్వర్యా రాజీవ్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. వెంకట్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కథకి పాత్రకి తగ్గట్టుగా కంపోజ్ చేశారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి కథ -మాటలు  ఆకట్టుకున్నాయి. క్రిష్ జాగర్లమూడి స్క్రీన్ ప్లే లో కొన్ని లోపాలు కనిపించాయి. ఎందుకో తను నమ్మిన కథని మెప్పించేలా ఒప్పించలేకపోయాడు. కానీ తన అనుభవంతో కొన్ని సన్నివేశాలని బాగా మలిచి తెరకెక్కించాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

kondapolam movie review in telugu zeecinemalu

జీ సినిమాలు సమీక్ష :

దర్శకుడు క్రిష్ కి ఎప్పట్నుండో అటవీ నేపథ్యంలో ఓ అడ్వెంచరస్ సినిమా చేయాలని ఉంది. గతంలో అతడు అడవిని జయించాడు అనే నవలని తీసుకొని సినిమా చేయాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ‘కొండపొలం’ నవలతో తన కల నెరవేర్చుకున్నాడు క్రిష్. ఈ పుస్తకం చదువుతున్నప్పుడే తన మైండ్ లో విజువల్స్ వేసేసుకున్నాడు.

ఉన్నంతలో తన అనుభవంతో కొంత వరకూ మెప్పించాడు. కానీ పుస్తకంలో కనిపించిన కథను స్క్రీన్ పైకి తీసుకురావడానికి లిబర్టీ తీసుకున్నాడు. ముఖ్యంగా కొండపొలం నవలలో లేని ఓబులమ్మ అనే పాత్రని క్రియేట్ చేసి హీరో -హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేశాడు. అలాగే వారిద్దరి మధ్య కమర్షియల్ ఎలిమెంట్ కోసం ఒక రొమాంటిక్ సాంగ్ కూడా పెట్టాడు. అవి మినహాయిస్తే మిగతా సినిమా అంతా నిజాయితీగా తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.

‘కొండపొలం’ నవలను సినిమాగా తీసే ఆలోచన రావడం దాన్ని ఇంప్లిమెంట్ చేసి కోవిడ్ పరిస్థితుల్లో మేకింగ్ చేయడం లాంటి విషయాల్లో క్రిష్ ని మెచ్చుకోవాలి. కథ వరకూ మాత్రమే కాకుండా రైటర్  సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డితో సీమ యసతో సంభాషణలు కూడా రాయించుకోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. ఆ యాస పాత్రలు కనెక్ట్ అవ్వడానికి కలిసొచ్చింది. సినిమా ఆరంభంలో ఇంటర్వ్యూ సన్నివేశంలో నువ్వు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావ్? అనే ప్రశ్న రవీంద్ర కి ఎదురవుతుంది. దానికి అడవి తనకి అన్ని నేర్పించిందని సమాధానం చెప్తాడు రవీంద్ర. ఇదే సినిమా కథాంశం. ఒక చిన్న కుటుంబం నుండి డిగ్రీ చదివి ఉద్యోగం కోసం తిరుగుతూ భయపడుతూ ఉండే ఓ కుర్రాడు అడవిలో ఏం నేర్చుకున్నాడు? అనేది క్లియర్ కట్ గా సినిమాలో చూపించాడు దర్శకుడు. కాకపోతే దాన్ని ఇంకాస్త డెప్త్ లో చూపించి ఉంటే బాగుంటుంది.

ఇక దర్శకుడు క్రిష్ ఎంచుకున్న కథలు బాగుంటాయి. చూసిన తర్వాత మాట్లాడుకునేలా ఉంటాయి. కాకపోతే ఎగ్జిక్యూషన్ లోనే లోపాలు కనిపిస్తుంటాయి. ఆ లోపాలే క్రిష్ సినిమాలను నెక్స్ట్ లెవెల్ కి వెళ్లకుండా చేస్తాయి. కొండపొలంలో కూడా ఎగ్జిక్యూషన్ లోపాలు కనిపించాయి. తక్కువ టైంలో హడావుడిగా చేసేయడంతో కంటెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉండకపోవచ్చు. కానీ క్రిష్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే క్వాలిటీ మాత్రం మిస్ అవ్వలేదు.

ఇక అడవి నేపథ్యంలో సినిమా అంటే అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ప్లాన్ చేసుకోవాలి.  చెట్లు, పుట్టలు, వారి జీవన విధానం మీదే ఎక్కువగా సినిమాను నడిపిస్తే బోర్ కొట్టేస్తుంది. కొండపొలంకి కొంతవరకు అదే మైనస్. క్రిష్ కొన్ని ఎలిమెంట్స్ బాగానే ప్లాన్ చేసుకున్నా ఇంకా వెలితి కనిపిస్తుంది.

కథ-క్యారెక్టర్స్, కొన్ని సన్నివేశాలు, కీరవాణి మ్యూజిక్ సినిమాకు మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి. కథనం, స్లో నెరేషన్, అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు మైనస్. ఓవరాల్ గా కొండపొలం క్రిష్ నుండి వచ్చిన మంచి ప్రయత్నం. కాకపోతే పూర్తి స్థాయిలో మెప్పించదు. ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.75 /5