మహర్షి మూవీ రివ్యూ

Thursday,May 09,2019 - 02:25 by Z_CLU

నటీనటులు : మహేష్ బాబు , పూజా హెగ్డే , అల్లరి నరేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయసుధ, రావు రమేష్, వెన్నల కిషోర్ తదితరులు

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

ఛాయాగ్రాహణం : కె.యు. మోహనన్‌

ఎడిటింగ్ : కె.ఎల్‌. ప్రవీణ్‌

పాటలు : శ్రీమణి

నిర్మాతలు : దిల్ రాజు, అశ్వనీదత్ , పి.వి.పి

రచన :   హరి, వంశీ పైడిపల్లి, సొలొమాన్

దర్శకత్వం : వంశీ పైడిపల్లి

నిడివి : 178 నిమిషాలు

విడుదల తేది : 9 మే 2019

 

‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు ‘మహర్షి’ తో 25వ సినిమాకు చేరుకున్నాడు. మరి వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన మహర్షి సూపర్ స్టార్ కెరీర్ లో స్పెషల్ మూవీ గా నిలుస్తుందా..? తన 25 సినిమాతో మహేష్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడా..? జీ సినిమాకు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ


కథ :

చిన్నతనం నుండి నాన్న (ప్రకాష్ రాజ్) ఫెయిల్యూర్ చూసి సక్సెస్ కొట్టాలనే కసితో ఉంటాడు రిషి (మహేష్ బాబు). సక్సెస్ దిశగా అడుగులేసేందుకు ఎంటెక్ కాలేజిలో జాయిన్ అవుతాడు. అక్కడే రిషికి రవి(అల్లరి నరేష్), పూజ(పూజా హెగ్డే) పరిచమవుతారు. అలా పరిచయమైన ఆ ముగ్గురు మంచి స్నేహితులవుతారు. ఈ ట్రావెలింగ్ లో పూజా, రిషి ప్రేమలో పడుతుంది. పూజా ప్రపోజల్ కి ఒకే చెప్పినట్టే చెప్పి ఆ రిలేషన్ షిప్, తన సక్సెస్ కి అడ్డుతగులుతుందేమోనన్న ఉద్దేశ్యంతో పూజకే బ్రేకప్ చెప్పేస్తాడు రిషి.

పూజ విషయంలోనే రిషి, రవి కూడా దూరమవుతారు. ఇక ఎంటెక్ పూర్తి చేసిన రిషి తన ప్రాజెక్ట్ ద్వారా యూ.ఎస్ లో ఉన్న ఓ కంపెనీ లో ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత ఆ కంపెనీకి సి.ఈ.ఓ అవుతాడు. అయితే రిషి చేసిన ఈ సక్సెస్ జర్నీలో నా అనుకునే వారికి దూరమవుతాడు. అందులో రవి ఒకడు. తన ప్రొఫెసర్ ద్వారా రవి గురించి తెలుసుకొని అతనిని వెతుక్కుంటూ రామాపురం వెళ్ళిన రిషి ఆ ఊరి సమస్యకు ఎలా చెక్ పెట్టాడు.. రిషి అనే వ్యక్తి ఎలా మహర్షిగా మారాడనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

హీరోగా తను ఎంచుకున్న క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు సూపర్ స్టార్. రిషి క్యారెక్టర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. మూడు డిఫరెంట్ లుక్స్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేసిన మహేష్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో యాక్టర్ గా మరోసారి అదరగొట్టాడు.

పూజా హెగ్డే గ్లామర్ తో సినిమాకు ప్లస్ అయ్యింది. కానీ పెద్దగా స్కోప్ లేని క్యారెక్టర్ కావడంతో పెర్ఫార్మెన్స్ లో జస్ట్ పరవాలేదనిపించుకుంది. అల్లరి నరేష్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. కథలో కీలకమైన సపోర్టింగ్ క్యారెక్టర్ దొరకడంతో నటుడిగా మరోసారి శెభాష్ అనిపించుకున్నాడు. జగపతి బాబు విలనిజం ప్రేక్షకులకు రొటీన్ అనిపిస్తుంది.

ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎప్పటిలాగే అనిపించినా రెండు మూడు సన్నివేశాల్లో మంచి ఎమోషన్ పండించాడు. మంచి క్యారెక్టర్ దొరకడంతో జయసుధ కూడా మెప్పించింది. ఊరి పెద్ద క్యారెక్టర్ లో సాయి కుమార్ ఎప్పటిలాగే పరకాయ ప్రవేశం చేసాడు. కాకపోతే ఆ క్యారెక్టర్ లో డెప్త్ లేదు. వెన్నెల కిషోర్ ని జస్ట్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కోసమే తీసుకోవడంతో అతని నుండి ఊహించే కామెడీ మిస్ అవుతాం. ముకేష్ రుషి , కమల్ కామరాజు మిగతా నటీ నటులంతా వారి వారి పరిధిలో నటించారు.

 

సాంకేతికవర్గం పనితీరు:

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. కాకపోతే ఈసారి అన్ని పాటలు వర్కౌట్ అవ్వలేదు. దేవి అందించిన పాటల్లో ‘చోటి చోటి బాతే’, ‘పదరా పదరా’ , ‘ఇదే కథ ఇదే కథ’ పాటలు ఆకట్టుకున్నాయి. కొన్ని ముఖ్య సందర్భాలో వచ్చే నేపథ్య సంగీతం బాగుంది. పాటలకు శ్రీమణి సాహిత్యం బలం చేకూర్చింది. ముఖ్యంగా ‘పదరా పదరా’ పాటను తన సాహిత్యంతో మంచి పాటగా మలిచాడు.

సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్. ఎట్రాక్ట్ చేసే విజువల్స్ తో సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాడు మోహనన్. కె.ఎల్‌. ప్రవీణ్‌ ఎడిటింగ్ పరవాలేదు. కానీ కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి సినిమా నిడివి తగ్గిస్తే బాగుండేది. సెకండ్ హాఫ్ లో రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ సినిమాకు మరో హైలైట్. సునీల్ బాబు ఆర్ట్ వర్క్ బాగుంది. రాజు సుందరం కొరియోగ్రఫీ మైనస్.

కొన్ని సందర్భాల్లో వచ్చే సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ తో రైతుల గురించి, వ్యవసాయం గురించి మహేష్ చెప్పిన డైలాగ్స్ క్లాప్స్ కొట్టించాయి. హరి-సోలొమాన్-వంశీ రాసుకున్న కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. మూడు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించడంతో నిర్మాణ విలువలు భారీ స్థాయిలో ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఈ సమ్మర్ లో అన్నీ ఎమోషనల్ సినిమాలే వస్తున్నాయి. మజిలీ, జెర్సీ, చిత్రలహరి.. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మహర్షి. అవును.. ఇది కూడా కంప్లీట్ ఎమోషనల్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ లెక్కలు వేసుకోకుండా పూర్తిగా కథపై దృష్టిపెట్టి తీసిన ఈ సినిమా ఎమోషనల్ గా అందర్నీ ఆకట్టుకుంటుంది.

టైటిల్ కు తగ్గట్టే ఇది ఒక సక్సెస్ జర్నీ. రిషి అనే ఓ మధ్యతరగతి కుర్రాడు మహర్షిగా ఎలా మారాడనేది ఈ స్టోరీ. ఈ సక్సెస్ జర్నీని మరింత బలంగా చూపించేందుకు సీఈవో అనే పాత్రను, రైతు సమస్యను ప్రధాన ఆయుధాలుగా చేసుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. మిగతావన్నీ యాడ్-ఆన్స్ మాత్రమే. కాకపోతే వాటిని కూడా అందంగా చూపించగలిగాడు. హీరోయిన్ తో ప్రేమాయణం కూడా ఈ కోవలోకే వస్తుంది. కథతో పెద్దగా సంబంధం లేకపోయినా ఇన్-బిల్డ్ చేసి బాగా చూపించాడు దర్శకుడు.

ముందే చెప్పుకున్నట్టు ఇది పూర్తిగా ఎమోషనల్ జర్నీ. తండ్రి-కొడుకు, తల్లి-కొడుకు, స్నేహితులు,  రైతులతో సన్నివేశాలు లాంటి సీన్స్ ను బాగా చూపించారు. మూవీలో భావోద్వేగాలన్నీ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. సినిమా లైన్ సింపుల్. కానీ దాని చుట్టుూ దర్శకుడు వంశీ పైడిపల్లి రాసుకున్న సన్నివేశాలు బాగున్నాయి. వ్యవసాయ రంగం, రైతు సమస్యలపై ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. మహర్షిలో కూడా అదే చర్చించారు. కాకపోతే ఆ పాయింట్ ను చెప్పిన విధానం, మహేష్ నటన సినిమాకు ప్లస్ అయ్యాయి.

మహర్షి ఫస్ట్ హాఫ్ చకచకా నడిచిపోతుంది. ఎక్కడా బోర్ కొట్టించదు. దీనికి కారణం కాలేజ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మొత్తం బాగా వచ్చింది. స్టూడెంట్ గా మహేష్ మేనరిజమ్స్ సింప్లీ సూపర్బ్. సేమ్ టైం అమెరికన్ కంపెనీ సీఈఓగా కూడా మహేష్ హుందాగా కనిపించాడు. ఇక మూడో గెటప్ లో అంతా అనుకుంటున్నట్టు మహేష్ ఫుల్ లెంగ్త్ రైతుగా కనిపించకపోయినా, రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా బాగా నటించాడు. ఓవరాల్ గా ఈ సినిమాకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అతడే. ఈ సినిమాకు ప్లస్ కూడా అతడే. సీఈవో  పాత్రలో మహేష్ స్థానంలో మరో హీరోను ఊహించుకోలేం.

సెకెండాఫ్ లో మాత్రం కాస్త ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో చాలా సేపు సీట్లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు హీరోహీరోయిన్లు తిరిగి కలవడం అనే కాన్సెప్ట్ ను సరిగ్గా చూపించలేకపోయారు. దీనికి తోడు విలన్ ను బలంగా చూపించలేకపోవడం కూడా మైనస్ అయింది. సినిమాలో జగపతిబాబును చూస్తే శ్రీమంతుడులో రవికాంత్ పాత్ర గుర్తొస్తుంది. ఉన్న కాస్టింగ్ లో మహేష్ తర్వాత బాగా ఆకట్టుకున్నది అల్లరినరేష్ మాత్రమే. అతడి కెరీర్ కు ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఓవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ ను అతడు నిరభ్యంతరంగా పోషించుకోవచ్చు.

ఓవరాల్ గా మహర్షి సినిమా ఈ సమ్మర్ లో ప్రేక్షకులకు బాక్సాఫీస్ వద్ద బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. థియేటర్లలో రిషి ఎమోషనల్ జర్నీని చూసి ఎంజాయ్ చేయండి.

బాటమ్ లైన్ : ఎమోషనల్ రిషి

రేటింగ్ : 3 / 5