'చినబాబు' మూవీ రివ్యూ

Friday,July 13,2018 - 03:15 by Z_CLU

నటీనటులు : కార్తి, సయేషా, సత్యరాజ్, ప్రియ భవానీ శంకర్,  భానుప్రియ, సూరి తదితరులు

కెమెరా : వేల్ రాజ్

సంగీతం : డి.ఇమ్మాన్

సహ నిర్మాతలు : సి.హెచ్.సాయికుమార్ రెడ్డి-రాజశేఖర్ కర్పూర సుందర పాండ్యన్

నిర్మాతలు : సూర్య-మిర్యాల రవీందర్ రెడ్డి

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : పాండిరాజ్

సెన్సార్ : U

విడుదల తేదీ : 13 జులై 2018

 

కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒకటే ఆలోచన. ఆడియన్స్ కు కొత్తగా ఏమైనా అందించామా లేదా..? కార్తి ఫిక్స్ డ్ ఫార్ములా ఇది. అలాంటి విలక్షణ నటుడి నుంచి చినబాబు అనే సినిమా వచ్చింది. ఇందుల ో కూడా ఓ స్పెషాలిటీ ఉంది. ఇప్పటివరకు కార్తి చేయని క్యారెక్టర్ ఉంది. టోటల్ సినిమాలో ఓ గమ్మత్తు ఉంది. జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ :

రుద్రరాజు(సత్య రాజ్)ది పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల తర్వాత మగ పిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వేళ ఆఖరివాడుగా కృష్ణంరాజు(కార్తి) పుడతాడు. అందుకే చినబాబు అవుతాడు. పొలం బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటాడు చినబాబు. వ్యవసాయం అనేది వృతి కాదు… జీవన విధానం అని నమ్మే చినబాబు పల్లెటూళ్ల నుండి సిటీకెళ్ళిన వాళ్లంతా ఎప్పటికైనా సొంత ఊరిలో రైతులుగా స్థిరపడాలనే లక్ష్యంతో రైతుగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో జాలీ సోడా యజమాని నీల నీరధ(సాయేషా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.

కానీ చినబాబు అక్కయ్యలకు వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లుంటారు. మేనమామగా మరదళ్లను చిన్నతనం నుండి అల్లారుముద్దుగా చూసుకుంటాడు. అయితే తనకు నచ్చిన అమ్మాయిని కాకుండా తమ కూతురునే పెళ్లి చేసుకోవాలని చినబాబుతో గొడవకు దిగుతారు ఇద్దరు అక్కలు.

మరోవైపు కులరాజకీయాలు నడుపుతూ ఊరిలో పెద్దమనిషిగా ఉండే సురేందర్ రాజు(శత్రు)ని ఒక స్టూడెంట్ హత్య కేసులో జైలుకు పంపిస్తాడు చినబాబు. పగబట్టిన సురేందర్ రాజు చినబాబుని చంపే ప్రయత్నాల్లో ఉంటాడు. చినబాబు పెళ్ళి మేటర్ తో కుటుంబంలో కలతలొస్తాయి. మరి చినబాబు తన అక్కయ్యలను ఒప్పించి తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడా… చివరికి సురేందర్ రాజు నుంచి ఎలా తప్పించుకున్నాడు… కుటుంబం మొత్తాన్ని ఎలా కలిపాడనేది మిగతా కథ…

నటీనటుల పనితీరు :

కెరీర్ లో ఫస్ట్ టైం రైతుగా కనిపించిన కార్తి చినబాబుగా బెస్ట్ అనిపించుకున్నాడు. క్యారెక్టర్ ఏదైనా తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసే  కార్తి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. సాయేషా పరవాలేదనిపించుకుంది. సత్యరాజ్ మరోసారి కుటుంబ పెద్దగా ఆకట్టుకున్నాడు.

సినిమాలో సూరి కామెడి వర్కౌట్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశాడు. సత్యరాజ్ భార్యలుగా ప్రియభవాని శంకర్, భానుప్రియ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శత్రు తన విలనిజంతో సినిమాకు ప్లస్ అయ్యాడు.

 

టెక్నిషియన్స్ పనితీరు:

ఇమ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ కి మంచి నేపథ్య సంగీతం అందించాడు. పాటలు ఆకట్టుకోలేకపోయాయి. వేల్ రాజా సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి లోకేషన్స్ ను మరింత అందంగా చూపించాడు. పాటల చిత్రీకరణ బాగుంది. ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. పాండిరాజ్ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ:

ఈ సినిమా రైతులకు అంకితం, రైతుల కోసమే ఈ సినిమా అంటూ రిలీజ్ కు ముందు నుంచి చెబుతూ వచ్చాడు కార్తి. కానీ ఇది కేవలం రైతుల సినిమా మాత్రమే కాదు. కుటుంబ నేపథ్యం, మనుషుల మధ్య బాంధవ్యాలతో తీసిన సినిమా. ఓ పెద్ద పల్లెటూరు.. అందులో పెద్ద కుటుంబం.. చిన్న చిన్న మనస్పర్థలు.. ఊరిలో రాజకీయాలు… ఇలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా సాగిపోతుంది చినబాబు వ్యవహారం.

ప్రచారాన్ని సైడ్ ట్రాక్ పట్టించినా, సినిమాను మాత్రం రైట్ ట్రాక్ లో నడిపించాడు కార్తి. కెరీర్ స్టార్టింగ్ నుంచి తను పోషించే పాత్రలకు ఆత్మగా మారే ఈ నటుడు, చినబాబుగా కట్టిపడేశాడంతే. కేవలం మేకోవర్ మాత్రమే కాదు, మేనరిజమ్స్ లో కూడా కార్తి బెస్ట్ అనిపించుకున్నాడు.

ఫ్యామిలీ మధ్య ఉండే ఎమోషన్స్ తో ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. స్క్రీన్ పై పాత్రలతో ఆడియన్స్ ను లింక్ చేస్తే చాలు, సినిమా హిట్. సరిగ్గా ఇక్కడే నూటికి నూరు మార్కులు కొట్టేశాడు చినబాబు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు లీనమైపోతాడు. నిజానికి ఇందులో ఎమోషన్స్, సన్నివేశాలు, నేపథ్యం.. చాలా వరకు మన తెలుగు సినిమాల్లో చూసినవే. కానీ బలమైన సన్నివేశాలు, కట్టిపడేసే రీ-రికార్డింగ్, మంచి డైలాగ్ లు, యాక్షన్ ఎపిసోడ్స్.. చినబాబును నిలబెట్టాయి.

రైతుపై తనకున్న గౌరవాన్ని చాలా సందర్భాల్లో తెలియజేశాడు దర్శకుడు.. ముఖ్యంగా వ్యవసాయం అంటే వృతి కాదు జీవన విధానం అంటూ.. ఒక్క రోజు రైతుగా బ్రతికి చూడు లేదా రైతుతో ఉండి చూడు అనే డైలాగ్స్ రైతు గొప్పతనం తెలియజేసేలా ఉన్నాయి. సినిమా ప్రారంభం లోనే హీరో క్యారెక్టర్ ఏంటనేది ఒకే ఒక్క సీన్ లో చెప్పేశాడు దర్శకుడు. ఆ ఒక్క సీన్ తో కనెక్ట్ అయిన ఆడియన్స్, చివరి వరకు అదే ఇంట్రెస్ట్ తో సినిమా చూస్తారు. అదే చినబాబు ప్రత్యేకత. విన్నింగ్ సీక్రెట్ కూడా.

కార్తి క్యారెక్టర్ , ఫ్యామిలీ ఎమోషన్స్ , అక్కడక్కడా వచ్చే డైలాగ్ కామెడి, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్స్ కాగా తమిళ నేటివిటీ , సాంగ్స్ బాగాలేకపోవడం, అక్కడక్కడ వచ్చే రొటీన్ సీన్లు సినిమాకు మైనస్ అనిపిస్తాయి.

ఫైనల్ గా ఆద‌ర్శ రైతుగా.. గొప్ప త‌మ్ముడిగా.. మంచి మేనమామగా.. అల్ల‌రి ప్రేమికుడిగా.. కుటుంబ భాద్యతలను మోసే కొడుకుగా.. ‘చినబాబు’  మనల్ని అలరిస్తాడు.

బాటమ్ లైన్ – పెద్ద మనసున్న చినబాబు

 రేటింగ్ : 3 /5