వైఫ్ ఆఫ్ రామ్ మూవీ రివ్యూ

Friday,July 20,2018 - 01:55 by Z_CLU

నటీనటులు : మంచు లక్ష్మీ ప్రసన్న, సామ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ
విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్
కాస్ట్యూమ్స్ : అజబ్అలీ అక్బర్
ఎడిటర్ : తమ్మిరాజు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భాస్కర్
సంగీతం : రఘు దీక్షిత్
మాటలు : సందీప్ రెడ్డి గంటా
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణ
నిర్మాణం- పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి ప్రసన్న మంచు
రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి

సెన్సార్ – U/A

రిలీజ్ డేట్ – జులై 20, 2018

 

రెండున్నర గంటల సినిమాలో చివరివరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆడియన్ కు ఇప్పుడు అంతా తెలిసిపోతుంది. సినిమా స్టార్ట్ అయిన అర్థగంటకే క్లైమాక్స్ కనిబెడుతున్నాడు. ఇలాంటి టైమ్ లో ప్రేక్షకులముందుకొచ్చింది వైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమా. మరి ఈ  సినిమా
చివరి వరకు ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టగలిగిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

 

కథ
సినిమా ఓపెనింగ్ లోనే పెద్ద యాక్సిడెంట్. హాస్పిటల్ లో దీక్ష (మంచు లక్ష్మి). తృటిలో చావు నుంచి తప్పించుకుంటుంది. ఆ ప్రమాదంలో ఆమె భర్త మరణిస్తాడు. భర్త (రామ్) యాక్సిడెంట్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లయిట్ ఇస్తుంది దీక్ష. కానీ ఈ కేసును ఎస్ఐ సత్యం (శ్రీకాంత్ అయ్యంగార్) లైట్ తీసుకుంటాడు. తన దగ్గర కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్ రమణాచారి (ప్రియదర్శి)కి ఈ కేసు అప్పగిస్తాడు.

పోలీసులు పట్టించుకోకపోవడంతో తనే స్వయంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది దీక్ష. ఈ విషయంలో ఆమెకు రమణాచారి సహాయం చేస్తుంటాడు. సాధారణంగా పోలీస్ కేసుల్లో పరిశోధన ఎలా జరుగుతుందో, ఎలాంటి విషయాల్లో కేర్ తీసుకోవాలో అన్నీ ఆమెకు చెబుతుంటాడు. ఈ క్రమంలో దీక్షకు సంబంధించి ఓ షాకింగ్ మేటర్ తెలుసుకుంటాడు రమణాచారి. కానీ అప్పటికే దీక్ష, తన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి, అనుకున్నది సాధిస్తుంది.

ఇంతకీ దీక్ష ఎవరు..? ఆమె భర్తను ఎవరు చంపుతారు..? రమణాచారి తెలుసుకున్న ఆ పచ్చి నిజం ఏంటి..? ఇది సింపుల్ గా వైఫ్ ఆఫ్ రామ్ స్టోరీ

నటీనటుల పనితీరు
మంచు లక్ష్మీ ప్రసన్న సినిమా ఇది. సినిమాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆమె తన భుజాలపై మోశారు. వైఫ్ ఆఫ్ రామ్ అనే టైటిల్ కు న్యాయం చేస్తూ లక్ష్మీ ఇందులో చక్కగా నటించారు. ఆమె యాక్టింగ్ కు నూటికి నూరు మార్కులు గ్యారెంటీ. బిడ్డ, భర్తను కోల్పోయినప్పుడు, తనపై దాడి జరిగినప్పుడు, క్లైమాక్స్ లో విలన్ చంపేటప్పుడు లక్ష్మీప్రసన్న నటన సింప్లీ సూపర్బ్.

మంచు లక్ష్మీప్రసన్న తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్ర ఎస్ఐ సత్యం. శ్రీకాంత్ అయ్యంగార్ ఈ క్యారెక్టర్ కు ఓ స్పెషల్ లుక్ తీసుకొచ్చాడు. కన్నింగ్ అండ్ కరెప్టడ్ పోలీస్ గా చక్కగా నటించాడు. ఇతడి యాక్టింగ్ సినిమాకు మరింత కొత్తదనం తీసుకొచ్చింది. ఇక కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసిన ప్రియదర్శి కూడా చాలా బాగా చేశాడు. కేవలం కామిక్ పాత్రలే కాకుండా, ఇలాంటి సీరియస్ క్యారెక్టర్లు కూడా చేయగలనని మరోసారి రుజువుచేశాడు. సామ్రాట్, ఆదర్శ్ బాలకృష్ణ తమ పరిధి మేరకు నటించారు.

 

టెక్నీషియన్స్ పనితీరు
ఈ సినిమాకు టెక్నీషియన్సే బ్యాక్ బోన్. నిజానికి ఇలాంటి సినిమాకు కావాల్సిందే అదే. ఈ విషయంలో టెక్నీషియన్స్ అంతా సక్సెస్ అయ్యారు. ఎవర్నీ తక్కువ చేయడానికి వీల్లేదు. సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ, రఘుదీక్షిత్ నేపథ్య సంగీతం మేజర్ హైలెట్స్. ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ మొత్తం విభాగాలన్నింటినీ సక్సెస్ ఫుల్ గా నడిపించిన దర్శకుడు విజయ్ యెలకంటిని ఇక్కడ ప్రత్యేకంగా మెచ్చుకోవాలి.

కెరీర్ స్టార్టింగ్ లో ఎవరైనా ప్రేమకథల వెంటపడతారు. మాస్-మసాలా లాంటి సేఫ్ జోన్ సెలక్ట్ చేసుకుంటారు. కానీ విజయ్ మాత్రం తను రాసుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ కథను నమ్మాడు. అంతకంటే ఎక్కువగా టెక్నీషియన్స్ ను, మంచు లక్ష్మిని నమ్మాడు. అతడి నమ్మకం నిజమైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష
నిజాలు మాట్లాడుకుంటే ఇలాంటి కథలు తెలుగు తెరకు, టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త కాదు. ఎందుకంటే ఇలాంటి కథలతో ప్రేక్షకుడ్ని ఎంత ఉత్కంఠకు గురిచేశాం… లాస్ట్ మినిట్ వరకు సీట్ ఎడ్జ్ లో ఎలా కూర్చోబెట్టగలిగాం అనేది ఇంపార్టెంట్. ఇలాంటి సినిమాల సక్సెస్ లకు కొలమానం కూడా అదే. ఈ మీటర్ ను ‘వైఫ్ ఆఫ్ రామ్’ అందుకుంది.

సినిమా ఆద్యంతం (ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు) ఒక టెంపోలో సాగిపోతుంది. ఎక్కడా ప్రేక్షకుడి మూడ్ డైవర్ట్ అవ్వదు. కథ నుంచి డీవియేషన్ ఉండదు. పాప్ కార్న్ కోసం బయటకు వెళ్లడాలు కనిపించవు. అలా స్క్రీన్ ప్లే విషయంలో వైఫ్ ఆఫ్ రామ్ కు ఫస్ట్ క్లాస్ మార్కులు వేయాల్సిందే. ఈ విషయంలో దర్శకుడితో పాటు టెక్నికల్ టీం అందరికీ ఫుల్ మార్కులు పడతాయి.

దర్శకుడు ఎంత చక్కగా రాసుకున్నా, టెక్నికల్ టీం ఎంత పక్కాగా ప్రెజెంట్ చేసినా.. లీడ్ క్యారెక్టర్ డ్రైవ్ చేయకపోతే సినిమా తేలిపోతుంది. లక్కీగా వైఫ్ ఆఫ్ రామ్ కు ఆ సమస్య రాలేదు. మంచు లక్ష్మి ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఔట్ పుట్ ఇచ్చారు. తను ఎంత చేయగలరో అంతకంటే కాస్త ఎక్కువే కష్టపడ్డారు ఈ సినిమా కోసం. తనకు అవార్డులు రావొచ్చేమో అంటూ ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ లో తప్పులేదనిపిస్తుంది.

పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వైఫ్ ఆఫ్ రామ్. దీక్ష భర్తను ఎవరు చంపారనే కోణంలో సాగిపోయే ఈ సినిమా లోపలకు వెళ్లేకొద్దీ ఊహించని ట్విస్టులతో సాగిపోతుంది. క్లైమాక్స్ కు వచ్చేసరికి ప్రేక్షకుడికి ఓ క్లారిటీ, అంతకుమించి ఓ బలమైన సందేశం కూడా అందుతుంది. థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఫస్ట్ మంచు లక్ష్మి, తర్వాత ప్రియదర్శి, ఎస్ఐ సత్యం పాత్ర పోషించిన శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలు మాత్రమే గుర్తుంటాయి.

ఇక ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది మూవీ జానర్ మాత్రమే. అవును.. ఇలాంటి కథలు అందరికీ ఎక్కవు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి. సో.. ఈ జానర్ స్టోరీస్ ఇష్టపడే వాళ్లకు మాత్రమే వైఫ్ ఆఫ్ రామ్ నచ్చుతుంది. కమర్షియల్ గా ఇది ఏ రేంజ్ సినిమా అనేది కూడా ఆ జానర్ ఆడియన్స్ థియేటర్లకు వచ్చేదానిపైనే ఆధారపడి ఉంటుంది.

రేటింగ్2.5/5