బందోబస్త్ మూవీ రివ్యూ

Friday,September 20,2019 - 03:22 by Z_CLU

నటీనటులు: సూర్య, మోహన్ లాల్, బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు
ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె. కిరణ్
ఎడిటర్: ఆంటోనీ
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్
సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. ప్రభు
సంగీతం: హరీశ్ జైరాజ్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
నిర్మాత: సుభాస్కరణ్
దర్శకత్వం: కె.వి. ఆనంద్
డ్యూరేషన్: 2 గంటల 45 నిమిషాలు
సెన్సార్ : U/A
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 20, 2019

కథ

చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) భారత ప్రధాని. కశ్మీర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన చంద్రకాంత్ హత్యకు గురవుతారు. ప్రధాన రక్షణ సలహాదారుగా ఉన్న రవికిషోర్ (సూర్య), ఆ ప్రమాదం నుంచి ప్రధానిని కాపాడలేకపోతాడు. ఇక రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల మధ్య చంద్రకాంత్ వర్మ తనయుడు అభిషేక్ వర్మ (ఆర్య) ప్రైమ్ మినిస్టర్ గా మారతాడు. రవికిషోర్ పై నమ్మకంతో, సస్పెండ్ అయినప్పటికీ తిరిగి తన రక్షణ బాధ్యతను అతడికే అప్పగిస్తాడు అభిషేక్. అయితే ఇతడ్ని కూడా చంపడానికి కుట్రలు మొదలవుతాయి.

ఇంతకీ చంద్రకాంత్ వర్మను చంపింది ఎవరు? అతడి తనయుడ్ని కూడా చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? పాకిస్థాన్ ఉగ్రవాదులతో ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? ఈ మొత్తం కుట్రను రవికిషోర్ ఎలా చేధించాడనేది బ్యాలెన్స్ కథ.

నటీనటుల పనితీరు

సూర్య మరోసారి తన టాలెంట్ చూపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. అయితే అతడి పాత సినిమాల టైపులో మేనరిజమ్స్, గెటప్స్ పరంగా సూర్య నుంచి ఆశించిన మెరుపుల్లేవు. పాకిస్థాన్ లో పనిచేసిన సీక్రెట్ ఏజెంట్ గెటప్ లో మాత్రం సూర్య మెప్పిస్తాడు. కానీ సినిమాలో ఆ ఎపిసోడ్ చాలా చిన్నది. అది మినహాయిస్తే, అతడి గెటప్ నార్మల్ గానే ఉంటుంది. ప్రధానిగా మోహన్ లాల్ హుందాగా నటించాడు. ప్రధాని కొడుకుగా, అల్లరిచిల్లరిగా కనిపించే పాత్రలో ఆర్య ఎనర్జిటిక్ గా కనిపించాడు.

ఇక హీరోయిన్ సాయేషాకు ఉన్నంతలో మంచి పాత్రే దక్కింది. కాకపోతే ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగాలేదు. ఆమె చుట్టూ సస్పెన్స్ అల్లాలనుకున్న దర్శకుడి ప్రయత్నం బాగుంది కానీ అది స్క్రీన్ పై సక్సెస్ కాలేదు. బిజినెస్ మెన్ కమ్ విలన్ గా బొమన్ ఇరానీ, మరో విలన్ గా ప్రేమ్ కుమార్ చక్కగా నటించారు. సపోర్టింగ్ రోల్స్ చేసిన సముత్తరఖని, పూర్ణ, నాగినీడు తమ పాత్రలకు న్యాయంచేశారు.

టెక్నీషియన్స్ పనితీరు

దర్శకుడు కేవీ ఆనంద్ సినిమాల్లో టెక్నికల్ అంశాలపై వంక పెట్టడానికి ఏం ఉండదు. స్వతహాగా టెక్నీషియన్ కావడంతో అతడి సినిమాలు చాలా రిచ్ గా ఉంటాయి. బందోబస్త్ లో ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. కిరణ్ ను ఈ విషయంలో తప్పక అభినందించాల్సిందే. మినిస్టర్ ఆఫీస్, ఉగ్రవాదుల దాడి సన్నివేశాలతో పాటు సాంగ్స్ లో కూడా కిరణ్ ఆర్ట్ వర్క్ మెప్పిస్తుంది. ఎం.ఎస్. ప్రభు సినిమాటోగ్రఫీ, హరీష్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కానీ హరీష్ కంపోజ్ చేసిన పాటలు మాత్రం బాగాలేవు. ఇక ఆంటోనీ ఎడిటింగ్ కూడా అక్కడక్కడ గాడి తప్పింది.

దర్శకుడిగా కేవీ ఆనంద్ తనకిష్టమైన జానర్ ను ఎంచుకున్నాడు తప్ప, సూర్యను మెప్పించాలనే ప్రయత్నం చేయలేదు. అందుకే గతంలో కేవీఆనంద్-సూర్య కాంబోలో వచ్చిన బ్రదర్స్ సినిమా టైపులో సూర్య పాత్రకు కొత్తదనం ఇవ్వలేకపోయాడు. కేవలం కథ, స్క్రీన్ ప్లేపై మాత్రమే దృష్టిపెట్టాడు. కథకుడిగా ఆయన సక్సెస్ అయ్యాడు కానీ, స్క్రీన్ ప్లేలో మాత్రం పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయాడు. పైగా తన గత సినిమాలతో పోల్చి చూస్తే, బందోబస్త్ అనేది కేవీ ఆనంద్ మార్క్ మూవీ కాదు.

జీ సినిమాలు సమీక్ష

సూర్య సినిమాల్లో కథలు కొత్తగా ఉంటాయి. క్యారెక్టరైజేషన్లు కూడా కొత్తగా ఉంటాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. తన సినిమాల్లో కథలు కూడా రెగ్యులర్ గానే ఉంటాయని కొన్నేళ్లుగా నిరూపిస్తూ వస్తున్నాడు సూర్య. బందోబస్త్ కూడా అలాంటి రొటీన్ కథే. కాకపోతే రిచ్ బ్యాక్ డ్రాప్. ప్రధానమంత్రి, రక్షణమంత్రి, ఎన్ఎస్జీ కమెండోలు, టెర్రరిస్టులు, బాంబ్ బ్లాస్ట్ లు.. ఇలా సాగుతుంది వ్యవహారం. మిగతాదంతా ఫక్తు థ్రిల్లర్ కు ఏమాత్రం తీసిపోదు.

ఇక్కడ సూర్య కంటే ముందుగా దర్శకుడు కేవీ ఆనంద్ గురించి మాట్లాడుకోవాలి. థ్రిల్లర్ సినిమాలు తీయడంలో ఇతడు దిట్ట. మరీ ముఖ్యంగా ట్విస్టులకు పెట్టింది పేరు ఈ డైరక్టర్. కానీ బందోబస్త్ లో మాత్రం ఆ మేజిక్ కనిపించదు. మరీముఖ్యంగా ట్విస్ట్ లు పక్కనపెట్టి, నెరేషన్ ను ఫ్లాట్ గా చెప్పడంతోనే వచ్చింది చిక్కంతా. ఎప్పుడైతే విలన్ ఎవరనేది తెలిసిపోయిందో అప్పటివరకు ఉన్న సస్పెన్స్ మొత్తం పోతుంది. ఇంకేముంది.. విలన్ ను హీరో చంపితే పనైపోతుందన్నట్టు ప్రేక్షకుడు రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోతాడు. విలన్ ఎవరనే విషయాన్ని మధ్యలోనే విడమర్చి చెప్పి ఆడియన్స్ ఎక్సయిట్ మెంట్ ను నాశనం చేసిన ఘనత దర్శకుడికే దక్కుతుంది.

కేవీ ఆనంద్ పేరుచెప్పగానే తెలుగు ప్రేక్షకుడికి ఎవరికైనా రంగం సినిమా గుర్తొస్తుంది. అందులో ట్విస్ట్ లు, అతడు ఎంచుకున్న ప్లాట్ అంతా పెర్ ఫెక్ట్ గా సింక్ అయింది. పైపెచ్చు ఆ సినిమాలో పాటలు కూడా హిట్. దాదాపు బందోబస్త్ కూడా ఇలాంటి కథే. కానీ రంగం టైపులో ఆఖరి వరకు సస్పెన్స్ ను మెయింటైన్ చేయలేకపోయాడు దర్శకుడు. సినిమాకు అదే పెద్ద మైనస్ పాయింట్ అయింది. చివరికి రంగం టైపులో మంచి పాటలు కూడా బందోబస్త్ లో లేవు.సంబంధం లేకపోయినా రీసెంట్ గా వచ్చిన “ఎవరు” సినిమా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాంటి ట్విస్ట్ లు చూసిన ప్రేక్షకులకు బందోబస్త్ స్క్రీన్ ప్లేలో వేసిన లాక్స్ చాలా చిన్నవిగా, ముందే ఊహించేలా అనిపిస్తాయి. దీనికి తోడు రన్ టైమ్ కూడా తెలుగు ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బందిపెడుతుంది.

సూర్య ఎప్పట్లానే తన వంతు అవుట్ పుట్ ఇచ్చాడు. అతడి యాక్టింగ్ ను వంక పెట్టడానికి లేదు. సినిమా కోసం ఎంత చేయాలో అంత చేశాడు. అయితే బందోబస్త్ ట్రయిలర్ చూసిన ప్రేక్షకులకు సూర్య నుంచి రకరకాల గెటప్స్ ఉంటాయని ఆశించారు. సినిమాలో అలాంటిదేం లేదు. చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే అది కనిపిస్తుంది. దీనికితోడు ప్రధానమంత్రి సెక్యూరిటీని చాలా సిల్లీగా చూపించారు. సెక్యూరిటీ వ్యవస్థను ఓ బయట వ్యక్తి బ్రేక్ చేయడం ఫన్నీగా అనిపిస్తుంది. ఇవన్నీ పక్కనపెడితే, టెక్నికల్ గా సినిమా హై-స్టాండర్డ్స్ లో ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్
– సూర్య యాక్టింగ్
– టెక్నికల్ అంశాలు
– యాక్షన్ సీన్స్
– ఇంటర్వెల్ ట్విస్ట్
– బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్
– ఫ్లాట్ నెరేషన్
– పాటలు
– ఊహించే ట్విస్టులు
– రన్ టైమ్

ఓవరాల్ గా బందోబస్త్ సినిమా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు మాత్రమే నచ్చుతుంది. అది మినహా మరో ఎంటర్ టైన్ మెంట్ కనిపించదు. సూర్య నుంచి ఎక్కువగా ఆశించి సినిమాకు వెళ్తే నిరాశ తప్పదు.

రేటింగ్2.5/5