సైరా నరసింహా రెడ్డి మూవీ రివ్యూ

Wednesday,October 02,2019 - 01:51 by Z_CLU

నటీనటులు : చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, నాజర్,బ్రహ్మాజీ, రోహిణి, నిహారిక తదితరులు

సంగీతం : అమిత్ త్రివేది, జూలియస్ ఫాకియం

ఛాయాగ్రహణం : రత్నవేలు

ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్

కథ : పరుచూరి బ్రదర్స్

మాటలు : సాయిమాధవ్ బుర్రా

రచనా సహకారం : సత్యానంద్, భూపతి రాజా, డీఎస్ కన్నణ్, మధుసూధన్, వేమారెడ్డి

కాస్ట్యూమ్ డిజైనర్ : సుస్మిత కొణెదల

సమర్పణ : శ్రీమతి సురేఖ కొణెదల

నిర్మాత : రామ్ చరణ్ కొణెదల

నిర్మాణం  : కొణెదల ప్రొడక్షన్స్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సురేందర్ రెడ్డి

నిడివి : 170 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 2 అక్టోబర్ 2019

మెగా స్టార్ డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహ రెడ్డి’ భారీ అంచనాల నడుమ ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మరో గొప్ప సినిమాగా నిలిచిందా..? ‘సైరా’ విజయంతో తన కలను నెరవేర్చుకోవాలనుకున్న చిరు కోరిక నేరవేరిందా..? ఇంతకీ సైరా అభిమానులను అలరించి బ్లాక్ బస్టర్ అనిపించుకుందా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ తన సైనికుల్లో స్ఫూర్తి నింపడానికి ఉయ్యాలవాడ కథ చెబుతుంది. ఇప్పటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. చిన్నతనం నుండే ఆంగ్లేయుల అరాచకాలపై కోపంతో ఊగిపోయే నరసింహా రెడ్డి, గోసాయి వెంకన్న దగ్గర శిష్యుడిగా చేరి యుద్ద విద్యలు నేర్చుకుంటాడు. అలా యుద్ద విద్యల్లో నైపుణ్యం పొందుతూ పెరిగి పెద్దవుతాడు.

ఇక రేనాడు ప్రాంతాన్ని 61 మంది చిన్న చిన్న సంస్థానాలుగా చేసుకొని పాలెగాళ్ళుగా పాలిస్తుంటారు. వీరిలో ఒకరంటే ఒకరికి పడదు. ఇక ఉయ్యాలవాడను పాలించే నరసింహారెడ్డి తెల్లదొరలు శిస్తు కోసం ప్రజలను హింసించడాన్ని చూసి వాళ్లకు ఎదురెళ్ళి ప్రజలకు అండగా నిలబడతాడు. తెల్లవారిని చంపుతూ స్వాతంత్రం కోసం ఒంటరిగా పోరాటం మొదలుపెడతాడు. ఈ క్రమంలో నరసింహారెడ్డికి కొందరు పాలెగాళ్ళు అండగా నిలుస్తారు. తను చిన్నతనంలోనే పెళ్ళాడిన భార్యను అలాగే తనకు జన్మించిన కొడుకును, తన కుటుంబాన్ని విడిచిపెట్టి స్వాతంత్రం కోసం పోరాటం మొదలు పెట్టి తనకు అండగా నిలిచే పాలేగాళ్ళు, జనాలతో కలిసి యుద్ధం మొదలు పెడతాడు.

యుద్ధంలో చివరికి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెల్లవారికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. తన మరణంతో ప్రజలకు ఎలాంటి స్ఫూర్తి నిచ్చాడు..? అసలు తెల్లవాళ్ళు నరసింహారెడ్డిని ఉరి తీసి అతని తలను ముప్పై ఏళ్ళు వేళాడదీయడానికి కారణం ఏమిటి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

నటీ నటుల పనితీరు :

నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ కాకుండా మరొకరిని ఊహించుకోలేం. అంతలా పాత్రలో ఒదిగిపోయి ఎప్పటిలాగే నటనతో అదరగోట్టేసాడు చిరు. ఆరు పదుల వయసులో ఇలాంటి పాత్రతో మెప్పించడం అంటే ఆషామాషీ కాదు. కొన్ని సందర్భాల్లో చిరు కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది కూడా. ఎమోషన్ పండించే సన్నివేశాల్లో, వీరత్వం చూపిస్తూ తెల్లవాళ్ళకి ఎదురెళ్ళిన సన్నివేశాల్లో, అలాగే యుద్ద సన్నివేశాల్లో మెగాస్టార్ కి సాటిలేరెవ్వరు. ఇక గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ మంచి నటన కనబరిచారు. నరసింహారెడ్డి భార్య సిద్దమ్మగా నయనతార తన నటనతో ఆకట్టుకుంది. ఇక నరసింహారెడ్డి ప్రియురాలు లక్ష్మి పాత్రలో తమన్నా బాగా నటించింది. పాటలు, నృత్యంతో ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రేకెత్తించే సన్నివేశాల్లో అందరినీ ఆకట్టుకుంది.

ఇక ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో అనుష్క సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పాత్ర చిన్నదే అయినా సినిమాకు కీలకంగా నిలిచింది. వీరారెడ్డిగా జగపతి బాబు , అవుకురాజు గా సుదీప్, రాజ పాండీగా విజయ్ సేతుపతి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఎమోషనల్ సన్నివేశాల్లో రోహిణి నటన బాగుంది. అలాగే కన్నింగ్ క్యారెక్టర్ తో రవికిషన్ మెప్పించాడు. రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫీతో పాటు ఆర్ట్ వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో రత్నవేలు కెమెరా వర్క్ , షాట్స్ ఎట్రాక్ట్ చేస్తాయి. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనింగ్ సినిమాకు ప్లస్ అయింది. అలాగే సినిమాకు ఎంతో ముఖ్యమైన కాస్ట్యూమ్, మేకప్ కూడా చక్కగా కుదిరాయి. అమిత్ త్రివేది అందించిన సైరా టైటిల్ సాంగ్ ఆకట్టుకుంది. ఆ పాట చిత్రీకరణ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇక జూలియస్ ఫాకియం అందించిన నేపథ్య సంగీతం అక్కడక్కడా బాగుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం మైనస్ అనిపించింది. శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ ఓకే. మొదటి భాగంలో ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుందేది. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు హైలైట్. గ్రెగ్ పావెల్, లీ విటేకర్, రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి విజిల్స్ వేయించాయి.

ఇక సినిమాకు పనిచేసిన ఐదుగురు ఆర్ట్ డైరెక్టర్స్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. వారి కష్టం సినిమాలో కనిపించింది. కొన్ని సన్నివేశాల కోసం వేసిన ప్రత్యేకమైన భారీ సెట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పరుచూరి కథకు సురేందర్ రెడ్డి రీసెర్చ్ చేసి రాసుకున్న స్క్రీన్ ప్లే కలిసొచ్చింది. సాయి మాధవ్ బుర్రా అందించిన కొన్ని డైలాగ్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తూ క్లాప్స్ కొట్టించాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ లో చిరంజీవి పవర్ ఫుల్ వాయిస్ తో చెప్పే డైలాగ్స్ అందరినీ అలరిస్తాయి. సురేందర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా చాలా అనుభవం పొందాడని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడా తడబడినా చివరికి సినిమాను నిలబెట్టగలిగాడు. కొణిదెల ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. నిర్మాతగా రామ్ చరణ్ ఎక్కడా రాజీపడకుండా ఖర్చు పెట్టాడు. అలా ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్ మీద కనబడుతుంది.


జీ సినిమాలు సమీక్ష:

“ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. నా 12 ఏళ్ల కల”

“పుష్కర కాలంగా నటించాలనుకుంటున్న సినిమా”

సైరా గురించి చిరంజీవి ఎందుకు ఇంతలా ఎక్సయిట్ అవుతున్నారో రిలీజ్ కు ముందువరకు చాలామందికి అర్థంకాలేదు. సైరా చూసిన వాళ్లకు మాత్రం ఇప్పుడు అర్థమౌతుంది. అవును.. నిజంగా ఇది చిరంజీవి చేయాల్సిన సినిమా. ఇందులో లేనిదంటూ లేదు. యుద్ధం, ధైర్యం, బీభత్సం, సెంటిమెంట్, ఎమోషన్.. అన్నింటికీ మించి దేశభక్తి..ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టే చిరంజీవి ఈ సినిమా చేయాలనుకున్నారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. తను ఫీలైన ఎమోషన్స్ అన్నింటినీ ప్రేక్షకులు కూడా ఫీలయ్యేలా చేశారు. అందుకే సైరా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నిజంగా ఇది ఇప్పుడు చేయాల్సిన సినిమానే. కథ బాగుంది కదా అని పదేళ్ల కిందటే చిరంజీవి ఈ సినిమా చేసి ఉన్నట్టయితే ఇంత మంచి అవుట్-పుట్ వచ్చి ఉండేది కాదు. కానీ పదేళ్ల కిందట చేసినట్టయితే చిరంజీవిలో ఎనర్జీ లెవెల్స్ ను మరింత బాగా ఎంజాయ్ చేసేవాళ్లం అదొక్కటి మినహాయిస్తే సైరా ఇప్పటి టెక్నాలజీను వాడుకొని మెస్మరైజ్ చేసింది. యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి ఎనర్జీ లెవెల్స్ వయసురీత్యా కాస్త తగ్గినట్టు కనిపించినప్పటికీ.. యాక్టింగ్ లో ఆ జోష్ మాత్రం తగ్గలేదు. కాస్త వేగం తగ్గినా వాడి తగ్గలేదు. అదే చిరంజీవి మెగాతనం అనిపిస్తుంది.

పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమాను ప్రారంభించి ఆ తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఝాన్సీ లక్ష్మీభాయ్ తన సైనికుల్లో స్పూర్తి నింపడానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పడంతో కథ మొదలుపెట్టాడు సురేందర్ రెడ్డి. ఝాన్సీ లక్ష్మీభాయ్ గా అనుష్క కథను మొదలుపెట్టిన విధానం, ఆమె ఆహార్యం అన్నీ సినిమాపై ఆసక్తి పెంచుతాయి. కాకపోతే మొదటి భాగంలో ఇంకాస్త బలమైన సన్నివేశాలు పడుంటే బాగుండేది. అలాగే సినిమా మొత్తానికి ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించే సన్నివేశాలు బిల్డప్ షాట్స్ అరడజను లోపే ఉన్నాయి. చిరు ఎంట్రీ కూడా మామూలుగానే అనిపించింది. అలా కాకుండా గుర్రపు స్వారీ లేదా తమన్నాను కాపాడే సన్నివేశంలో పవర్ ఎంట్రీ ఉంటే అదిరిపోయేది.

సైరా సినిమాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పూర్తి కథతో కాకుండా ఫిక్షన్ యాడ్ చేసి తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక్కడే సురేందర్ రెడ్డిని మెచ్చుకోవాలి. సైరా ను ఓ సాదాసీదా బయోపిక్ లా తీస్తే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు. ఈ విషయాన్ని ముందే గమనించి అందరినీ ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. సినిమాను కొంత ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కించినప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనాన్ని అతని ఔన్నత్యాన్ని, అలాగే తొలిసారి ఆంగ్లేయులపై ఎదురుతిరిగి నిలిచిన వీరత్వాన్ని చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. కాకపోతే కొన్ని సన్నివేశాలు బాహుబలిని గుర్తుచేస్తాయి. ముఖ్యంగా యుద్ద సన్నివేశాల్లో ఎత్తుకు పైఎత్తులు, యుద్ద విన్యాసాలు బాహుబలిని గుర్తుచేస్తాయి. కానీ  బాహుబలిలో ఆకట్టుకున్నంతలా ఇందులో ఆ సన్నివేశాలు ఆకట్టుకోలేపోయాయి. యుద్ద సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇక మొదటి భాగం లో కొన్ని సన్నివేశాలతో పరవాలేదు అనిపించగా ఇంటర్వెల్ నుండి సినిమాపై ఒపీనియన్ మారిపోతుంది. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే భారీ యుద్ద సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక చివరి 10 నిమిషాలు దేశభక్తితో ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నరసింహా రెడ్డి, లక్ష్మీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ మాత్రం పెద్దగా ఎట్రాక్ట్ చేయలేదు. అసలు నరసింహారెడ్డి, లక్ష్మి ఎందుకు  ప్రేమలో పడతారో ఎలా పడతారో అనే అనుమానాలు ప్రేక్షకుడికి కలుగుతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో మెలోడ్రామా ఎక్కువైంది కూడా. అవి మినహాయిస్తే సినిమాలో మైనస్ పాయింట్స్ పెద్దగా కనిపించవు.

ఆరుపదుల వయసులో ఎలాంటి కథను ఎంచుకోవడం ఒకేత్తైతే యుద్ద వీరుడిగా నటించి మెప్పించడం మరో ఎత్తు. ఈ విషయంలో మెగాస్టార్ ను కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. భారీ వ్యయంతో సినిమాను నిర్మించి తండ్రి కలను నెరవేర్చిన కొడుకుగా చరణ్ ని అభినందించాల్సిందే. ఫైనల్ గా మెగా స్టార్ అభినయానికి, సురేందర్ రెడ్డి విజన్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

బాటమ్ లైన్ : ‘సైరా’ మెగాస్టార్

రేటింగ్ : 3.5/5